- ఖలిస్తానీ టెర్రరిస్ట్ పన్నూ బెదిరింపులు
- అఖిల భారతీయ అఖాడా పరిషత్ ఆగ్రహం
లక్నో: మహాకుంభమేళాపై దాడిచేస్తామని ఖలిస్తానీ టెర్రరిస్ట్, నిషేధిత సిఖ్స్ఫర్ జస్టిస్ లీడర్ గురుపత్వంత్‌సింగ్ పన్నూ మరోసారి బెదిరింపులకు దిగాడు. ఈ నెల 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు ఉత్తర ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగనున్న మేళాకు అంతరాయం కలిగిస్తామని హెచ్చరించాడు.
ఈమేరకు ‘ప్రయాగ్రాజ్చలో’ పేరుతో సోమవారం ఆయన ఓ వీడియో రిలీజ్ చేశాడు. హిందుత్వ భావజాలాన్ని వ్యతిరేకించడంతోపాటు దాన్ని చంపేయాలని మద్దతుదారులకు పిలుపునిచ్చాడు. లక్నో, ప్రయాగ్‌రాజ్ ఎయిర్‌పోర్ట్‌లలో ఖలిస్తానీ, కాశ్మీరీ జెండాలను ఎగురవేయాలని అన్నాడు.
మహాకుంభ్ ప్రయాగ్రాజ్యుద్ధభూమిగా మారుతుందని బెదిరిస్తూ వీడియోను ముగించాడు. కాగా, కుంభ మేళాపై బెదిరింపులు చేస్తూ పన్నూ పదిరోజుల్లో విడుదల చేసిన రెండో వీడియో ఇది.
పన్నూ ఓ పిచ్చోడు:మహంత్ రవీంద్ర పురి
పన్నూన్ వీడియోను అఖిల భారతీయ అఖాడా పరిషత్ తీవ్రంగా ఖండించింది. మహంత్ రవీంద్ర పురి మాట్లాడుతూ.. పన్నూన్ బెదిరింపులను తోసిపుచ్చారు. ఆయనో పిచ్చోడు అని పన్నూన్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
‘‘ఈ పన్నూన్ అనే వ్యక్తి మహాకుంభ మేళాలో ఎంటర్ అయితే.. అతడిని కొట్టి, తరిమేస్తాం. ఇలాంటి వందలాది మంది పిచ్చోళ్లను మేంచూశాం” అని పేర్కొన్నారు. ఇది హిందువులు, సిక్కులు కలిసి జరుపుకునే మహాకుంభ మేళా అని, విభజనను ప్రేరేపించడానికి పన్నూన్ చేసే ప్రయత్నాలు ఫలించబోవన్నారు. సనాతన సంప్రదాయాన్ని సజీవంగా ఉంచింది సిక్కు సమాజం అని గుర్తుచేశారు.
బాంబు బెదిరింపు..బాలుడి అరెస్ట్
మహాకుంభ మేళాలో బాంబులు వేస్తామని బెదిరించిన బిహార్‌కు చెందిన 11వ తరగతి స్టూడెంట్ను యూపీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ బాలుడిని విచారణ కోసం ప్రయాగ్‌రాజ్‌కు తరలించినట్టు తెలిపారు.