ధాన్యం కొనుగోలుకు ప్లాన్ పక్కాగా ఉండాలి

ధాన్యం కొనుగోలుకు ప్లాన్ పక్కాగా ఉండాలి
  •   ఖమ్మం కలెక్టర్ ముజామ్మిల్​ఖాన్
  •   ఏర్పాట్లపై అధికారులతో సమీక్షా సమావేశం 
  •   అక్టోబర్​ 1 నుంచే కేంద్రాలు ప్రారంభించాలని ఆదేశం 
  •    జిల్లా వ్యాప్తంగా 236 సెంటర్ల ఏర్పాటుకు చర్యలు 
  •    4.29లక్షల మెట్రిక్​ టన్నుల ధాన్యం కేంద్రాలకు వస్తుందని అంచనా

ఖమ్మం టౌన్, వెలుగు : జిల్లాలో ఖరీఫ్ సీజన్ కొనుగోలుకు పక్కా ప్రణాళిక సిద్ధం చేయాలని ఖమ్మం కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్​లో ధాన్యం కొనుగోలు సన్నద్ధతపై అడిషనల్​కలెక్టర్లు డాక్టర్ పి. శ్రీజ, డి. మధుసూదన్ నాయక్ తో కలిసి అధికారులతో సమీక్ష నిర్వహించారు. వానాకాలం ధాన్యం కొనుగోలుకు సంబంధించి ప్రణాళిక, అందుబాటులో ఉన్న మౌలిక వసతులు, తదితర అంశాలను అధికారులు వివరించారు.

అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఏ నెలలో ఎంత ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తుందో మండలాల వారీగా ముందస్తుగానే ప్రణాళిక తయారు చేయాలన్నారు. మౌలిక వసతులు ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు. ఖమ్మం జిల్లాలో మొత్తం 6 లక్షల 77 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందనే అంచనా ఉందని, ఇందులో 4 లక్షల 29 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తుందని, వీటి కొనుగోలుకు 236 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నామని తెలిపారు.

అక్టోబర్ 1 నాటికి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలన్నారు. ఈ సమావేశంలో డీఆర్డీవో ఆర్. సన్యాసయ్య, డీసీఎస్​వో కే. చందన్ కుమార్, పౌర సరఫరాల జిల్లా మేనేజర్ జీ. శ్రీలత, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి డీ. పుల్లయ్య, జిల్లా రవాణాధికారి వీ. వెంకట రమణ, లీగల్ మెట్రాలజీ డీఎల్ఎంవోఐ విజయ్ కుమార్, డీఎంవో ఎంఏ అలీం, డీసీఎంఎస్. బిజినెస్ మేనేజర్ కే. సందీప్, డీసీవో అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఎండీ ఆసిఫ్ అన్వర్, ఎఫ్సీఐ మేనేజర్ కే.ఎన్.రెడ్డి, అడిషనల్ డీఆర్డీవో మహమ్మద్ నూరుద్దీన్, డీపీఎం బి.దర్గయ్య, అధికారులు పాల్గొన్నారు. 

ప్రభుత్వ కార్యక్రమాలపై బ్యాంకర్లు దృష్టి పెట్టాలి 

ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలపై బ్యాంకర్లు దృష్టి పెట్టి సక్సెస్​ చేయాలని కలెక్టర్ కోరారు. కలెక్టరేట్ లో అడిషనల్​కలెక్టర్ శ్రీజతో కలిసి బ్యాంకర్లతో డీసీసీ, డీఎల్ఆర్సీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బ్యాంకర్ల సహకారంతో వరద బాధితులకు ప్రభుత్వ సహాయం త్వరగా అందించామన్నారు.

ఇందిరా మహిళా శక్తి కింద యూనిట్ల గ్రౌండింగ్ సక్సెస్ ​చేశామని, ప్రస్తుతం గ్రౌండ్ చేసిన యూనిట్లకు అవసరమైన సహాయం అందించాలని కోరారు. వ్యవసాయ ఆధారిత యూనిట్ల ఏర్పాటుకు ఆసక్తిగా ఉన్న రైతులకు అవసరమైన సలహాలు అందించాలన్నారు. అడిషనల్​ కలెక్టర్ శ్రీజ మాట్లాడుతూ రుణమాఫీకి సంబంధించి సాంకేతికత సమస్యలు ఉన్న బ్యాంకు ఖాతాల వివరాలను సంబంధిత బ్యాంకు మేనేజర్లు అప్ డేట్ చేయాలన్నారు. రుణమాఫీ పూర్తయిన రైతులకు పంట రుణాలు  ఇవ్వాలని సూచించారు. 

మీటింగ్స్​కు టీచర్లు అటెండ్​ కావాలి

పేరెంట్స్, టీచర్ల మీటింగ్స్​కు ప్రతి టీచర్​ తప్పనిసరిగా హాజరు కావాలని కలెక్టర్ సూచించారు. అడిషనల్​కలెక్టర్ శ్రీజతో కలిసి టెలీ కాన్ఫరెన్స్ ద్వారా విద్యాశాఖ అధికారులు, గవర్నమెంట్ టీచర్లతో సమీక్ష నిర్వహించారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశం (పీటీఎం)ల నిర్వహణ కు షెడ్యూల్, ఎజెండా అంశాలు ముందస్తుగా సిద్ధం చేసుకోవాలన్నారు. విద్యార్థి వారీగా చదువు తీరును చర్చించాలని చెప్పారు.

గతంలో ఎలా బోధించేవారు, ఇప్పుడు ఎలా బోధిస్తున్నారు, వచ్చిన మార్పులపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలన్నారు. స్కూళ్లలోని వసతులను వివరించి వారికి సర్కారు బడులపై నమ్మకం కలిగించాలని చెప్పారు. వరద ముంపునకు గురైన స్కూళ్ల విద్యార్థులకు పాఠ్య, నోట్ పుస్తకాలు పంపిణీ చేయాలన్నారు. 

రోప్ వే ఏర్పాటుకు స్థల పరిశీలన

ఖమ్మం ఖిల్లాపై సందర్శకులు, పర్యాటకులు సౌకర్యవంతంగా వెళ్లే విధంగా రోప్ వే ఏర్పాటుకు గాను కలెక్టర్ పర్యాటక శాఖ, రెవెన్యూ, సంబంధిత అధికారులతో కలిసి శుక్రవారం స్థల పరిశీలన చేశారు. రోప్ వే ఏర్పాటుకు, పార్కింగ్ ఏర్పాటుకు ఎంత మేరకు స్థలం అవసరం ఉంటుంది, ఏర్పాట్ల నిమిత్తం ఎక్విప్మెంట్ తరలించేందుకు రవాణాపై సంబంధిత అధికారులతో చర్చించారు.