ఖమ్మం టౌన్, వెలుగు: సిటీలోని గర్ల్స్ హైస్కూల్ హెచ్ఎం తోట శారద తమను వేధిస్తోందని ఆరోపిస్తూ మంగళవారం క్లాసులు బహిష్కరించి స్కూల్ ఆవరణలో టీచర్లు, స్టూడెంట్స్ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హెచ్ఎం మానసిక పరిస్థితి సరిగా లేక పోవడంతో ఇబ్బంది పడాల్సి వస్తోందని వాపోయారు. హెచ్ఎంపై చర్యలు తీసుకొని సమస్యను పరిష్కరించాలని కోరారు. విషయం తెలుసుకున్న ఎంఈవో శ్రీనివాస్ స్కూల్‌కు వచ్చి స్టూడెంట్స్ ను సమస్య అడిగి తెలుసుకున్నారు. ఈ విషయమై ఎంఈవో శ్రీనివాస్ ను వివరణ కోరగా, హెచ్ఎం మానసిక పరిస్థితి సరిగా లేదని స్టూడెంట్స్ ఫిర్యాదు చేశారని చెప్పారు.
అర్హులందరికీ పోడు పట్టాలు ఇవ్వాలి
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: అర్హులైన పోడు సాగుదారులందరికీ పట్టాలు పంపిణీ చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, ఎమ్మెల్సీ తాతా మధు, ఎమ్మెల్యేలు వనమా వెంకటేశ్వరరావు, మెచ్చా నాగేశ్వరరావు, బానోత్ హరిప్రియ, కలెక్టర్ అనుదీప్, ఐటీడీఏ పీవో గౌతం పోట్రు, ఎస్పీ వినీత్, డీఎఫ్‌వో రంజిత్ లక్ష్మణ్ నాయక్ కొత్తగూడెం కలెక్టరేట్లో సమావేశమాయ్యారు. వారితో మంత్రి, జడ్పీ చైర్మన్ కోరం కనకయ్యతో కలిసిహైదరాబాద్ నుంచి పోడు భూములపై మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లాలో 10.13 లక్షల ఎకరాల్లో అటవీ ప్రాంతం ఉండగా, 2.29 లక్షల ఎకరాలు ఆక్రమణకు గురైందన్నారు. గతంలో 85 వేల ఎకరాలకు ఆర్వోఎఫ్ఆర్ హక్కు పట్టాలను జారీ చేశామన్నారు. పోడు భూముల సమస్య పరిష్కారంలో కమిటీ సభ్యుల సూచనలు, సలహాలను అధికారులు పరిగణలోకి తీసుకోవాలన్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో విచారణ ప్రక్రియ సజావుగా జరిగేలా బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. కలెక్టర్ అనుదీప్ మాట్లాడుతూ జిల్లాలో 726 హ్యాబిటేషన్లలో పోడు సమస్యకు సంబంధించి 83,663 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. హ్యాబిటేషన్ల వారీగా షెడ్యూల్ తయారు చేసి గ్రామపంచాయతీ, మండల, డివిజన్, జిల్లా స్థాయిలో టీమ్‌లను ఏర్పాటు చేసి దరఖాస్తులపై సర్వే చేపట్టనున్నామని ఉన్నామని చెప్పారు. అడిషనల్ కలెక్టర్ కె. వెంకటేశ్వర్లు, డీఆర్డీవో మధుసూధనరాజు, డీపీవో రమాకాంత్, డీఆర్వో అశోక్ చక్రవర్తి, ఆర్డీవో స్వర్ణలత పాల్గొన్నారు.
