- 15 రోజుల్లో కాంగ్రెస్లో బీఆర్ఎస్ ఎల్పీ విలీనం: దానం
- బీఆర్ఎస్లో ఎమ్మెల్యేలను పురుగుల్లా చూసెటోళ్లు
- పార్టీ ఆఫీసును కేటీఆర్కార్పొరేట్ కంపెనీలా నడిపిండు
- ఆయన ఫ్రెండ్స్, బినామీలు వేల కోట్లు దోచుకున్నరు
- త్వరలోనే ఆ కథలన్నీ బయటపెడ్తానని వెల్లడి
హైదరాబాద్, వెలుగు : బీఆర్ఎస్ లో నలుగురు ఎమ్మెల్యేలు మాత్రమే మిగులుతారని కాంగ్రెస్ నేత, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. రెండ్రోజుల్లో మరో ఆరుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరనున్నారని తెలిపారు. కేవలం15 రోజుల్లో కాంగ్రెస్ లో బీఆర్ఎస్ ఎల్పీ విలీనం కాబోతున్నదని చెప్పారు. శుక్రవారం హైదరాబాద్ లోని ఎమ్మెల్యే క్వార్టర్స్ లో కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులను దానం పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్, కేటీఆర్ పై సంచలన కామెంట్లు చేశారు.
‘‘బీఆర్ఎస్ కార్యాలయాన్ని కేటీఆర్ కార్పొరేట్ కంపెనీలాగా నడిపారు. కేసీఆర్ ను కలవాలంటే ఎమ్మెల్యేలకు అపాయిట్మెంట్ కూడా దొరికేది కాదు. ఒకవేళ దొరికినా గంటల తరబడి ఎదురుచూడాల్సి వచ్చేది. బీఆర్ఎస్ లో ఎమ్మెల్యేలను పురుగుల్లా చూసేవారు. అందుకే విలువ లేని చోట ఉండలేక, బీఆర్ఎస్ పై నమ్మకం లేక ఆ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతున్నారు” అని చెప్పారు. కాంగ్రెస్ లో స్వేచ్ఛ, అందరికీ విలువ కూడా ఉంటుందని తెలిపారు.
బీఆర్ఎస్అక్రమాలన్నీ బయటపెడ్తా..
బీఆర్ఎస్ హయాంలో నిధుల్లేక నియోజకవర్గాలను అభివృద్ధి చేయలేకపోయామని దానం అన్నారు. గతంలో కాంగ్రెస్ హయాంలో ఎమ్మెల్యేలకు స్పెషల్ డెవలప్ మెంట్ ఫండ్ ఉండేదని, కానీ బీఆర్ఎస్ పాలనలో ఆ ఫండ్ లేకపోవడంతో ఇబ్బందులు పడ్డామని చెప్పారు. ‘‘బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కొంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలు వేల కోట్లు దోచుకున్నారు. పదేండ్లలో కేటీఆర్ బినామీలు వేల కోట్లు దండుకున్నారు. త్వరలోనే సాక్ష్యాధారాలతో బయటపెడతా. బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసిన అక్రమాలన్నీ వెలికితీస్తా. కేటీఆర్ ఫ్రెండ్స్ కథలన్నీ బయటపెడతా.
గుండు శ్రీధర్, సత్యం రామలింగరాజు కొడుకుతో పాటు రాజేశ్ రాజు లాంటి వాళ్లు కేటీఆర్ ద్వారా ఎన్ని వందల కోట్లు సంపాదించారనేది లెక్కలతో సహా బయటకుతీస్తా” అని తెలిపారు. ‘‘సొంత పార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికే కేసీఆర్ పైకి మేకపోతు గాంభీర్యం చూపిస్తున్నారు. ఆరు నెలల్లో అధికారంలోకి వస్తామని అంటున్నారు. ఆయన బిడ్డ కవిత జైల్లో ఉంటే, ఆమెను బయటకు తీసుకురాకుండా రాజకీయం చేస్తున్నారు” అని విమర్శించారు.