ఖమ్మం జనగర్జన సభ తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అన్న చందంగా మారింది. రెండు పార్టీల కార్యకర్తలు ఎదురుపడితే కారాలు..మిరియాలు నూరుకునే పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలోనే ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం పండితాపురంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తలు కొట్టుకున్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలు మరింత రెచ్చిపోయి కాంగ్రెస్ కార్యకర్తలపై కత్తులతో దాడి చేశారు. ఈ దాడిలో కాంగ్రెస్ కార్యకర్తలకు గాయాలయ్యాయి. 2023, జులై 3వ తేదీ అర్థరాత్రి ఈ ఘటన జరిగింది.
పండితాపురంలో రెండు రోజుల నుంచి కాంగ్రెస్, బీఆర్ఎస్ వర్గీయుల మధ్య వివాదాలు నెలకొన్నాయి. గ్రామంలోని బీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీకి చెందిన మహేష్ గౌడ్ పై కత్తులు, రాళ్లతో దాడి చేశారు.
గతంలో కూడా మహేష్ పై దాడి చేశారని, దానిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని అతని కుటుంబ సభ్యులు తెలిపారు. ఖమ్మం సభ విజయవంతం కావడంతో ఓర్వలేక కాంగ్రెస్ నేత మహేష్ గౌడ్ ఇళ్లు, కారుపై రాళ్లతో బీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేశారని కుటుంబ సభ్యులు అంటున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.