పోడు భూములకు త్వరలో హక్కులు
పెనుబల్లి, వెలుగు: ప్రభుత్వం 144 జీవో ద్వారాత్వరలో పోడు భూములకు హక్కులు కల్పిస్తుందని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య తెలిపారు. మండలంలోని గంగదేవిపాడు గ్రామంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కనగాల వెంకట్రావు ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ ఫొటోకు క్షీరాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సుప్రీంకోర్టులో తీర్పు పెండింగ్‌లో ఉన్నా, కేంద్రం సహకరించకపోయినా గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్ కల్పించారని తెలిపారు. సర్పంచ్ కనగాల జయలక్ష్మి, ఎంపీటీసీ కనగాల సురేశ్, టీఆర్ఎస్ నాయకులు లక్కినేని వినీల్, ఆళ్ల అప్పారావు, తావు నాయక్, అశోక్, శేఖర్‌రావు, రాము, సాంబయ్య పాల్గొన్నారు.
పెద్దమ్మతల్లి బ్రహ్మోత్సవాల ప్రచార రథం ప్రారంభం
పాల్వంచ,వెలుగు: మండలంలోని పెద్దమ్మతల్లి ఆలయంలో దేవీ శరన్నవ రాత్రి బ్రహ్మోత్సవాల ప్రచార రథాన్ని మంగళవారం ఆలయ ఈవో కె సులోచన, చైర్మన్ మహీపతి రామలింగం జెండా ఊపి ప్రారంభించారు. ఈ నెల 26 నుంచి అక్టోబర్ 6 వరకు నిర్వహించే ఉత్సవాలకు భక్తులు పెద్ద ఎత్తున తరలిరావాలని ఈఓ, చైర్మన్ కోరారు. ధర్మకర్తలు చింతా నాగరాజు, గంధం వెంగళరావు, ముత్యాల ప్రవీణ్ కుమార్, ఆడెపు చిన్న వెంకటరామయ్య, బండి చిన్నవెంకటేశ్వర్లు, సందుపట్ల శ్రీనివాస్ రెడ్డి, మాలోత్ సువాలి, కె లక్ష్మీనారాయణ, కిలారు నాగమల్లేశ్వరరావు, ఎస్వీఆర్కే ఆచార్యులు, బేతంశేట్టి విజయ్ పాల్గొన్నారు.
కార్మికుల కష్టాన్ని దోచుకుంటున్రు
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: సింగరేణి కార్మికుల కష్టార్జితాన్ని కంపెనీ సీఎండీ శ్రీధర్ రాష్ట్ర ప్రభుత్వానికి దోచి పెడుతున్నారని బీఎంఎస్ నేషనల్ కోల్ ఇన్చార్జి కె. లక్ష్మారెడ్డి ఆరోపించారు. కొత్తగూడెం ఏరియాలోని రుద్రంపూర్‌లో మంగళవారం సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘ్ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వాస్తవ లాభాలను సింగరేణి యాజమాన్యం ప్రకటించి, కార్మికులకు లాభాల్లో 35శాతం వాటా ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ కార్మికులకు గ్రాట్యూటీ, సెలవులు, రూ. 10 వేల బోనస్, వైద్య సదుపాయం కల్పించాలని సింగరేణి వ్యాప్తంగా సంఘంఆధ్వర్యంలో ఆందోళనలు నిర్వహించినట్లు చెప్పారు. సీఎండీగా శ్రీధర్ అక్రమంగా కొనసాగింపుపై హైకోర్టులో కేసు వేసినట్లు తెలిపారు. ఏబీకేఎంఎస్ జాతీయ కార్యదర్శి పి మాధవ్ నాయక్, పులి రాజారెడ్డి, మహేశ్, ఎం. ప్రభాకర్, టి. నరేంద్రబాబు, పవన్ కుమార్, మాదాసి రవీందర్ పాల్గొన్నారు.
