19న ఖైరతాబాద్​ బడా గణేశ్ నమూనా ప్రకటన

19న ఖైరతాబాద్​ బడా గణేశ్ నమూనా ప్రకటన
  • ఉత్సవాల నిర్వహణకు 100 మందితో అడహక్ కమిటీ 

ఖైరతాబాద్, వెలుగు: ఖైరతాబాద్​లో గణేశ్ ఉత్సవాలు మొదలుపెట్టి 70 ఏండ్లు కావస్తున్న నేపథ్యంలో ఈసారి 70 అడుగుల వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. బుధవారం ఖైరతాబాద్ గణేశ్​మండపం వద్ద ప్రెస్​మీట్​పెట్టి స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ వివరాలు వెల్లడించారు. ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అన్నిరకాల ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఇందుకోసం 100 మందితో అడహక్​కమిటీ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.

ఖైరతాబాద్ గణేశ్​ ఉత్సవ కమిటీ, శ్రీగణేశ్​ఉత్సవ కమిటీల మధ్య విభేదాల నేఫథ్యంలో కొత్తగా అడహక్ కమిటీని ఏర్పాటు చేశామన్నారు. ఇరు కమిటీల ఆలోచనలను పరిగణనలోకి తీసుకున్నట్లు స్పష్టం చేశారు. ఇందులోని 100 మందిని ఐదు సబ్​కమిటీలుగా విభజించి ఆయా బాధ్యతలు అప్పగించినట్లు వెల్లడించారు. దాతల ఆర్థిక సాయంతో పేదలకు సాయం చేస్తామన్నారు. ఖైరతాబాద్ వాసుల కోసం మల్టీ పర్పస్ కమ్యూనిటీ హాల్​నిర్మిస్తున్నామని, నామినల్​ఫీజు చెల్లించి వినియోగించుకోవచ్చని తెలిపారు.

అడహక్​కమిటీకి చైర్మన్​గా రాజ్​కుమార్​ఉంటారన్నారు. కమిటీ సభ్యులందరికీ గుర్తింపు కార్డులు ఇస్తామని చెప్పారు. ఎన్నారైల కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశామని, నేరుగా స్వామివారిని దర్శించుకునే వెసులుబాటు కల్పిస్తున్నామని తెలిపారు. 11 రోజుల పాటు ప్రసాద పంపిణీ ఉంటుందన్నారు. పోలీసులు, విలేకర్లు, వలంటీర్లకు భోజన సదుపాయం కల్పిస్తామన్నారు. కమిటీ చైర్మన్ రాజ్​కుమార్​మాట్లాడుతూ ఈ ఏడాది 70 అడుగుల విగ్రహం ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ నెల 19న విగ్రహ నమూనాను ప్రకటిస్తామని తెలిపారు.