- బీఆర్ఎస్కు పొంగులేటి ఫీవర్
- వెంట వెళ్లే లీడర్లను ఎలా ఆపాలో చర్చించేందుకు వరుస సమావేశాలు
- ఖమ్మంలో మీటింగ్‌కు హాజరైన మంత్రి, ఎమ్మెల్యేలు
హైదరాబాద్/ఖమ్మం, వెలుగు: బీఆర్ఎస్ ను మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఫీవర్ వెంటాడుతోంది. కేవలం ఆయన గురించి చర్చించేందుకు, ఆయన వెంట వెళ్లే వారిని కట్టడి చేసేందుకే ఉమ్మడి ఖమ్మం జిల్లా ముఖ్య నేతలు వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ మీటింగులన్నీ రహస్యంగానే నిర్వహిస్తున్నారు. ఆదివారం రాత్రి ఖమ్మంలోని బీఆర్ఎస్ ఆఫీస్‌లో మంత్రి పువ్వాడ అజయ్ నేతృత్వంలో డిన్నర్ మీటింగ్ ఏర్పాటు చేశారు. దీనికి పార్టీ కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే రేగా కాంతారావు, రాజ్యసభ సభ్యుడు పార్థసారథి రెడ్డి రాలేదు. ఎంపీలు నామ నాగేశ్వర్రావు, వద్దిరాజు రవిచంద్ర, బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధు, ఇతర బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఖమ్మం జడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజ్ పాల్గొన్నారు.
ఆత్మీయ సమ్మేళనాల పేరుతో పార్టీని, సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేస్తూ పొంగులేటి విమర్శలు చేస్తుండడం, హైకమాండ్ చర్యలు తీసుకోకపోవడంతో బీఆర్ఎస్కు నష్టం జరుగుతోందని ప్రజాప్రతినిధులు మంత్రి దృష్టికి తీసుకొచ్చినట్లు సమాచారం. పొంగులేటి పార్టీ వీడితే ఆయన వెంట వెళ్లే లీడర్లు ఎవరెవరో ఓ అంచనాకు వచ్చినట్లు తెలిసింది. వారిని ఆపాలంటే పదవులు ఇవ్వాలా.. లేక ఆర్థిక ప్రయోజనాలు కల్పించాలా అనే దానిపై చర్చించినట్టు తెలుస్తోంది. దీని కోసం నియోజకవర్గాల వారీగా సమావేశాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. పొంగులేటి వెంట వెళ్లే లీడర్లను కట్టడి చేసేందుకు ఖమ్మం బహిరంగ సభకు ముందు మంత్రి హరీశ్నిర్వహించిన క్లోజ్డ్‌డోర్ మీటింగ్ ఫలితాన్ని ఇవ్వలేదు.
తర్వాత ఆయన వెంట ఉన్న లీడర్లను సంప్రదించేందుకు ప్రయత్నిస్తున్నా అవేవి సక్సెస్ కాలేదు. వచ్చే ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో మెజార్టీ స్థానాలు సాధించాలంటే పొంగులేటిని వీక్ చేయడం తప్ప మరో మార్గం లేదని సర్వే, ఇంటెలిజెన్స్ నివేదికలతోనే ఈ అంశాన్ని పార్టీ చీఫ్ కేసీఆర్ సీరియస్‌గా తీసుకున్నారు. మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు ఖమ్మం జిల్లాలో పొంగులేటి కదలికలపై ఎప్పటికప్పుడు ఫోకస్ చేస్తున్నారు. ఈక్రమంలోనే వరుస మీటింగ్‌లు పెడుతున్నారు.