- బీఆర్ఎస్ నేతల మధ్య సమసిపోని విభేదాలు
- పొంగులేటి అనుచరులపై పారని ఆకర్ష్
- 5 లక్షల మంది వస్తారనుకుంటే లక్షన్నర దాటలే
- కమ్యూనిస్టు లీడర్లు తప్ప క్యాడర్ రాలే
- ఉమ్మడి ఖమ్మంలో రాజకీయ లక్ష్యం చేరని బీఆర్ఎస్ సభ
ఖమ్మం, వెలుగు: దేశవ్యాప్తంగా విస్తృత ప్రచారం చేసి, జాతీయ మీడియాను పిలిపించి ఖమ్మం జిల్లా కేంద్రంగా నిర్వహించిన భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఆవిర్భావ సభ అసలు లక్ష్యం చేరలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వరుసగా రెండు ఎన్నికల్లోనూ సింగిల్ డిజిట్ సీటు దాటని ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పార్టీ బలోపేతానికి ఆవిర్భావ సభను వేదిక చేసుకోవాలని హైకమాండ్ భావించింది. నియోజకవర్గాల్లో అంతర్గత పోరుకు చెక్‌పెట్టి, సభను సక్సెస్ చేయడం ద్వారా ఆ ప్రభావం ఏపీపైనా ఉండేలా చూసుకోవాలని ఆశించింది. కానీ పార్టీ పెద్దలు అనుకొన్నది ఒకటి కాగా, జరిగింది మరోటి! మంత్రి హరీశ్ రాయబారం నడిపినా నియోజకవర్గాల్లో లీడర్ల చేతులు కలవలేదు. దీంతో అనుకున్నంత కేడర్ కదలలేదు. సభకు 5 లక్షల జనసమీకరణ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంటే లక్షన్నరకు మించి రాలేదు. ఆ జనాన్ని కూడా ఉమ్మడి ఖమ్మం దాటి ఉమ్మడి నల్గొండ, వరంగల్ నుంచి రప్పించాల్సిన పరిస్థితి! మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని పార్టీ వదులుకున్నా తమకు వచ్చే నష్టమేమీ లేదని హైకమాండ్ చెప్పాలనుకున్నప్పటికీ పరిస్థితి ఉల్టా అయింది. పొంగులేటి అనుచరులు, అభిమానులు, కేడర్ రాకపోవడం కూడా జనం పలుచబడడానికి మరో కారణమని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇక బీజేపీని ఎదుర్కొనేందుకు ఐక్య కార్యాచరణ ప్రకటించకపోవడం, బీఆర్ఎస్ ఎజెండాను పూర్తి స్థాయిలో వివరించకపోవడం, ఖమ్మం డిక్లరేషన్ రిలీజ్ చేయకపోవడం లాంటి అంశాలతో బీఆర్ఎస్ కేడర్ నారాజ్ అయిందని చెప్తున్నారు.
చేతులు కలిసినా మనుసులు కలవలే..
బీఆర్ఎస్ ఆవిర్భావ సభను ఖమ్మం వేదికగా నిర్వహించనున్నట్లు ఈ నెల మొదటివారంలో సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ ప్రభావం పెద్దగా లేకపోవడం, ఏపీ సరిహద్దుల్లో ఉండడంతో పార్టీ బలోపేతమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాజకీయవర్గాల్లో చర్చ జరిగింది. ఈ జిల్లాలో సీనియర్లు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వర్రావు బీఆర్ఎస్ హైకమాండ్ పట్ల కొంత అసంతృప్తితో ఉన్నారు. ఇటీవల ఆత్మీయ సమ్మేళనాల పేరుతో తమ అసమ్మతి గళం వినిపించడం ద్వారా కలకలం రేపారు. దీనికి తోడు దాదాపు అన్ని నియోజకవర్గాల్లో లీడర్ల మధ్య గ్రూపు రాజకీయాలు హైకమాండ్‌కు తలనొప్పిగా మారాయి. పొంగులేటిపై దాదాపు ఆశలు వదులుకున్న కేసీఆర్.. మిగిలిన నేతలను ఏకతాటిపైకి తెచ్చి సభను సక్సెస్ చేయాల్సిన బాధ్యతలను మంత్రి హరీశ్‌రావుకు అప్పగించారు. ఈ క్రమంలోనే రంగలోకి దిగిన హరీశ్.. