టెహ్రాన్: సిరియన్ ప్రభుత్వాన్ని పడగొట్టడంలో అమెరికా, ఇజ్రాయెల్ ఉమ్మడిగా కుట్ర చేశాయని ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అన్నారు. ఈమేరకు బుధవారం టెహ్రాన్ లో ఓ టీవీ చానల్ తో ఆయన మాట్లాడారు. ‘‘సిరియాలో ప్రభుత్వాన్ని పడగొట్టడం అమెరికా, ఇజ్రాయెల్ ఉమ్మడి కుట్ర అని చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. అందుకు సంబంధించి ఆధారాలు ఉన్నాయి.
సిరియన్ ప్రభుత్వాన్ని పడగొట్టడంలో దాని పొరుగుదేశం కీలక పాత్ర పోషించింది” అని తెలిపారు. సిరియా ప్రభుత్వం కూలిపోవడంతో ఇరాన్ బలహీనపడుతుందన్న ఊహాగానాలను ఖమేనీ ఖండించారు. ‘‘ప్రతిఘటన అంటే ఏంటో ఆ ఎక్స్పర్ట్స్ కు తెలియదు. అది బలహీనపడితే ఇస్లామిక్ ఇరాన్ కూడా బలహీనపడుతుందని వారు భావిస్తున్నారు. ఇరాన్ శక్తివంతమైనది. అల్లా దయతో మరింత శక్తివంతంగా మారుతుంది” అని ఆయన పేర్కొన్నారు.