కాంట్రాక్ట్ కార్మికులకు న్యాయం చేయాలి
కాంట్రాక్ట్ కార్మికుల శ్రమను సింగరేణి యాజమాన్యం, కాంట్రాక్టర్లు దోచుకుంటున్నారని కాంట్రాక్ట్ కార్మికుల హక్కుల పరిరక్షణ సంఘం కొత్తగూడెం ఏరియా ఉపాధ్యక్షుడు యాకయ్య ఆరోపించారు. సంఘం ఆధ్వర్యంలో కాంట్రాక్ట్ కార్మికులు కొత్తగూడెం ఏరియా జీఎం ఆఫీస్ ఎదుట మంగళవారం ధర్నా నిర్వహించారు. అనిల్, జయంత్, చిన్ని, శంకర్, శ్రీనివాస్, రాజేశ్ పాల్గొన్నారు.
బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ల నియామకం
ఇల్లందు, వెలుగు: బీజేపీ ఇల్లందు నియోజకవర్గ కన్వీనర్‌గా పట్టణానికి చెందిన బాలగాని గోపికృష్ణ గౌడ్నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ కన్వీనర్‌గా నియమించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. జిల్లా అధ్యక్షుడు కోనేరు చిన్ని, మాజీ అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్‌రెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు. నియోజకవర్గంలో పార్టీ పటిష్టతకు కృషి చేస్తానని తెలిపారు. పార్టీ నేతలు కొల్లి సంజీవ రెడ్డి, ధరావత్ బాలాజీ, అజ్మీరా రాంచందర్, గుగులోత్ రాంచందర్ నాయక్, మిరియాల వెంకన్న, మవునూరి మాధవ్, శాసనాల రామయ్య, దోమల మహేశ్, రేవళ్ల నాగరాజు, మండవ రాజు, శ్రీను, శివకుమార్, రాహుల్, మురళి, సందీప్, రజత్, పండు హర్షం వ్యక్తం చేశారు.
వైరా కన్వీనర్ గా నెల్లూరి
వైరా నియోజక వర్గ కన్వీనర్‌గా కొణిజర్ల మండలం అనంతారం గ్రామానికి చెందిన నెల్లూరి కోటేశ్వరరావును నియమించారు. పార్టీ నేతలు గరికపాటి మోహన్ రావు, పొంగులేటి సుధాకర్ రెడ్డి, కొండపల్లి శ్రీధర్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు గల్లా సత్యనారాయణలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. నియోజక వర్గ నాయకులు శాలువాతో సన్మానించారు.
పార్టీ బలోపేతానికి కృషి చేయాలి
మధిర, వెలుగు: పార్టీ బలోపేతానికి కృషి చేయాలని జిల్లా ప్రముఖ్ కొండా హరీశ్, దళిత మోర్చా రాష్ట్ర కార్యదర్శి పెరుమాళ్లపల్లి విజయరాజు, జిల్లా కార్యదర్శి చిలివేరు సాంబశివరావు, జిల్లా ఉపాధ్యక్షుడు గుగులోతు నాగేశ్వరావు తెలిపారు. బీజేపీ మధిర నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశం రెడ్డి గార్డెన్ లో నిర్వహించారు. అసెంబ్లీ కన్వీనర్ గా నియమితులైన ఏలూరి నాగేశ్వరావును సన్మానించారు. దేవరకొండ కోటేశ్వరరావు, పాపట్ల రమేశ్ పాల్గొన్నారు.
హైవే విస్తరణ పనులు స్పీడప్ చేయాలి
ఖమ్మం రూరల్, వెలుగు: ఖమ్మం–కోదాడ నేషనల్ హైవే విస్తరణ పనులు నిర్ణీత సమయానికి పూర్తి చేయాలని కలెక్టర్ వీపీ గౌతమ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ ఫోర్‌లైన్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూసేకరణలో భాగంగా నష్టపరిహారం అందని రైతులకు వెంటనే చెల్లించేలా చర్యలు తీసుకోవాలన్నారు. రైతుల భూముల్లో కట్టడాలు, బావులు, బోర్లు తదితరాలకు పరిహారం వెంటనే అందేలా చూడాలని సూచించారు. కలెక్టర్ వెంట అడిషనల్ కలెక్టర్ ఎన్. మధుసూదన్‌రావు, నేషనల్ హైవే పీడీ దుర్గాప్రసాద్, మేనేజర్ పద్మ, తహసీల్దార్లు సుమ, శిరీష, దారా ప్రసాద్ ఉన్నారు.
