- ఖమ్మం, భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్లు
భద్రాద్రికొత్తగూడెం/ఖమ్మం టౌన్, వెలుగు : ఈ నెల 26న అమలు చేయనున్న సంక్షేమ పథకాలకు సంబంధించి లబ్ధిదారుల ఎంపిక పక్కాగా జరగాలని కలెక్టర్ జితేశ్ వి పాటిల్ఆఫీసర్లను ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి పలు శాఖల ఆఫీసర్లతో బుధవారం నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల సెలక్షన్ పారదర్శకంగా ఉండాలన్నారు. 16 నుంచి 20 వరకు చేపట్టే క్షేత్ర స్థాయి సర్వేలో ఎటువంటి లోపాలు ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. లబ్ధిదారుల ముసాయిదా జాబితా తయారీలో అలసత్వం వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 21 నుంచి 24వ తేదీ వరకు గ్రామ సభలను పక్కాగా నిర్వహించాలన్నారు.
21నుంచి 25వ వరకు నిర్వహించే డేటా ఎంట్రీలో తప్పులు లేకుండా చూడాలని చెప్పారు. వ్యవసాయోగ్యమైన భూములకే రైతు భరోసా ఇవ్వాలన్నారు. కుల గణన సర్వే ఆధారంగా పేద కుటుంబాలకు రేషన్‌కార్డులు ఇవ్వాలని సూచించారు. మండల స్థాయిలో ఎంపీడీవో, మున్సిపాలిటీ స్థాయిలో కమిషనర్ బాధ్యులుగా ఉంటారన్నారు. జాబితాను గ్రామ, వార్డు సభలో ప్రదర్శించాలని, చదివి వినిపించాలన్నారు. ఈనెల 18లోపు ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్ లాగిన్‌లో ఎటువంటి లోపాలు లేకుండా చెక్ చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు డి. వేణుగోపాల్ విద్యాచందన పాల్గొన్నారు.
ఖమ్మంలో సమీక్ష
ప్రభుత్వం అమలు చేయనున్న నాలుగు పథకాలపై ఖమ్మం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో స్థానిక సంస్థల అడిషనల్కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ తో కలిసి కలెక్టర్ ముజామ్మిల్‌ఖాన్ సమీక్షించారు. పథకాల అమలుపై అధికారులకు స్పష్టమైన అవగాహన ఉండాలన్నారు. లబ్ధిదారుల ఎంపిక అనేది నిరంతర ప్రక్రియ అని, దీనిపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పారు. జిల్లాలో మొత్తం 589 గ్రామాలు ఉండగా, 380 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయన్నారు. గ్రామాల వారీగా పాస్ బుక్ లను విభజించాలన్నారు.
ఆర్ఐ, ఏఈవోలు క్షేత్ర తనిఖీలు చేసి, వ్యవసాయ యోగ్యం, వ్యవసాయ యోగ్యం కాని భూముల గుర్తింపు చేయాలన్నారు. నివేదికలకు ఒక ఫార్మాట్ రూపొందించి, క్షేత్ర అధికారులకు అందజేయాలని ఆదేశించారు. 20 నుంచి నిర్వహించే గ్రామ సభల సభల్లో గ్రామ కార్యదర్శి తోపాటు, సంబంధిత శాఖ అధికారులు తప్పనిసరిగా పాల్గొనాలన్నారు. ఈ నెల 21, 22న తహసీల్దార్, మండల వ్యవసాయ అధికారులు రీ వెరిఫై చేయాలని చెప్పారు. డీఆర్డీవో సన్యాసయ్య, డీపీవో ఆశాలత, డీసీఎస్ వో చందన్ కుమార్, డీఏవో పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు.