- ఆరేండ్ల నిర్బంధం తర్వాత విడుదలైన బంగ్లాదేశ్ మాజీ ప్రధాని
- పార్లమెంట్‌ను రద్దు చేసిన అధ్యక్షుడు
- హసీనా పలాయనంతో చకచకా మారుతున్న పరిణామాలు
- మహ్మద్ యూనస్కే ప్రభుత్వ పగ్గాలు ఇవ్వాలని స్టూడెంట్ల డిమాండ్
- సర్కారును నడిపేందుకు ఓకే చెప్పిన ఆర్థికవేత్త
- బ్రిటన్‌లో ఆశ్రయంపై డైలమా.. భారత్‌లోనే ఉన్న హసీనా
- హసీనా షాక్‌లో ఉన్నరు.. ఆలోచించుకునేందుకు టైం ఇచ్చాం
- ఆల్ పార్టీ మీటింగ్‌లో జైశంకర్ వెల్లడి
ఢాకా/న్యూఢిల్లీ : బంగ్లాదేశ్ ప్రధాని పదవికి షేక్ హసీనా రాజీనామా చేసి భారత్‌కు వచ్చిన వెంటనే ఆ దేశంలో పరిణామాలు చకచకా మారిపోతున్నాయి. ఆరేండ్లుగా నిర్బంధంలో ఉన్న ప్రతిపక్ష నేత, మాజీ ప్రధాని ఖలీదా జియా మంగళవారం విడుదలయ్యారు. ఆమె పార్టీకి చెందిన దాదాపు వెయ్యి మంది నేతలు, కార్యకర్తలు కూడా జైళ్ల నుంచి బెయిల్‌పై రిలీజ్ అయ్యారు. పార్లమెంట్‌ను రద్దు చేసినట్టు దేశ అధ్యక్షుడు మహ్మద్ షహబుద్దీన్ ప్రకటించారు. దేశం విడిచి పారిపోయేందుకు ప్రయత్నించిన తాజా మాజీ ఐటీ మంత్రి జునైద్ అహ్మద్ పాలక్, తాజా మాజీ విదేశాంగ మంత్రి హసన్ మహ్మద్‌ను ఎయిర్ పోర్టు వద్ద అదుపులోకి తీసుకున్నారు.
అలాగే ఆర్మీలోని ప్రధాన పోస్టులు నిర్వహిస్తున్న అధికారులనూ మార్చేశారు. స్వాతంత్ర్య సమరయోధుల పిల్లలకు 30% కోటాపై అల్లర్లు చెలరేగడంతో సోమవారం హసీనా గద్దె దిగిపోయి భారత్ కు పారిపోయి వచ్చారు. ఈ నేపథ్యంలో కొత్తగా తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు త్రివిధ దళాల అధిపతులు, వివిధ రాజకీయ పార్టీల నేతలు, పౌర సమాజ ప్రతినిధులు, స్టూడెంట్ లీడర్లతో కూడిన బృందంతో ప్రెసిడెంట్ చర్చలు జరుపుతున్నారని అధ్యక్ష భవనం బంగభాబన్ వర్గాలు వెల్లడించాయి.
పూర్తిస్థాయి తాత్కాలిక ప్రభుత్వాన్ని త్వరలోనే అధ్యక్షుడు ప్రకటించనున్నారని తెలిపాయి. కొత్తగా ఏర్పడే తాత్కాలిక ప్రభుత్వానికి నోబెల్ విజేత, ప్రఖ్యాత ఆర్థికవేత్త మహ్మద్ యూనస్ ను అధినేతగా నియమించాలని స్టూడెంట్ ఉద్యమానికి నాయకత్వం వహించిన నహీద్ ఇస్లామ్ డిమాండ్ చేశారు. ప్రభుత్వాన్ని నడిపించేందుకు యూనస్ కూడా అంగీకరించారని వెల్లడించారు. మరోవైపు రాజకీయ ఆశ్రయం కోసం బ్రిటన్ వెళ్లాలని భావించిన హసీనాకు ఆ దేశం షాక్ ఇచ్చింది.
ముందస్తుగా ఆశ్రయం కోరుతూ తమ దేశానికి రావడం వలస చట్టాలకు విరుద్ధమని ప్రకటించడంతో ఆమె మరికొద్దిరోజులు భారత్ లోనే ఉండిపోవాల్సి వచ్చింది. బంగ్లాదేశ్ లో జరుగుతున్న పరిణామాలను నిశితంగా గమనిస్తున్నామని విదేశాంగ మంత్రి జైశంకర్ పార్లమెంట్ లో నిర్వహించిన ఆల్ పార్టీ మీటింగ్ లో వెల్లడించారు. హసీనా షాక్ లో ఉన్నారని, భవిష్యత్తుపై ఆలోచించుకునేందుకు ఆమెకు టైం ఇచ్చామని తెలిపారు.
