
ఖమ్మం/భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: గ్రీవెన్స్ లో వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఖమ్మం కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ లో ప్రజావాణి సందర్భంగా అడిషనల్ కలెక్టర్లు శ్రీజ, శ్రీనివాస్ రెడ్డితో కలిసి ప్రజల నుంచి ఆయన అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణి దరఖాస్తులకు ప్రాధాన్యతనిచ్చి పరిశీలించాలన్నారు.
సత్తుపల్లి మండలం కాకర్లపల్లికి చెందిన బేతిని అప్పారావు చీపురికుంట చెరువుకు నిధులు కేటాయించి పునరుద్ధరణ, ఆక్రమణల తొలగింపు, రక్షణ కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని కోరగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. రఘునాథ పాలెం మండలం మంచుకొండకి చెందిన శ్రీనివాస్ రావు తన సంతకం ఫోర్జరీ చేసి సర్వ్ నెంబర్ 284 లో 38 గుంటల తప్పుడు డాక్యుమెంట్ తయారు చేసి పాస్ బుక్ పొందటంపై విచారణ చేయాలని కోరుతూ దరఖాస్తు చేశారు.
భద్రాద్రికొత్తగూడెంలో..
భద్రాద్రికొత్తగూడెం కలెక్టరేట్లో నిర్వహించిన గ్రీవెన్స్‌లో కలెక్టర్ జితేశ్ వి పాటిల్ దరఖాస్తులు తీసుకున్నారు. గ్రీవెన్స్‌లో వచ్చే ప్రతి దరఖాస్తును పరిష్కరించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కింద భూములు కోల్పోయిన తమకు పరిహారం ఇప్పిస్తామని మాయ మాటలతో నమ్మించి బ్యాంకు సిబ్బందితో కుమ్మక్కై కొందరు దళారులు వారి ఖాతాల్లో వేసుకున్నారని ఆరోపిస్తూ అన్నపురెడ్డిపల్లి మండలం తొట్టి పంపు గ్రామానికి చెందిన పలువురు కలెక్టర్‌కు కంప్లైంట్ ఇచ్చారు.
మణుగూరు మండలం సమితి సింగారం గ్రామంలో తన ఇంటి స్థలాన్ని ఆక్రమించుకొని కొందరు వ్యక్తులు అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని, ప్రశ్నిస్తే చంపుతామని బెదిరిస్తున్నారని డేగల తిరుపతి వాపోయారు. వీటిని వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు.