ఆఫీసర్లు అలర్ట్​గా ఉండాలి : కలెక్టర్ ​మధుసూదన్​ నాయక్

ఆఫీసర్లు అలర్ట్​గా ఉండాలి : కలెక్టర్ ​మధుసూదన్​ నాయక్
  • ఖమ్మం అడిషనల్​ కలెక్టర్ ​మధుసూదన్​ నాయక్​ 
  • కల్లూరు పెద్ద చెరువు అలుగు, లో లెవెల్ బ్రిడ్జి పరిశీలన 
  • విధుల పట్ల నిర్లక్ష్యం చేస్తున్న ఎంపీఈవో, కల్లూరు, లక్ష్మీపురం పంచాయతీ కార్యదర్శులపై చర్యలకు ఆదేశం 

కల్లూరు, వెలుగు : వారం రోజులుగా వర్షాలు కురుస్తున్నందున్న ఆఫీసర్లు ఎప్పుడూ అలర్ట్​గా ఉండాలని ఖమ్మం అడిషనల్​ కలెక్టర్​ మధుసూదన్​ గౌడ్​ ఆదేశించారు. అలుగుపారుతున్నకల్లూరు పెద్ద చెరువును, లో లెవెల్ వంతెనను కల్లూరు ఆర్డీవో ఎల్.రాజేంద్ర గౌడ్, ఆయా శాఖల అధికారులతో కలిసి ఆయన ఆదివారం పరిశీలించారు. వరదలతో ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. చెరువులు, వాగులు, వంకలు ఉప్పొంగుతున్న నేపథ్యంలో వాటి వల్ల కలిగి ప్రమాదాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.

విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని చెప్పారు. పేరుకుపోయిన డ్రైనేజీ కాల్వలను వెంటనే క్లియర్​ చేయాలని ఆదేశించారు. పంచాయతీ వాళ్లు ఫాగింగ్ చేయడం, బ్లీచింగ్ చల్లడం, వాటర్ ట్యాంకుల తరుచుగా శుభ్రంగా చేయాలన్నారు. కలుషిత తాగునీటిని సరఫరా చేస్తున్నారని, విధుల పట్ల సంబంధిత అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని, సమస్యలను విన్నవించినా పట్టించుకోవడంలేదని గ్రామస్తులు అడిషనల్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై వెంటనే స్పందించిన ఆయన కల్లూరు, లక్ష్మీపురం పంచాయతీల కార్యదర్శులు, ఎంపీఈవో ఎక్కడ అని ఎంపీడీవో చంద్రశేఖర్ ను ప్రశ్నించారు.

వారు ఇంకా విధులకు రాలేదని, మార్గం మధ్యలో ఉన్నారని ఎంపీడీవో సమాధానం ఇచ్చారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలందించాల్సిన ఆఫీసర్లు నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదని, వెంటనే వారికి షోకజ్ నోటీసులు జారీ చేయాలని ఎంపీడీవోను ఆదేశించారు. తహసీల్దార్ పులి సాంబశివుడు, జలవనరుల శాఖ డీఈ రాజా రత్నాకర్, స్థానిక ఎస్సై ఎస్కే షాకీర్ ఉన్నారు. 

నీటమునిగిన పత్తిచేలు

పాల్వంచ రూరల్, వెలుగు : ఎడతెరపిలేకుండా కురుస్తున్న భారీ వర్షానికి పాల్వంచ మండల పరిధిలోని పత్తి చేలు నీట మునిగాయి. నాగారం గ్రామంలో పత్తిచేలు ఎర్రబారుతున్నాయి. దీంతో బాధిత రైతులు ఆందోళన చెందుతున్నారు.  

ఉధృతంగా ప్రవహిస్తున్న ఏడు మెలికల వాగు

గుండాల, వెలుగు : ఆరు రోజులుగా కురుస్తున్న వర్షాలతో పాటు, ఎగువన నుంచి వస్తున్న వరద తోడవడంతో గుండాల మండలంలో వాగులు ఉధృతంగా ప్రవహిస్తూ, చెరువులు అలుగులు పోస్తున్నాయి. గుండాల  కొడవతంచ ప్రధాన రహదారిలో ఏడు మెలికల వాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో లో లెవెల్ వంతెన పైనుంచి వరద ప్రవాహం వెళ్లడంతో పాల గూడెం, నాగారం, కొడవతంచ , దొంగతోగు, నడిమిగూడెం గ్రామాలకు మండల కేంద్రం నుంచి రాకపోకలు నిలిచిపోయాయి.