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పార్టీ మారినా ఉమ్మడి జిల్లాలో రాజకీయంగా నష్టం లేకుండా చూసుకోవడం, పాలేరు, వైరా, కొత్తగూడెం, ఇల్లందు, పినపాక నియోజకవర్గాల్లో ముఖ్యనేతల మధ్య ఉన్న విభేదాలను తొలగించడంపై ఫోకస్ పెట్టారు. ఖమ్మం చేరుకున్న వెంటనే సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేసి మాట్లాడారు. గ్రూపు రాజకీయాలు తగవంటూ లీడర్లకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. కానీ ఆయా చోట్ల లీడర్లు.. హరీశ్ ముందు చేతులు కలిపినా వారి మనసులు కలవలేదన్న విషయం ఆ తర్వాత జరిగిన పరిణామాలతో స్పష్టమైంది. జన సమీకరణ కోసం ఒకే నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే, మాజీ నాయకులు కార్యకర్తలతో వేర్వేరుగా మీటింగులు పెట్టుకోవడం తో మరోసారి విభేదాలు బట్టబయలయ్యాయి. ఈ ఎఫెక్ట్ జనసమీకరణపై పడిందని భావిస్తున్నారు. నాలుగు జిల్లాల పరిధిలోని 18 నియోజకవర్గాల నుంచి 5 లక్షల మందిని రప్పించాలని భావించగా, అందులో 50 శాతం కూడా రీచ్ కాలేదు. ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి కనీసం 3 లక్షల మంది వస్తారని ఆశిస్తే అందులో మూడోవంతు కూడా రాని పరిస్థితి!
పొంగులేటి అనుచరులు దూరం..
ఇక మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని ఒంటరిని చేయాలన్న ప్లాన్ కూడా వర్కవుట్ కాలేదు. ఆయన వెంట ఉన్న వారిని బీఆర్ఎస్ వైపు తిప్పుకోవాలన్న ప్రయత్నాలు ఫెయిలయ్యాయి. పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ఏర్పాటుచేసిన భారీ మీటింగ్ కు పొంగులేటి ప్రధాన అనుచరులుగా ఉన్న భద్రాద్రి కొత్తగూడెం జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, టీఆర్ఎస్ భద్రాచలం నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు సహా పలువురు లీడర్లు హాజరుకాలేదు. పొంగులేటి దూరమైతే ఆ లోటును మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ద్వారా పూడ్చుకోవాలని హైకమాండ్ భావించినా అది కూడా బెడిసికొట్టినట్లు భావిస్తున్నారు. తుమ్మలను పార్టీలో యాక్టివ్ గా చేయడం ఇష్టం లేని లీడర్లు అధినేత తీరుపై నారాజ్అయ్యారు. అటు హైకమాండ్ నిర్ణయానికి ఎదురుచెప్పలేక, తమ సొంత అభిప్రాయాలను కూడా బయటకు చెప్పుకోలేని పరిస్థితిలో లోలోపలే మదన పడ్తున్నారు. ఉమ్మడి జిల్లాలో సగానికి పైగా నియోజకవర్గాల్లో వర్గపోరు సమసిపోకపోవడం, లీడర్ల మధ్య ఐక్యత లేకపోవడంతో పార్టీ కేడర్ బయటకు రాని పరిస్థితి ఏర్పడింది. అందుకే వారం రోజుల నుంచి వర్కవుట్ చేసినా జనసమీకరణలో అనుకున్న లక్ష్యం మాత్రం రీచ్ కాలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అటు డ్వాక్రా మహిళలను మొదలుకొని విద్యాసంస్థలకు సెలవు పొడిగించి మరీ స్టూడెంట్స్ ను తరలించడంతో ఆ మాత్రమైనా పబ్లిక్ వచ్చారన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. దీన్ని ముందుగానే ఉహించడం వల్లనే మూడు నాలుగు జిల్లాల నుంచి కేడర్ ను తరలించే ప్రయత్నాలు చేశారన్న విమర్శలున్నాయి. ఇక కమ్యూనిస్టు పార్టీలకు చెందిన జాతీయ నాయకులు, కేరళ సీఎం అటెండ్ అయినప్పటికీ ఆ పార్టీలకు చెందిన కేడర్ ఈ మీటింగ్ పట్ల ఆసక్తిని చూపించలేదు. మూడు వారాల క్రితం ఖమ్మంలోనే జరిగిన వ్యవసాయ కార్మిక సంఘం మహాసభలకు సుమారు 50 వేల మంది వరకు రెడ్ కేడర్ రాగా, వాళ్లెవరూ బీఆర్ఎస్ మీటింగ్ కు రాలేదు. కేవలం జిల్లా నాయకులు మాత్రమే ప్రోటోకాల్ ప్రకారం అటెండ్ కావడం గమనార్హం.