తెలంగాణలో మిగిలిన రెండు లోక్ సభ స్థానాలకు బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది. వరంగల్ టికెట్‌ను ఆరూరి రమేశ్‌కు, ఖమ్మం సీటు- తాండ్ర వినోద్ రావుకు కేటాయించింది. ఆంధ్రప్రదేశ్ లో 6 సీట్లకు క్యాండిడేట్లను ప్రకటించింది. ఈ మేరకు బీజేపీ నేషనల్ జనరల్ సెక్రటరీ అరుణ్ సింగ్ ఆదివారం 111 మంది అభ్యర్థులతో కూడిన ఐదో లిస్ట్‌ను విడుదల చేశారు.
ఎవరీ వినోద్ రావు?
ఖమ్మం, వెలుగు: వెలమ సామాజికవర్గానికి చెందిన తాండ్ర వినోద్ రావు స్వస్థలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం తిమ్మంపేట. 1930లో వినోద్ రావు తాత సుదర్శన్ రావు భద్రాచలం రామాలయం ట్రస్టీగా పనిచేశారు. ఆ హోదాలో ముత్యాల తలంబ్రాలు సమర్పించేవారు. వినోద్ రావు తండ్రి కృష్ణారావు పాల్వంచలో వకీల్ గా పనిచేసి వకీల్ రావుగా పేరుపొందారు. ఇంటర్ వరకు పాల్వంచలో చదివిన వినోద్ రావు, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ లో మాస్టర్స్ డిగ్రీ పూర్తిచేశారు.
20 ఏండ్ల నుంచి హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ రంగంలో స్థిరపడి, పలు వ్యాపార సంస్థల్లో భాగస్వామిగా ఉన్నారు. ఏకలవ్య ఫౌండేషన్ ద్వారా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మాజీ మంత్రి ఈటెల రాజేందర్ కు సన్నిహితుడిగా ఉన్న ఆయన, ఈ ఏడాది ఫిబ్రవరిలోనే బీజేపీలో చేరారు. ఈటెల సపోర్ట్ తోనే వినోద్ రావు కు ఖమ్మం టికెట్ దక్కినట్టు తెలుస్తున్నది.