
- సదస్సులను పరిశీలించిన అడిషనల్కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి
నేలకొండపల్లి, వెలుగు : భూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కొత్త ఆర్ఓఆర్ భూ భారతి చట్టాన్ని తెచ్చిందని ఖమ్మం అడిషనల్ కలెక్టర్ పి. శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఆదివారం నేలకొండపల్లి మండలంలోని రాయిగూడెం, బోదులబండలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో ఆయన మాట్లాడారు. మండలంలోని ప్రతి గ్రామంలో రెవెన్యూ సదస్సు నిర్వహిస్తున్నామని, దరఖాస్తులు స్వీకరించి భూ సమస్యలను పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. గతంలో ధరణి వ్యవస్థ ఉన్నప్పుడు ఏదైనా అభ్యంతరాలు ఉంటే నేరుగా సివిల్ కోర్టుకు వెళ్లాల్సి ఉండేదని, నేడు అప్పీల్ వ్యవస్థకు కూడా అవకాశం ఉందని తెలిపారు. మనిషికి ఆధార్ కార్డు లాగా భూమికి భూదార్ సంఖ్య కేటాయించే ఆలోచన ఉందని, దీని ద్వారా భూ ఆక్రమణలకు చెక్ పెట్టవచ్చని వివరించారు.
పెండింగ్ లో ఉన్న సాదాబైనామా పరిష్కారం కోసం భూభారతి చట్టంలో ప్రభుత్వం అవకాశం కల్పించిందని తెలిపారు. భూ భారతి చట్టంపై అవగాహన కల్పించేలా పాంప్లెట్స్ పంపిణీ చేశామన్నారు. కాగా, ఆదివారం నిర్వహించిన సదస్సులో రాయిగూడెంలో 75, బోదులబండలో 118 దరఖాస్తులు వచ్చాయి. ఈ కార్యక్రమంలో ఎస్డీసీ, పాలేరు నియోజకవర్గ నోడల్ అధికారి ఎం.రాజేశ్వరి, మండల తహసీల్దార్ వెంకటేశ్వర్లు, నాయబ్ తహసీల్దార్ ఇమ్రాన్, ఆర్ఐ లు మదు, శ్రీనివాస్, రవి, రైతులు, కొడాలి గోవిందరావు, కట్టెకోల నాగార్జున, షేక్ ఖాజామియా, కట్టెకోల నాగేశ్వరరావు, సుధాకర్ వేణు, రామారావు, కొర్లకుంట. నాగేశ్వరరావు, తీగ రమణయ్య తదితరులు పాల్గొన్నారు.
బాలికలకు మెరుగైన వసతులు కల్పించాలి
ముదిగొండ : కేజీబీవీల్లోని బాలికలకు మెరుగైన వసతులతో విద్యా బోధన అందించాలని అడిషనల్ కలెక్టర్ పి. శ్రీనివాస్ రెడ్డి అధికారులకు సూచించారు. మండలం పరిధిలోని న్యూ లక్ష్మీపురంలో కేజీబీవీ, వల్లభి సరిహద్దు చెక్ పోస్ట్ ను ఆయన తనిఖీ చేశారు. కేజీబీవీలో అందిస్తున్న భోజనం, విద్యా బోధన, వసతులపై విద్యార్థినులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు రెగ్యులర్ గా నాణ్యమైన భోజనం అందించాలని, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సిబ్బందికి సూచించారు. అంతకుముందు వల్లభి షేర్ మహమ్మద్ రోడ్డు వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ ను తనిఖీ చేశారు. జిల్లాలోకి ఇతర రాష్ట్రాల నుంచి ధాన్యం రవాణా జరుగకుండా నిఘా పెట్టాలన్నారు.
ధాన్యం కొనుగోళ్లు స్పీడప్ చేయాలి
తల్లాడ : ధాన్యం కొనుగోళ్లు స్పీడప్ చేయాలని అడిషనల్కలెక్టర్ పి. శ్రీనివాస్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. మండలంలోని రంగంబంజరలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన తనిఖీ చేశారు. కొనుగోలు కేంద్రంలో ఇప్పటివరకు సేకరించిన ధాన్యం వివరాలు, ట్యాబ్ ఎంట్రీ, రైతులకు డబ్బు చెల్లింపు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆటోమేటిక్ ప్యాడీ క్లీనర్ ను పరిశీలించారు.