- ఖమ్మం జిల్లాలో రూ. 200 కోట్ల విలువైన ధాన్యం గోల్‌మాల్‌పై ప్రభుత్వం సీరియస్
- అక్రమాలు నిజమేనని రిపోర్ట్ ఇచ్చిన అడిషనల్ కలెక్టర్ శ్రీజ
- సివిల్ సప్లై అసిస్టెంట్ మేనేజర్‌పై సస్పెన్షన్ వేటు
- సెలవుపై వెళ్లిన అడిషనల్ కలెక్టర్ మధుసూదన్
ఖమ్మం, వెలుగు : ఖమ్మం జిల్లాలో కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) గోల్‌మాల్ ఇష్యూ ఆఫీసర్ల మెడకు చుట్టుకుంటోంది. మిల్లులకు అప్పగించిన కోట్ల రూపాయల విలువైన ధాన్యం కనిపించకపోవడంతో ఎంక్వైరీ చేసిన ఆఫీసర్లు అవకతవకలు నిజమేనని తేల్చారు. దీంతో ఇప్పటికే ఓ ఆఫీసర్‌పై సస్పెన్షన్ వేటు పడగా, త్వరలోనే మరికొందరిపై వేటు వేసేందుకు రంగం సిద్ధం అవుతున్నట్లు సమాచారం.
రూ. 200 కోట్ల విలువైన వడ్లు పక్కదారి
ఖమ్మం జిల్లాలో పార్‌బాయిల్డ్, రా రైస్‌మిల్లులు కలిపి మొత్తం 115 వరకు ఉన్నాయి. ఖరీఫ్, రబీ కలిపి ప్రతియేటా సుమారు 4 లక్షల టన్నుల వడ్లను మిల్లులకు అందిస్తున్నారు. 2022- - 23 రబీ, 2023 - 24 ఖరీఫ్‌కు సంబంధించి 30 వేల టన్నుల బియ్యాన్ని మిల్లర్లు ఎఫ్‌సీఐకి అప్పగించాల్సి ఉంది. కానీ బహిరంగ మార్కెట్‌లో బియ్యానికి మంచి ధర ఉండడంతో మిల్లర్లు జిమ్మిక్కులు చేస్తున్నారు. ప్రభుత్వం తమకు అప్పగించిన వడ్లను బియ్యంగా మార్చి బహిరంగ మార్కెట్‌లో అమ్ముకుంటున్నారు. తర్వాత సీజన్‌లో ప్రభుత్వం ఇచ్చిన వడ్లతో పాటు, రైతుల నుంచి వడ్లు కొని బియ్యంగా మార్చి సీఎంఆర్ కింద మేనేజ్ చేస్తున్నారు.
కొందరు మిల్లర్లు ఏకంగా రేషన్ బియ్యాన్ని కొని రీసైక్లింగ్ చేస్తూ సీఎంఆర్‌గా ఎఫ్‌సీఐ, సివిల్ సప్లైకి చేరవేస్తున్నారు. ఈ వ్యవహారంలో ఆఫీసర్ల పాత్ర కూడా ఉందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. స్థానికంగా ఉన్న ఆఫీసర్లు మామూళ్లు తీసుకుంటూ తనిఖీలు చేయకపోవడం, చూసీచూడనట్లుగా వ్యవహరించడం వల్లే మిల్లర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని పలువురు అంటున్నారు. హైదరాబాద్ నుంచి టాస్క్‌ఫోర్స్ టీమ్ స్థానిక మిల్లుల్లో తనిఖీలు చేయడంతో అసలు విషయం వెలుగుచూసింది. సుమారు రూ.200 కోట్ల విలువైన ధాన్యం పక్కదారి పట్టినట్లు ఆఫీసర్లు గుర్తించారు.