ఖలీదా జియా విడుదల..
అవినీతి కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ చైర్ పర్సన్, మాజీ ప్రధాని ఖలీదా జియా మంగళవారం విడుదలయ్యారు. షేక్ హసీనా సర్కారు కూలిన వెంటనే ఖలీదాను విడుదల చేయాలంటూ సోమవారం సాయంత్రం దేశ అధ్యక్షుడు షహబుద్దీన్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో సోమవారం ఆమె రిలీజ్ అయ్యారు. హసీనాకు బద్ధశత్రువైన ఖలీదా జియాకు 2018లో ఓ అవినీతి కేసులో 17 ఏండ్ల జైలు శిక్ష పడింది.
కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్నందున ఆమెను జైలులో కాకుండా హౌస్ అరెస్టులో ఉంచారు. తాజాగా హసీనా పలాయనం నేపథ్యంలో ఆమె రీలీజ్ అయ్యారు. అలాగే బీఎన్ పీతోపాటు జమాత్ కు చెందిన దాదాపు వెయ్యి మంది కార్యకర్తలను కూడా వివిధ జైళ్ల నుంచి బెయిల్ పై రిలీజ్ చేసినట్లు స్థానిక మీడియా వెల్లడించింది.
24 మంది సజీవదహనం.. 440కి పెరిగిన డెత్స్
లక్షలాది మంది ఆందోళనకారుల విధ్వంసకాండతో సోమవారం దేశం అట్టుడికిపోగా.. హసీనా గద్దె దిగడంతో మంగళవారం నాటికల్లా ఆందోళనలు దాదాపుగా సద్దుమణిగాయి. అయితే, హసీనా తప్పుకున్న తర్వాత కూడా ఆందోళనకారులు సెలబ్రేషన్స్ చేసుకుంటూ విధ్వంసానికి పాల్పడ్డారు. సోమవారం ఒక్కరోజే మరో 100 మందికిపైగా అల్లర్లకు బలైపోయారు. సోమవారం సాయంత్రం జొషోర్ లో అవామీ లీగ్ నేతకు చెందిన ఓ ఫైవ్ స్టార్ హోటల్ కు ఆందోళనకారులు నిప్పు పెట్టారు.
ఈ ఘటనలో హోటల్ లోని 24 మంది సజీవదహనం అయ్యారు. ఈ ఘటనలో హోటల్ నుంచి దూకి తప్పించుకున్న ఇద్దరు ఇండియన్లు గాయపడ్డారు. దేశవ్యాప్తంగా నెల రోజులుగా జరుగుతున్న హింసలో చనిపోయినవారి సంఖ్య 440కి చేరిందని స్థానిక మీడియా వెల్లడించింది. మంగళవారం కూడా దేశంలోని అనేక చోట్ల చెదురుమదురుగా హింసాత్మక ఘటనలు జరిగాయి. ప్రధానంగా అవామీలీగ్ పార్టీ ఆఫీసులు, నేతల ఇండ్లపై దాడులు కొనసాగాయి. దేశవ్యాప్తంగా పోలీసులపై కూడా దాడులు జరగడాన్ని నిరసిస్తూ నిరవధికంగా సమ్మెకు దిగుతున్నట్టు పోలీస్ అసోసియేషన్ ప్రకటించింది.
ఢాకాలో ఆగిన నిరసనలు
సోమవారం లక్షలాది మంది ఢాకాలో విధ్వంసం సృష్టించగా.. హసీనా దేశం విడిచి వెళ్లడంతో మంగళవారం నాటికి రాజధాని నగరంలో తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. ఢాకాలో మంగళవారం ఆందోళనకారులు నిరసనలకు ముగింపు పలకడంతో పాటు ఆర్మీ, పోలీసు బలగాలు పెట్రోలింగ్ నిర్వహించాయి. రోడ్లపై వాహనాల రాకపోకలు కొనసాగాయి. ఢాకాతోపాటు ప్రధాన నగరాల్లో షాపులు, మార్కెట్లు సైతం మందకొడిగా నడిచాయి. కాగా, ఢిల్లీ నుంచి ఢాకాకు ఈవెనింగ్ ఫ్లైట్ సర్వీసులను కూడా మంగళవారం నుంచి తిరిగి ప్రారంభిస్తున్నట్టు ఎయిర్ ఇండియా వెల్లడించింది.
హిందువుల కోసం ఆర్మీ హెల్ప్ లైన్ నెంబర్లు
బంగ్లాదేశ్ లో హసీనా సర్కారు కూలిన వెంటనే రెచ్చిపోయిన అల్లరిమూకలు దేశంలోని హిందువులపై కూడా దాడులు చేశారు. సోమవారం ఢాకాలోని ఇండియన్ కల్చరల్ సెంటర్ ను తగలబెట్టారు. అనేక చోట్ల హిందువుల ఇండ్లపై, టెంపుల్స్ పై దాడులు చేశారు. అల్లరిమూకల దాడిలో ఇద్దరు హిందువులు చనిపోయారు. ఈ నేపథ్యంలో దేశంలో హిందువుల రక్షణ కోసం ఆర్మీ హెల్ప్ లైన్ నెంబర్లు ప్రకటించింది.