మరమ్మతులను అడ్డుకున్న బాధితులు
సత్తుపల్లి, వెలుగు: సింగరేణి బ్లాస్టింగ్ లతో వెంగళరావు నగర్ కాలనీలో దెబ్బ తిన్న ఇళ్లకు మరమ్మతులు చేసేందుకు వచ్చిన సింగరేణి సిబ్బందిని బాధితులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో వాగ్వాదం, తోపులాట జరిగింది. సింగరేణి సెక్యూరిటీ సిబ్బంది, పోలీసులతో బాధితులు ఘర్షణ పడ్డారు. ఈ క్రమంలో లక్ష్మీ అనే మహిళకు స్వల్ప గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పీవో వెంకటాచారి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ బాధితులు మరమ్మతులు వద్దని, పరిహారమే కావాలని డిమాండ్ చేశారు. ఇదిలాఉంటే విధులకు ఆటంకం కలిగించి ఘర్షణకు దిగారని కాలనీకి చెందిన ఏడుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
మళ్లీ ఫ్లెక్సీల లొల్లి
దమ్మపేట, వెలుగు: చేప పిల్లల పంపిణీ కార్యక్రమంలో ఫ్లెక్సీలో ఫొటో లేదని టీఆర్ఎస్ నాయకులు ఆందోళనకు దిగారు. దమ్మపేటలో చేపపిల్లల పంపిణీ కార్యక్రమంలో సీఎం కేసీఆర్, మంత్రి తలసాని ఫొటోలతో సంబంధిత అధికారులు ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. స్థానిక ఎమ్మెల్యే ఫొటో లేకపోవడంతో టీఆర్ఎస్ నాయకులుగొడవకు దిగారు. జిల్లా మత్స్యశాఖ అధికారి వీరన్నను దమ్మపేట ఉప సర్పంచ్ దారా యుగంధర్, టీఆర్ఎస్ నాయకులు నిలదీశారు. ఎమ్మెల్యే ఫొటోతో ఫ్లెక్సీ ఏర్పాటు చేసేంత వరకు కార్యక్రమం నిలిచిపోయింది. అనంతరం ఎంపీపీ సోయం ప్రసాద్ చేప పిల్లలను పంపిణీ చేశారు. సర్పంచ్ ఉయ్యాల చిన్న వెంకటేశ్వరరావు, ఎంపీడీవో చంద్రశేఖర్, కొయ్యల అచ్యుతరావు పాల్గొన్నారు.
పెంకుటిల్లు కూలి ఒకరికి గాయాలు
కారేపల్లి,వెలుగు: వర్షానికి గోడలు నాని పెంకుటిల్లు కూలడంతో ఇంటి ఓనర్ వాసిరెడ్డి ప్రసాద్ గాయపడ్డాడు. మంగళవారం ఉదయం భార్య, కూతురు మనుమరాలు ఇంటి బయట ఉండగా ప్రసాద్ ఇంట్లోనే ఉన్నాడు. ఆ సమయంలో పెంకుటిల్లు కుప్పకూలడంతో ప్రసాద్ గాయపడ్డాడు.
రూరల్ సీఐపై సీపీకి ఫిర్యాదు
ఖమ్మం రూరల్, వెలుగు: రూరల్ సీఐపై సీపీ విష్ణు ఎస్ వారియర్‌కు సీపీఐ నాయకులు ఫిర్యాదు చేశారు. త్వరలో డీజీపీ, వరంగల్ రేంజ్ డీఐజీకి కూడా ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. సీఐ తీరుపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదు చేసిన వారిలో సీపీఐ జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్, జిల్లా సహాయ కార్యదర్శి దండి సురేశ్ ఉన్నారు.
