- కోర్టులో తేల్చుకుంటానని ప్రకటన
సత్తుపల్లి, వెలుగు : సత్తుపల్లి కాంగ్రెస్ లీడర్ డాక్టర్ మట్టా దయానంద్ ఎస్సీ కుల ధ్రువీకరణ పత్రాన్ని ఖమ్మం కలెక్టర్ గౌతమ్ రద్దు చేశారు. దయానంద్ ఎస్సీ క్యాస్ట్ సర్టిఫికెట్ పొందడాన్ని సవాల్ చేస్తూ గతంలో ములుగు జిల్లా వెంకటాపురానికి చెందిన కొడారి వినాయక రావు ఫిర్యాదు చేశారు. విచారణ జరిపిన అధికారులు నివేదిక సమర్పించారు.
కులాంతర వివాహాల్లో పిల్లలు ఏ కులాన్ని పొందుతారనే అంశంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగా దయానంద్ ఎస్సీ కుల ధ్రువీకరణ పత్రం పొందడానికి, రిజర్వేషన్ హక్కు దక్కించుకొనడానికి అర్హుడు కాడని కలెక్టర్ ఆదేశాల్లో పేర్కొన్నారు. దయానంద్ తండ్రి బీసీ కాగా, తల్లి ఎస్సీ కులానికి చెందిన వారు.
అయినప్పటికీ తండ్రి కులాన్ని వారసత్వంగా తీసుకోవాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. దీంతో ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గమైన సత్తుపల్లి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయాలనుకుంటున్న దయానంద్ భవిష్యత్ప్రశ్నార్థకమైంది.
కోర్టులోనే తేల్చుకుంటా..
క్యాస్ట్ సర్టిఫికెట్రద్దు చేయడంపై దయానంద్ స్పందించారు. తల్లిదండ్రుల్లో ఎవరి కులాన్నయినా పిల్లలు తీసుకునే అవకాశం ఉందని 2012లోనే సుప్రీంకోర్టు తీర్పు చెప్పిందన్నారు. వివిధ రాష్ట్రాల్లో హైకోర్టులు కూడా ఇలాంటి తీర్పులు ఇచ్చాయన్నారు. కలెక్టర్ పాత తీర్పుల ఆధారంగా ఆదేశాలు ఇచ్చారని, కోర్టులోనే తేల్చుకుంటామని చెప్పారు.