టొరంటో: కెనడాలో హిందూ ఆలయంపై ఖలిస్తాన్ సపోర్టర్లు దాడికి తెగబడ్డారు. ఒంటారియోలోని బ్రాంప్టన్లో ఆదివారం ఉదయం హిందూ సభా మందిర్లోకి కర్రలు, ఖలిస్తాన్ జెండాలతో దూసుకెళ్లారు. భక్తులను చితకబాదారు. హిందూ సభ మందిరం, ఇండియన్ హై కమిషన్ ఆధ్వర్యంలో ఆలయంలో క్యాంపు నిర్వహిస్తున్న విషయం తెలుసుకున్న ఖలిస్తాన్ సపోర్టర్లు.. గుడి వద్దకు చేరుకున్నారు. ఆలయం వద్ద కమిషన్ అధికారులు ఉండకూడదని, అక్కడి నుంచి వెళ్లిపోవాలని నినాదాలు చేస్తూ లోపలికి దూసుకెళ్లి బీభత్సం సృష్టించారు. మందిరంపై దాడి చేశారని తెలుసుకున్న భక్తులు.. దుండగుల చర్యపై అభ్యంతరం వ్యక్తం చేశారు. వారిపైనా ఖలిస్తానీ మద్దతుదారులు గొడవకు దిగారు.
భక్తులను కొడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మధ్యాహ్నం అక్కడి నుంచి ఖలిస్తాన్ దుండగులు వెళ్లిపోయారు. అనంతరం ఇండియన్ కెనడియన్లు గుడి వద్దకు చేరుకొని దాడికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. ఈ నేపథ్యంలో ఆలయం వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. దాడిని ప్రధాని జస్టిన్ ట్రూడో ‘ఎక్స్’ లో ఖండించారు. ‘‘హిందూ సభ మందిరంపై దాడి ఖండిస్తున్నాం. కెనడాలో తమ మతాచారాలను పాటించే స్వేచ్ఛ ప్రతిఒక్కరికీ ఉంది” అని ట్రూడో పేర్కొన్నారు. కాగా, ఆలయంపై దాడిని భారత హైకమిషన్ తీవ్రంగా ఖండించింది. ఇది కచ్చితంగా ఇండియా వ్యతిరేక శక్తుల పనేనని సోమవారం ఒక ప్రకటనలో పేర్కొంది.నిరసనకారులపై చేయిచేసుకున్న కెనడా పోలీసుమందిర్పై దాడిని నిరసిస్తూ ఆలయం బయట నిరసన తెలుపుతున్న హిందూ నిరసనకారులపై ఓ పోలీసు చేయిచేసుకున్నాడు. వారిని దూషిస్తూ ఇష్టమొచ్చినట్లు కొట్టాడు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది.
బాధితులకు న్యాయం జరగాలి: మోదీ
న్యూఢిల్లీ: కెనడాలోని భారత దౌత్యవేత్తలను భయాందోళనకు గురిచేయడానికే బ్రాంప్టన్ లోని ఆలయంపై దాడి జరిగిందని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. దాడిని పిరికిపందల చర్యగా కొట్టిపారేశారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. ఇలాంటి చర్యలతో భారతదేశ దృఢ సంకల్పాన్ని మార్చలేరని తేల్చిచెప్పారు. ఈ దాడిలో గాయపడ్డ వారికి న్యాయం జరుగుతుందని, ఇందుకోసం అవసరమైన చర్యలను కెనడా ప్రభుత్వం చేపడుతుందని భావిస్తున్నట్లు మోదీ ట్వీట్ చేశారు.