ఇటు బియ్యం ఇవ్వకపోవడం, అటు మిల్లుల్లో వడ్ల నిల్వలు లేకపోవడంతో ఆఫీసర్లు మిల్లర్లకు ఫైన్లు విధిస్తున్నారు. బియ్యం ఎగ్గొట్టిన కొణిజర్ల మండలంలోని ఎస్‌ఏఆర్ రైస్ మిల్లుకు టాస్క్‌ఫోర్స్ ఆఫీసర్లు రూ.81 కోట్ల ఫైన్ విధించారు. ఖమ్మం రూరల్ మండలంలోని మంగళగూడెం దగ్గరున్న శ్రీసత్యనారాయణ రైస్‌మిల్‌కు రూ.9 కోట్లు, నేలకొండపల్లి మండలం రాయగూడెంకు చెందిన శ్రీలక్ష్మీ వెంకటేశ్వర రైస్‌మిల్‌కు రూ.5 కోట్లు జరిమానా విధించినట్టు సమాచారం.
ఎంక్వైరీ పూర్తి చేసిన అడిషనల్ కలెక్టర్
ఖమ్మం జిల్లాలో సీఎంఆర్ గోల్‌మాల్‌పై ఎంక్వైరీ చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. దీంతో కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ లోకల్ బాడీస్ అడిషనల్ కలెక్టర్ శ్రీజను ఎంక్వైరీ ఆఫీసర్‌గా నియమించారు. ఆమె పూర్తి స్థాయిలో ఎంక్వైరీ పూర్తి చేసి రిపోర్ట్‌ను అందజేశారు. అయితే మిల్లర్లు అవకతవకలకు పాల్పడడంతో పాటు ఇందుకు కొందరు ఆఫీసర్లు కూడా సహకరించారని రిపోర్ట్‌లో పేర్కొన్నట్లు సమాచారం. ఈ రిపోర్ట్ ప్రకారం మిల్లర్లతో మిలాఖత్ అయిన ఆఫీసర్లపై చర్యలకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.
సివిల్ సప్లై అసిస్టెంట్ మేనేజర్ సస్పెన్షన్
సీఎంఆర్ గోల్‌మాల్ వ్యవహారంలో సివిల్ సప్లై టెక్నికల్ అసిస్టెంట్ మేనేజర్ వి.నరసింహారావును ఇప్పటికే సస్పెండ్ చేసినట్లు తెలుస్తోంది. ఒకటి రెండు రోజుల్లో మరికొందరు ఆఫీసర్లపైనా చర్యలు తప్పవన్న ప్రచారం జరుగుతోంది. మరోవైపు అడిషనల్ కలెక్టర్ మధుసూదన్ నాయక్ వారం రోజులుగా సెలవులో ఉన్నారు. అనారోగ్య కారణాలతో ఆయన లీవ్ పెట్టినట్లు ఆఫీసర్లు చెబుతుండగా, సీఎంఆర్‌కు సంబంధించిన వ్యవహారంలోనే ఆయనను కలెక్టర్ లీవ్‌లో పంపినట్లు పలువురు అంటున్నారు.
ఎస్‌ఏఆర్ రైస్ మిల్ ఆస్తుల వేలానికి చర్యలు
సీఎంఆర్ ఎగవేతకు సంబంధించిన ఫైన్ కట్టకపోవడంతో కొణిజర్ల మండలం లాలాపురంలోని ఎస్‌ఏఆర్ రైస్‌మిల్ ఆస్తులను వేలం వేసేందుకు ఆఫీసర్లు చర్యలు చేపట్టారు. రైస్ మిల్ యజమాని, కొణిజర్ల మండలం గుండ్రాతిమడుగుకు చెందిన ఎం. రమాజ్యోతి, ఆమె భర్త బాలకృష్ణ ప్రసాద్ 2022 – 23 రబీ, 2023 – 24 ఖరీప్‌కు సంబంధించిన బకాయి రూ. 81.60 కోట్లకు సంబంధించి ఆఫీసర్లు గతంలోనే నోటీసులు జారీ చేశారు. మిల్ ఓనర్ల నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో ఇటీవల రెండో నోటీసు జారీ చేశారు. రెండవ నోటీసు గడువులోగా డబ్బులు కట్టకపోతే రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రకారం మిల్ ఆస్తులను వేలం వేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆఫీసర్లు తెలిపారు.