ముర్రేడులో బాలుడి డెడ్‌బాడీ లభ్యం
పాల్వంచ,వెలుగు: కొత్తగూడెం పట్టణంలోని ముర్రేడువాగులో గల్లంతైన బూడిదగడ్డ కు చెందిన రెన్ని(11) డెడ్‌బాడీ మంగళవారం గడిపాడు వద్ద లభ్యమైంది. పట్టణ ఎస్సై నరేశ్అక్కడికి చేరుకొని డెడ్‌బాడీని పాల్వంచ హాస్పిటల్ మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
బైక్ ఢీకొని వ్యక్తి మృతి
వేంసూరు, వెలుగు: బైక్ ఢీకొని మండలంలోని లింగపాలెం గ్రామానికి చెందిన మాచినేని సత్యనారాయణ(65) చనిపోయాడు. సోమవారం రాత్రి పాల కేంద్రానికి వెళ్తుండగా బైక్ ఢీకొనడంతో తలకు బలమైన గాయమైంది. చికిత్స నిమిత్తం ఖమ్మం ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం చనిపోయాడు.
సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేత
పాల్వంచ, వెలుగు: నియోజకవర్గంలోని కొత్తగూడెం, పాల్వంచ, సుజాతనగర్, లక్ష్మీదేవిపల్లి, చుంచుపల్లి మండలాల్లో 40 మంది లబ్ధిదారులకు మంజూరైన రూ.16.52 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అందజేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ బరపటి వాసు, ఎంపీపీ మడివి సరస్వతి పాల్గొన్నారు.
స్టూడెంట్ల సామర్థ్యం పెంచాలి
చండ్రుగొండ,వెలుగు: ఆశ్రమ పాఠశాలల్లో చదివే స్టూడెంట్ల సామర్థ్యాన్ని పెంచాలని ఐటీడీఏ డిప్యూటీ డైరెక్టర్ రమాదేవి టీచర్లను ఆదేశించారు. మంగళవారం చండ్రుగొండలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలను తనిఖీ చేశారు. స్కూల్ లోని కిచెన్, డైనింగ్ హాల్, స్కూల్ పరిసరాలను పరిశీలించారు. స్టూడెంట్లను పలు ప్రశ్నలు అడిగి వారి సామర్థ్యాన్ని గుర్తించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్టూడెంట్ల హాజరు శాతాన్ని పెంచాలని సూచించారు. ఆశ్రమ పాఠశాలల్లో ప్రభుత్వం అన్నిరకాల వసతులు కల్పించిందని తెలిపారు.
‘విన్ ఫీల్డ్’ కు బెస్ట్ స్కూల్ అవార్డ్
ఖమ్మం టౌన్, వెలుగు: ఈనెల 19న న్యూ ఢిల్లీలో జరిగిన ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ ఇన్నోవేటివ్ టెక్నాలజీస్ డ్రైవింగ్ ఎడ్యుకేషన్ లో భాగంగా సిటీలోని విన్ ఫీల్డ్ స్కూల్ కు బెస్ట్ స్కూల్ యూజింగ్ టెక్నాలజీ అవార్డ్ దక్కింది. ఎన్ఆర్ఈడీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ప్రీతి సింగ్ తదితరులు అవార్డును అందించినట్లు స్కూల్ నిర్వాహకులు గద్దె పుల్లారావు, మన్నే కిషోర్ కుమార్, పోలవరపు శ్రీకాంత్ తెలిపారు. కొవిడ్ టైమ్ లో స్టూడెంట్స్ స్కూల్ కు దూరమైనప్పటికీ ఆన్లైన్, లైవ్ క్లాసులు, క్విజ్, వక్తృత్వ పోటీలు నిర్వహించడం ద్వారా ఈ అవార్డ్ దక్కిందని తెలిపారు.