- సంక్రాంతికి కొనుగోళ్లు ప్రారంభిస్తాం
- పాలేరుకు జాతీయ రహదారులు క్యూ కట్టాయ్
- మంత్రులు పొంగులేటి, తుమ్మల
- నూతన పాలకవర్గం ప్రమాణస్వీకారం
- శుభాకాంక్షలు తెలిపిన మంత్రులు
ఖమ్మం రూరల్, వెలుగు : మద్దులపల్లి వ్యవసాయ మార్కెట్‌ను అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. గురువారం ఖమ్మం రూరల్ మండలం మద్దులపల్లి మార్కెట్ నూతన పాలకవర్గం సభ్యులు మంత్రులు పొంగులేటి, తుమ్మల సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ ఖమ్మం మార్కెట్ ఓవర్ లోడ్ కావడంతో ఇబ్బందులు ఏర్పడుతున్నాయని, అందుకు మద్దులపల్లి మార్కెట్ ను డెవలప్ చేస్తామని చెప్పారు.
రాబోయే మూడు నెలల్లో మద్దులపల్లి మార్కెట్‌ను కంప్లీట్ చేసుకోబోతున్నామని చెప్పారు. సంక్రాంతికి మార్కెట్‌ను రైతులకు అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. కేవలం 27 రోజుల్లోనే సుమారు 24 లక్షల మంది రైతులకు రైతులకు రూ.18 వేల కోట్ల రుణమాఫీ చేసిన ఘనత ఇందిరమ్మ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. ప్రతి నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు నిర్మిస్తామన్నారు.
పదవులు లేనప్పుడు పేదలను పట్టించుకోని వాళ్లు ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత వాళ్లపై ప్రేమ కుమ్మరిస్తున్నారని విమర్శించారు. ప్రతి నియోజకవర్గానికి నెలాఖరు నాటికి 3,500 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసి , ప్రతి ఇంటికి రూ. 5 లక్షల సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. త్వరలోనే ధరణిని రద్దుచేసి నూతన ఆర్వోఆర్ చట్టం ప్రవేశపెట్టి భూ సమస్యలను శాశ్వతంగా నిర్మూలిస్తామన్నారు.
పాలేరు జాతీయ రాహదారులు..
పాలేరుకు -ఖమ్మం–సుర్యాపేట, కురవి–-కోదాడ, దేవరపల్లి–--ఖమ్మం, అమరావతి-–-నాగపూర్ లాంటి జాతీయ రహదారులు పాలేరు నియోజకవర్గానికి క్యూ కట్టాయని, దాంతో లక్షల్లో ఉన్న భూముల ధరలు కోట్లల్లో పలుకుతున్నాయని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన నియోజకవర్గం పాలేరు అని, తనను గతంలో పాలేరు గెలిపించినందున మూడేళ్ల కాలంలోనే అభివృద్ధి చేశానని గుర్తు చేశారు.
ఇప్పుడు ప్రతి ఎకరాకూ నీరు అందుతున్నందున పాలేరు సస్యశామలంగా మారిందన్నారు. కాగా మద్దులపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ గా బైరు హరినాథ్ బాబు, వైస్ చైర్మన్ గా వనవాసం నరేందర్ రెడ్డి, డైరెక్టర్లుగా పలువురు ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్లు రాయల నాగేశ్వరరావు, జిల్లా మార్కెటింగ్ అధికారి ఎంఏ అలీమ్, అధికారులు, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.