ఖైరతాబాద్ ​గణేశ్ ఈసారి 70 అడుగులు!

ఖైరతాబాద్ ​గణేశ్ ఈసారి 70 అడుగులు!

ఖైరతాబాద్, వెలుగు:ఖైరతాబాద్ ​గణేశ్ విగ్రహ తయారీ ఏర్పాట్లను నిర్వాహకులు ప్రారంభించారు. విగ్రహ తయారీకి ముందు నిర్జల్​ ఏకాదశి రోజున  ప్రతి ఏడాది కర్రపూజ నిర్వహించడం ఆనవాయితీ. ఈ మేరకు సోమవారం సాయంత్రం తొలిపూజగా స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్​ ఆధ్వర్యంలో కర్ర పూజ నిర్వహించారు.

కాగా, ఖైరతాబాద్​లో మహా గణపతిని ప్రతిష్టించి ఈ ఏడాదితో 70 ఏండ్లు పూర్తవుతున్న సందర్భంగా ఈ సారి 70 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిర్వాహకులు భావిస్తున్నట్టు తెలిసింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దానం నాగేందర్​ మాట్లాడుతూ.. గతంలో కంటే మెరుగ్గా గణేశ్​ఉత్సవాలను నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి ఆదేశించినట్టు తెలిపారు. గత ఏడాది మాదిరిగానే గణేశుడిని దర్శించుకోవడానికి వచ్చే భక్తు లందరికీ ప్రసాదం ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. ఎన్నోఏండ్లుగా ఉత్సవాలు జరుగుతున్నాయని, అడహక్​ కమిటీ ఆధ్వర్యంలో స్థానికులతో కమిటీ ఉంటుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. 

ఖైరతాబాద్​ గణేశ్​ఉత్సవాలకు దేశ వ్యాప్తంగా కీర్తి ప్రతిష్టలు ఉన్నాయని, ఇక్కడకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్నిఏర్పాట్లు చేస్తామన్నారు. ఈ మేరకు జీహెచ్​ఎంసీ, విద్యుత్, పోలీసులు, రోడ్లు భవనాల శాఖ అధికారులు ఏర్పాట్లు చేసినట్టు చెప్పారు. భాగ్యనగర్​గణేశ్​ఉత్సవ కమిటీ కార్యదర్శి భగవంతరావు, కోశాధికారి శశిధర్, టాస్క్​ ఫోర్స్​డీసీపీ సాధన రాష్మీ పెరుమాళ్, అదనపు డీసీపీ ఆనంద్, చిక్కడ పల్లి ఏసీపీ రమేశ్, గాంధీనగర్​ ఏసీపీ మొఘలయ్య కార్యక్రమంలో పాల్గొన్నారు.