- ఖైరతాబాద్ తరలివచ్చిన లక్షలాది మంది
హైదరాబాద్ సిటీ, వెలుగు:ఖైరతాబాద్ సప్తముఖ మహా గణపతి దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం దర్శనానికి చివరి రోజు కావడంతో ఉదయం 4 గంటల నుంచే గణనాథుడిని దర్శించుకోవడానికి క్యూకట్టారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రావడంతో ఖైరతాబాద్ పరిసరాలన్నీ పిల్లలు, పెద్దలతో సందడిగా మారాయి.
సాయంత్రం సమయానికి ప్రాంగణం మొత్తం భక్తులతో ఇసుకేస్తే రాలనంతగా నిండిపోయింది. దాదాపు ఏడు లక్షల మంది మహా గణనాథుడిని దర్శించుకున్నట్లు సమాచారం. సాయంత్రం సమయంలో క్యూలైన్లలో స్వల్ప తోపులాట జరగడంతో వృద్ధులు, పిల్లలు ఇబ్బందులు పడ్డారు. మంగళవారం నాడు మహాగణపతి నిమజ్జనం నిర్వహించనున్నారు. ఉదయం ఆరున్నర గంటలలోపు చివరి పూజలు ముగించుకొని గణనాథుడి ఊరేగింపు మొదలు కానుంది. మధ్యాహ్నం 1.30లోపు నిమజ్జనం పూర్తి కానుంది. సోమవారం నిమజ్జన ఏర్పాట్లు చేస్తుండటంతో భక్తులకు దర్శనం ఉండదని నిర్వాహకులు తెలిపారు. ఆదివారం అర్ధరాత్రి నుంచే దర్శనం నిలిపివేశారు.