సర్కారును నడిపేందుకు యూనస్ ఓకే
బంగ్లాదేశ్ పార్లమెంట్ ను అధ్యక్షుడు రద్దు చేయడంతో దేశంలో తాజా ఎన్నికలకు మార్గం సుగమం అయింది. దీంతో కొత్తగా ఏర్పడే తాత్కాలిక ప్రభుత్వానికి నోబెల్ విజేత, ప్రఖ్యాత ఆర్థికవేత్త మహ్మద్ యూనస్ ను చీఫ్ అడ్వైజర్ గా నియమించాలని తాము డిమాండ్ చేసినట్టు స్టూడెంట్ ఉద్యమానికి నాయకత్వం వహించిన నహీద్ ఇస్లామ్ ప్రకటించారు. ప్రభుత్వాన్ని నడిపించేందుకు యూనస్ కూడా అంగీకరించారని వెల్లడించారు. నహీద్ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. స్టూడెంట్లు ప్రతిపాదించే వ్యక్తిని తప్ప ఇతరులెవరికీ ప్రభుత్వాన్ని అప్పగిస్తే ఊరుకోబోమని స్పష్టం చేశారు. ప్రస్తుతం పారిస్ లో ఉన్న యూనస్ కూడా కొత్త సర్కారుకు నాయకత్వం వహించేందుకు సిద్ధమేనని మీడియా ముందు ప్రకటించారు.
యూఎస్ వీసా రద్దు..
బంగ్లాదేశ్ లో తాజా పరిణామాల నేపథ్యంలో అమెరికా సైతం హసీనాకు షాక్ ఇచ్చింది. వెస్ట్రన్ కంట్రీస్ కు వెళ్లి ఆశ్రయం పొందాలని చూస్తున్న ఆమెకు యూఎస్ వీసాను రద్దు చేసింది. అమెరికాతో హసీనాకు అంతగా మంచి సంబంధాలు లేకపోవడం వల్లే ఆమెకు ఆ దేశం నో ఎంట్రీ చెప్పినట్టుగా తెలుస్తోంది.
బ్రిటన్ ఆశ్రయంపై డైలమా.. భారత్ లోనే హసీనా
బంగ్లాదేశ్ నుంచి సోమవారం భారత్ కు పారిపోయి వచ్చిన షేక్ హసీనా అర్ధరాత్రి సమయంలో బ్రిటన్ కు బయలుదేరతారని తొలుత వార్తలు వచ్చాయి. కానీ బ్రిటన్ లో రాజకీయ ఆశ్రయం విషయంలో డైలమా కొనసాగడంతో ఆమె ఘజియాబాద్ (యూపీ)లోని హిండన్ ఎయిర్ ఫోర్స్ బేస్ లోనే ఉండిపోయారు. హసీనా చెల్లెలు షేక్ రెహానా బ్రిటన్ పౌరురాలు అయినందున ఆ దేశానికి వెళ్లి ఆశ్రయం పొందాలని ఆమె భావించారు. కానీ హసీనాకు వెంటనే రాజకీయ ఆశ్రయం కల్పించేందుకు రూల్స్ అడ్డంకిగా ఉన్నాయంటూ బ్రిటన్ హోం శాఖ ప్రకటించడంతో డైలమా ఏర్పడింది. మంగళవారం హసీనాను గట్టి భద్రత మధ్య రహస్య ప్రాంతానికి తరలించారు.
నన్ను వెళ్లగొట్టిన హసీనాకూ అదే గతి: తస్లీమా నస్రీన్
షేక్ హసీనాపై ప్రవాసంలో ఉన్న బంగ్లాదేశ్ రచయిత్రి తస్లీమా నస్రీన్ ఘాటుగా స్పందించారు. ఒకప్పుడు తనను దేశం నుంచి హసీనా వెళ్లగొట్టారని.. ఇప్పుడు ఆమెకూ అదే గతి పట్టిందంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ‘‘ఒకప్పుడు చావుబతుకుల మధ్య ఉన్న నా కన్నతల్లిని చూసేందుకు నేను వెళ్తే.. ఇస్లామిస్టులను సంతృప్తిపర్చడం కోసం సొంత దేశం నుంచే నన్ను హసీనా వెళ్లగొట్టారు. ఇప్పుడు అదే ఇస్లామిస్టులు ఆమెను దేశం నుంచి గెంటేశారు” అని ఆమె కామెంట్ చేశారు. ఇప్పుడు బంగ్లాదేశ్ పాకిస్తాన్ లా మారకూడదు. ఆర్మీ పాలన వద్దు. ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడాలి” అని అన్నారు.