మూతపడిన కొలాం బడిని తెరిపించేదెన్నడు?

మూతపడిన కొలాం బడిని తెరిపించేదెన్నడు?
  • బైంగూడలో ఓసీపీతో మూసివేత
  •     మరోచోట నిర్మించేందుకు నిధులు మంజూరు
  •     పట్టించుకోని అధికారులు
  •     చదువుకు దూరమవుతున్న ఆదిమ గిరిజన పిల్లలు

ఆసిఫాబాద్/తిర్యాణి, వెలుగు : అడవి బిడ్డలను అక్కున చేర్చుకొని అక్షరాలు నేర్పిన గిరిజన ఆశ్రమ పాఠశాల కనుమరుగైంది. 11 ఏండ్లపాటు వందలాది మందికి విద్యాబుద్ధులు నేర్పిన కొలాం ఆశ్రమ పాఠశాల  ఓపెన్ కాస్ట్ ఏర్పాటుతో గల్లంతైంది. తిరిగి నిర్మిస్తామని ప్రభుత్వం చెప్పినా.. అధికారుల నిర్లక్ష్యంతో పత్తా లేకుండా పోయింది. ఫలితంగా ఈ ప్రాంతాల్లోని అడవి బిడ్డలు చదువుకు దూరమవుతున్నారు. ఖైరిగూడ డోర్లీ ఓపెన్ కాస్ట్​లో ఈ ఆశ్రమ పాఠశాల ముంపునకు గురికాగా.. దాని స్థానంలో కొత్త హాస్టల్ కోసం ప్రభుత్వం రూ.72 లక్షల మంజూరు చేసినప్పటికీనేటికీ నిర్మించలేదు.

స్లాబ్​వరకు నిర్మించి.. వదిలేసి

ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండలంలోని దంతన్ పల్లి (ఒంటి మామిడి) గ్రామంలో కొలాం గిరిజన ఆశ్రమ పాఠశాలను గవర్నమెంట్1984లో ఏర్పాటు చేసింది. సుమారు 11 ఏండ్ల పాటు కొనసాగిన స్కూల్లో వందలాది మంది గిరిజన బిడ్డలు ఆశ్రయం పొంది అక్కడ విద్యాబుద్ధులు నేర్చుకున్నారు. అయితే, ఈ గ్రామంలో ఖైరిగూడ ఓపెన్ కాస్ట్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించి దంతన్ పల్లి గ్రామస్తులను పునరావాసానికి తరలించనున్నట్లు వెల్లడించింది.

కొలాం హాస్టల్ ను తిరిగి పునరావాస గ్రామంలో ఏర్పాటు చేస్తామని చెప్పి రూ.72 లక్షల నిధులను ఐటీడీఏకు విడుదల చేసింది. కాగా 1993లో హాస్టల్ బిల్డింగ్ నిర్మించేందుకు చర్యలు తీసుకున్న అధికారులు స్లాబ్ వరకు పనులు చేపట్టారు. ఆ తర్వాత పనులను అర్దంతరంగా నిలిపివేశారు. 

అధికారుల నిర్లక్ష్యం

1995--–96 సంవత్సరంలో ఖైరిగుడా ఓపెన్ కాస్ట్ ప్రారంభం కావడంతో దంతన్ పల్లి కొలాం హాస్టల్ ను 1995లో ఎత్తేశారు. కానీ పునరావాస ప్రాంతంలో అసంపూర్తిగా మిగిలిపోయిన ఆ హాస్టల్​ను తిరిగి నిర్మించలేదు. జిల్లాలోని ఏకైక కొలాం హాస్టల్ ఏండ్ల కాలంగా అధికారులు పట్టించుకోకపోవడంపై జనాలు మండిపడుతున్నారు. ఆదిమ గిరిజనులకు ఆశ్రయంగా నిలిచిన స్కూల్​ను తొలగించి, తిరిగి నిర్మించకపోవడంపై చుట్టుపక్క గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

తమ పిల్లలను దూర ప్రాంతాలకు చదువు కోసం  పంపించాల్సిన పరిస్థితి ఏర్పడిందని, దీంతో చాలా మంది స్కూల్ కు పోకుండా డ్రాపవుట్ అవుతున్నారని ఆవేదన చెందుతున్నారు. బిల్డింగ్ పనులు కంప్లీట్ చేసి, హాస్టల్​ను అందుబాటులోకి తేవాలని ఐటీడీఏ అధికారులకు అనేకసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని 
చెప్తున్నారు.

ALSO READ :రాహుల్ గాంధీకి.. వడ్లకు, ఎడ్లకు తేడా తెల్వదు

పిల్లలు చదువుకు దూరమైండ్రు

కొలాం ఆదివాసీ పిల్లల చదువును అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారు. తొలగించిన స్కూల్ ను దశాబ్దాల కాలంగా ఏర్పాటు చేయలేదు. దీంతో  పేద పిల్లలు చదువు దూరమైతున్నరు. అధికారుల నిర్లక్ష్యమే ఇందుకు కారణం. హాస్టల్​ను అందుబాటులోకి తేవాలని అధికారులు, పాలకులకు ఎన్నిసార్లు చెప్పిన పట్టించుకుంటలేరు.

- ఆత్రం గంగారాం, కోలాం సంఘం జిల్లా అధ్యక్షుడు, ఆసిఫాబాద్

త్వరలో పనులు ప్రారంభిస్తం

కొలాం హస్టల్ పనులు త్వరలో ప్రారంభిస్తాం. విషయాన్ని ఐటీడీఏ పీఓ దృష్టికి తీసుకెళ్లాం. హాస్టల్​నిర్మాణ పనులు కంప్లీట్ చేసి విద్యార్థులకు అందుబాటులో తెస్తాం.

- నిరంజన్ రావు, ఐటీడీఏ డీఈ ,ఆసిఫాబాద్