మహిళా శక్తి యూనిట్లు గ్రౌండింగ్  చేయాలి : ఖమ్మం అడిషనల్​ కలెక్టర్ శ్రీజ

మహిళా శక్తి యూనిట్లు గ్రౌండింగ్  చేయాలి : ఖమ్మం అడిషనల్​ కలెక్టర్ శ్రీజ
  • ఇందిరా మహిళా శక్తి, ధాన్యం కొనుగోళ్లు, ఉపాధి హామీ పనులపై సమీక్ష 

ఖమ్మం టౌన్, వెలుగు :  గ్రామాల్లో ఇందిరా మహిళా శక్తి యూనిట్ల గ్రౌండింగ్ కు అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని స్థానిక సంస్థల అడిషనల్​కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ సూచించారు. శనివారం కలెక్టరేట్ లో ఇందిరా మహిళా శక్తి యూనిట్ల పురోగతి, ధాన్యం కొనుగోళ్లు, ఉపాధి హామీ పనులపై అధికారులతో కలిసి ఆమె సమీక్షించారు. గ్రామ పంచాయతీ పరిధిలో ఉపాధి హామీ కింద మంజూరై పెండింగ్ లో ఉన్న పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు.

ఆ పనులు ఏ స్టేజిలో ఆగిపోయాయో, వాటి పూర్తికి ఏం చేయాలో నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. మహిళా స్వశక్తి సంఘాల సమావేశాలు రెగ్యులర్ గా జరగాలన్నారు. ప్రతీ మండలంలో మీ సేవా కేంద్రాల గ్రౌండింగ్ వచ్చే సమావేశం నాటికి పూర్తి కావాలని, దాని ప్రకారం లబ్ధిదారులను గుర్తించాలని, లేకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

అనంతరం మండలాల వారీగా ఐకేపీ కేంద్రాల ద్వారా కొనుగోలు చేసిన ధాన్యం, ట్యాబ్ ఎంట్రీ వివరాలు,  రైతులకు చేసిన చెల్లింపులు, సన్న రకం ధాన్యం బోనస్ చెల్లింపు, ధాన్యం తరలింపునకు తీసుకుంటున్న చర్యలపై రివ్యూ చేశారు.  జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి సన్యాసయ్య, అడిషనల్​ డీఆర్డీవో నూరొద్దీన్ తదితరులు పాల్గొన్నారు. 

కావాల్సిన పనులపై ప్రతిపాదనలు అందించాలి

జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ రెసిడెన్షియల్ హాస్టళ్లలోని స్టోర్ రూమ్​ల్లో  కావాల్సిన పనులపై ప్రతిపాదనలు అందజేయాలని అడిషనల్​కలెక్టర్ కోరారు. ఈ విషయమై కలెక్టరేట్ లోసంబంధిత అధికారులతో సమీక్షించారు. కేజీబీవీల్లో సరుకులు స్టోర్ చేసేందుకు అవసరమైన ర్యాక్, సామగ్రి ఏర్పాటు చేసుకోవాలని, డిసెంబర్ 25 నాటికి పనులు పూర్తి చేసి ఫొటోలు అందజేయాలని చెప్పారు.

రెసిడెన్షియల్ హాస్టళ్లలో సరుకులు స్టోర్ చేసుకునేందుకు అవసరమైన స్టాండ్స్, స్టోర్ రూమ్ లలో కావాల్సిన సదుపాయాల ప్రతిపాదనలు సమర్పించాలన్నారు. మైనారిటీ సంక్షేమ అధికారి కె. సత్యనారాయణ, బీసీ అభివృద్ధి అధికారి జి. జ్యోతి, ట్రైబల్ వెల్ఫేర్ ఉప సంచాలకులు ఎన్. విజయలక్ష్మి, జిల్లా విద్యా శాఖ అధికారి సోమశేఖర శర్మ, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.