ఖమ్మం టౌన్, వెలుగు: ఖమ్మం లోక్సభ బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావుకు ఖమ్మం టీడీపీ శ్రేణుల నుంచి నిరసన సెగ తగిలింది. శనివారం ఆయన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మద్దతు కోరుతూ ఖమ్మంలోని టీడీపీ జిల్లా ఆఫీసుకు వెళ్లారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఎన్టీఆర్ స్ఫూర్తితో చంద్రబాబు పిలుపు మేరకు తాను రాజకీయాల్లోకి వచ్చానని తెలిపారు. టీడీపీతో తనకు ఉన్న అనుబంధాన్ని ఎవ్వరూ వేరు చేయలేరని చెప్పారు. ఎన్నికల్లో టీడీపీ శ్రేణులు తనకు మద్దతు తెలిపాలని..తన గెలుపునకు కృషి చేయాలని అభ్యర్థించారు.
దీంతో కొందరు టీడీపీ శ్రేణులు బీఆర్ఎస్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. టీడీపీని కేసీఆరే నాశనం చేశారని మండిపడ్డారు. టీడీపీ ఆఫీసుకు నామా రావడాన్ని నిరసిస్తూ చెప్పులతో నిరసన తెలిపారు. టీడీపీ కార్యకర్త భాస్కర్..తన చెప్పుతో చెంపలపైనే కొట్టుకుని నిరసన తెలియజేశాడు. చంద్రబాబు అరెస్ట్ సమయంలో కేసీఆర్, కేటీఆర్ ఏపీ సీఎం జగన్ కు సపోర్ట్ గా నిలిచారంటూ ఫైర్ అయ్యారు. టీడీపీ పార్లమెంట్ అధ్యక్షుడు రామనాధం చొరవతో నిరసన సద్దుమణిగింది.