
- బోధన నాణ్యతపై హెడ్మాస్టర్లు దృష్టి పెట్టాలి
- ఖమ్మం కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్
ఖమ్మం టౌన్, వెలుగు : ప్రభుత్వ పాఠశాలలో బోధన నాణ్యతపై హెడ్మాస్టర్లు దృష్టి సారించాలని ఖమ్మం కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ సూచించారు. శుక్రవారం జిల్లా పరిషత్ కార్యాలయంలో మండల విద్యాధికారులు, హెచ్ఎంలతో పదవ తరగతి పరీక్షల సన్నద్ధత, విద్యా శాఖ కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో ప్రైవేట్ కంటే మెరుగ్గా పిల్లలకు విద్య అందుతుందన్న నమ్మకం తల్లిదండ్రులకు కల్పించాల్సిన బాధ్యత హెడ్మాస్టర్లదేనని చెప్పారు.
టీచర్లు ఎలా బోధిస్తున్నారు, ఏవైనా లోపాలు ఉంటే వెంటనే సూచనలు, సలహాలు ఇవ్వాలని సూచించారు. మార్కులపై మాత్రమే కాకుండా పిల్లలకు ఎంత వరకు అర్థమవుతుంది, చివరి బెంచ్ విద్యార్థికి కూడా సబ్జెక్టుపై ఆసక్తి కల్గించేలా ప్లాన్ చేయాలన్నారు. ఈసారి టెన్త్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించాలన్నారు. ఈ సమావేశంలో డీఈవో సోమశేఖర శర్మ, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.