ఖమ్మం టౌన్, వెలుగు : బ్యాంకులు ఇన్‌టైంలో రుణాలు అందించి ప్రభుత్వ నిర్దేశిత లక్ష్యాలను సాధించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి.సత్యప్రసాద్ సూచించారు. శుక్రవారం నూతన కలెక్టరేట్ మీటింగ్ హాల్ లో జిల్లా స్థాయి బ్యాంకర్ల సంప్రదింపుల కమిటీతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు త్వరగా చేరేలా చర్యలు చేపట్టాలన్నారు.
2023–-24 వార్షిక రుణ ప్రణాళికలో ఇప్పటివరకు రూ.2,881 కోట్లు స్వల్పకాలిక పంట రుణాలు అందజేసినట్లు చెప్పారు. సూక్ష్మ, చిన్న, మధ్య స్థాయి పరిశ్రమలకు రూ.1,284 కోట్లు ఇచ్చినట్లు తెలిపారు. విద్యా రుణాలు రూ.29 కోట్లు, గృహ రుణాలు రూ.35 కోట్లు ఇచ్చినట్లు వివరించారు. ప్రాధాన్యతా రంగాలకు రూ.6,135 కోట్లు, అప్రాధాన్యత రంగాలకు రూ.2,648 కోట్లు అందించినట్లు తెలిపారు. రెన్యువల్ లో ప్రాసెసింగ్ ఫీజు లేకుండా చూడాలన్నారు. సమావేశంలో అధికారులు, బ్యాంకర్లు, తదితరులు పాల్గొన్నారు.