గిరిజన గ్రామాల సమగ్రాభివృద్ధికి కొత్త స్కీమ్​

గిరిజన గ్రామాల సమగ్రాభివృద్ధికి కొత్త స్కీమ్​
  • ఖమ్మం అడిషనల్​ కలెక్టర్​ మధుసూదన్​ నాయక్​

ఖమ్మం టౌన్, వెలుగు :  గిరిజనుల సమగ్రాభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎంజేయూజీఏ (ప్రధాన మంత్రి జన జాతీయ ఉన్నత గ్రామ అభియాన్) కార్యక్రమాన్ని ఖమ్మం జిల్లాలో సమర్థవంతంగా అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని అడిషనల్​ కలెక్టర్ డి. మధుసూదన్ నాయక్ అన్నారు. బుధవారం కలెక్టరేట్ లోని తన చాంబర్ లో పీఎంజేయూజీఏ సంబంధించి రూపొందించిన వాల్​ పోస్టర్​ను ఆయన విడుదల చేశారు. 

ఈ సందర్భంగా మాట్లాడుతూ గిరిజనుల సామాజిక ఆర్థిక పరిస్థితులను మెరుగుపరుస్తూ, వారి జీవన ప్రమాణాలు పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎంజేయూజీఏ  పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు.ఈ స్కీమ్​ను గిరిజనులు 50 శాతం కంటే ఎక్కువ ఉన్న గ్రామాల్లో అమలు చేయనున్నట్లు తెలిపారు. 

మారుమూల గిరిజన ప్రాంతాలకు అవసరమైన వసతులను కల్పించనున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ ఉప సంచాలకుడు ఎన్. విజయలక్ష్మి, సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకుడు కే. సత్యనారాయణ, గిరిజన సంక్షేమ శాఖ కార్యాలయ పరిపాలన అధికారి ఏ. నారాయణరెడ్డి, కలెక్టరేట్ పరిపాలన అధికారిణి అరుణ, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.