ODI World Cup 2023: నరేంద్ర మోడీ క్రికెట్ స్టేడియాన్ని పేల్చేస్తాం: ఖలిస్తానీ టెర్రరిస్ట్ వార్నింగ్

ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ హత్య నేపథ్యంలో భారత్‌-కెనడా మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొన్న విషయం తెలిసిందే. కెనడాలోని ఓ గురుద్వారాలో ఉన్న ఆయనను జూన్ 18న కొందరు గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు హత్య చేయగా.. దీని వెనుక భార‌త్ హ‌స్తం ఉందని కెనడా ప్ర‌ధాని జస్టిన్ ట్రూడో ఆరోపించారు. దీంతో రెండు దేశాల్లోనూ అనుకూల, వ్యతిరేక ఆందోళనలు మొదలయ్యాయి. 

ఈ నేపథ్యంలో ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్ ప్రపంచ కప్ ను టార్గెట్ చేస్తూ హెచ్చరికలు చేశారు. ఐసిసి ప్రపంచ కప్ 2023 తొలి మ్యాచ్‌కు ఆతిథ్యం ఇవ్వనున్న నరేంద్ర మోడీ స్టేడియం(అహ్మదాబాద్‌)పై దాడికి ప్లాన్ చేస్తున్నట్లు పన్నూన్ చెప్పుకొచ్చాడు. అందుకు సంబంధించిన రికార్డింగ్ కాల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ ప్రపంచ టెర్రర్ కప్‌కు నాంది..!

"షహీద్ నిజ్జర్ హత్యపై, మేము మీ బుల్లెట్లకు వ్యతిరేకంగా పోరాడబోతున్నాం.. జరిగేది క్రికెట్ వరల్డ్ కప్ కాదు.. వరల్డ్ టెర్రర్ కప్‌.." అన్న సందేశం అందులో ఉంది. అలాగే, "కెనడా ప్రధాని ట్రూడోను అగౌరవపరిచినందుకుగానూ.. భారత రాయభారి వర్మను హతమారుస్తాం అన్నట్లు అందులో హెచ్చరించారు. వర్మను భారత్ కు తిరిగి తీసుకురావడం, ఒట్టావాలోని భారత రాయబార కార్యాలయాన్ని మూసివేయడం చాలా తెలివైన పని.." అని అందులో వెల్లడించారు. ఈ బెదిరింపుల నేపథ్యంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేయనున్నారు.