- రెండు వైపులా కలిపి 17 కిలోమీటర్ల మేర ఆర్సీసీ వాల్
- రూ.501.30 కోట్ల అంచనాతో ఆన్లైన్ టెండర్లు
- ఇవాళ్టితో ముగియనున్న టెండర్లు
- కాంట్రాక్ట్ దక్కించుకునేందుకు బడా సంస్థల ఆసక్తి
ఖమ్మం, వెలుగు : ఖమ్మం, పాలేరు నియోజకవర్గాలకు మున్నేరు ముంపు ముప్పు నుంచి శాశ్వత పరిష్కారం లభించబోతోంది. వరద తాకిడితో పలు కాలనీలు మునగకుండా మున్నేరు నదికి రెండు వైపులా రక్షణ గోడల నిర్మాణానికి టెండర్ల దాఖలు గడువు ఇవాళ్టితో ముగియనుంది. మున్నేరుకు ఆర్సీసీ (రెయిన్ ఫోర్సుడ్ సిమెంట్ కాంక్రీట్) వాల్ నిర్మాణానికి ఎన్నికల ముందు రూ.690.52 కోట్లతో గత ప్రభుత్వం పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. ఇందులో పన్నులు, భూసేకరణ, ఇతర ఖర్చులు లేకుండా వర్క్ కాంపోనెంట్ రూ.501.30 కోట్ల అంచనాతో గత నెలలో నీటి పారుదల శాఖ టెండర్లను
ఆహ్వానించింది.
గోడల నిర్మాణం ఇలా..
మున్నేరు నది ప్రవహించే మార్గంలో పోలేపల్లి నుంచి ప్రకాశ్‌నగర్ వరకు 8.5 కిలోమీటర్ల పొడవులో నదికి రెండు వైపులా కలిసి 17 కిలోమీటర్ల మేర ఆర్సీసీ వాల్ నిర్మించనున్నారు. మరో నాలుగు కిలోమీటర్ల మేర ఎర్త్ బండ్ నిర్మించాల్సి ఉంటుంది. ఈ నిర్మాణం పూర్తయితే మున్నేరు ముంపు ప్రాంతంలో ఉన్న దాదాపు 20 కాలనీల్లోని వేల కుటుంబాలకు ఊరట కలగనుంది.
గతేడాది మున్నేరు చరిత్రలోనే అత్యధికంగా 30.6 అడుగుల మేర నీటి ప్రవాహం వచ్చింది. దీంతో ఆ స్థాయికి మించి నీరు వచ్చినా తట్టుకునేలా మినిమం 6 మీటర్ల ఎత్తు నుంచి 11 మీటర్ల ఎత్తు వరకు గోడలు నిర్మిస్తారు. రెండు కిలోమీటర్లకు ఒక ఫ్లడ్ బ్యాంక్ చొప్పున మట్టి, రాతి కట్టల నిర్మాణం చేపడతారు. రెండు గోడల మధ్య దూరం 300 మీటర్లు ఉండేలా భూసేకరణ చేస్తున్నారు.
నది మధ్య భాగం నుంచి 150 మీటర్లు ఉండేలా పెగ్ మార్కింగ్ పూర్తి చేశారు. గోడలకు బయటవైపు మురుగునీటి కాల్వలను నిర్మిస్తారు. అతి తక్కువ భూసేకరణ అవసరయ్యేలా ప్లాన్ చేశారు. మున్నేరుకు ఒక వైపు ఇండ్లున్న ప్రాంతంలో రెండోవైపునకు వ్యవసాయ భూమిని సేకరించేలా నిర్ణయించారు. బొక్కలగడ్డ ప్రాంతంలో ఆరు ఇండ్లు, పాలేరు నియోజకవర్గ పరిధిలో మరో రెండు ఇండ్లు మాత్రమే సేకరించాల్సి ఉంటుందని తేల్చారు.
ఇండ్లు కోల్పోయే వారికి వేరొక చోట స్థలాన్ని కేటాయించేలా ప్లాన్ చేశారు. గత ప్రభుత్వ హయాంలో గోడల నిర్మాణాల లోపలే నాలుగు నుంచి ఐదు చెక్ డ్యామ్ లను నిర్మించాలని, బోటింగ్ చేసేందుకు గాను ఎప్పుడూ నీటి నిల్వ ఉండేలా చూడాలని భావించారు. నీటి పారుదల శాఖ నిపుణుల సూచన మేరకు వరద ఉధృతి ఉన్న సమయంలో నష్టం జరిగే అవకాశాలుంటాయని చెక్ డ్యామ్‌లను వద్దని నిర్ణయించారు. 24 నెలల్లో ఈ వర్క్ ను పూర్తి చేయాలని నిబంధన విధించారు.
ALSO READ : నేతన్నలు ఓనర్లు కాలే.. వర్కర్ టూ ఓనర్ పథకం పనులు ఎక్కడివక్కడే
పోటీ పడుతున్న బడా సంస్థలు
మున్నేరు ఆర్సీసీ వాల్ నిర్మాణ టెండర్లను దక్కించేందుకు బడా సంస్థలు పోటీ పడుతున్నాయి. రూ.వేల కోట్ల కాంట్రాక్టులు చేసే సామర్థ్యం ఉన్న కంపెనీలు కూడా ముందుకు వచ్చినట్టు సమాచారం. మెగా, నవయుగ, ఎల్ అండ్ టీ, షాపూర్ జీ పల్లోంజీ గ్రూప్, ఎన్సీసీ, అశోకా బిల్డ్ కాన్ లాంటి పెద్ద సంస్థలు ఈ టెండర్లలో పాల్గొనేందుకు ఇంట్రస్ట్ చూపించినట్టు తెలుస్తోంది.