
- ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో లబ్ధిదారులకు ప్రతి దశలో తోడ్పాటు అందించాలి
- ఖమ్మం కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్
ఖమ్మం, వెలుగు: అనర్హులకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తే కఠిన చర్యలు తప్పవని ఖమ్మం కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ హెచ్చరించారు. ఇండ్ల నిర్మాణంలో లబ్ధిదారులకు ప్రతి దశలో తోడ్పాటు అందించాలని అధికారులకు సూచించారు. శుక్రవారం కలెక్టరేట్ లో ఇందిరమ్మ ఇండ్ల పథకంపై ఖమ్మం, పాలేరు, మధిర నియోజకవర్గాల్లోని సంబంధిత అధికారులకు నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.గ్రామ సభల్లో వచ్చిన దరఖాస్తులను ఇందిరమ్మ ఇండ్ల యాప్ ద్వారా మరోసారి వెరిఫై చేయనున్నట్లు తెలిపారు.
ఎట్టిపరిస్థితుల్లో అనర్హులకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వొద్దని, ఏదైన తప్పు జరిగితే ముందుగానే చెప్పాలని సూచించారు. పేదలను ఎంపిక చేస్తున్న నేపథ్యంలో ఇంటి నిర్మాణం రూ.5 లక్షలు దాటితే పూర్తి చేయడం లబ్ధిదారులకు కష్టమవుతుందని, వారికి ప్రతి దశలో తక్కువ ఖర్చుతో నాణ్యమైన ఇండ్లు ఎలా కట్టాలో సలహాలు, సూచనలు అందజేస్తూ ఉండాలన్నారు. మండల కేంద్రంలో పెట్టే ఇసుక డంప్ దుర్వినియోగం కాకుండా చూసుకోవాలని చెప్పారు. లబ్ధిదారులకు సిమెంట్ తక్కువ ధరకు సరఫరా చేసేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే మంజూరు చేసిన ఇండ్లు గ్రౌండ్ చేయాలని, రెండు వారాలలో ఇంటి బేస్మెంట్ పనులు పూర్తి అయ్యేలా చూడాలని చెప్పారు.
బేస్మెంట్ పూర్తయితే రూ.లక్ష విడుదల అవుతాయన్నారు. ఇంటి నిర్మాణానికి మొదటి విడత ప్రభుత్వ సహాయం వచ్చే వరకు పెట్టుబడి లేని లబ్ధిదారులకు స్వశక్తి మహిళా సంఘాల రుణాలు అందించడానికి గల అవకాశాలను పరిశీలించాలని సూచించారు. శిక్షణ పొందిన అధికారులతో మండల స్థాయిలో మేస్త్రీలకు తక్కువ ఖర్చుతో ఇంటి నిర్మాణంపై శిక్షణ అందిస్తామని చెప్పారు. ప్రతి సోమవారం పంచాయతీ కార్యదర్శులు మండల కేంద్రంలో నిర్మిస్తున్న ఇందిరమ్మ మోడల్ హౌస్ ను పరిశీలించాలనన్నారు. ఈ శిక్షణా సమావేశంలో అడిషనల్ కలెక్టర్ శ్రీజ, డీఆర్డీవో సన్యాసయ్య, జడ్పీ సీఈవో దీక్షా రైనా, డీపీవో ఆశాలత, హౌజింగ్ పీడీ శ్రీనివాసరావు, పీఆర్ ఈఈ వెంకట్ రెడ్డి పాల్గొన్నారు.
ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు
ఖమ్మం జిల్లాలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి గ్రాడ్యుయేట్, టీచర్స్
ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలపై జిల్లాల కలెక్టర్ లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి కలెక్టర్ ముజా మ్మిల్ ఖాన్, పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తో పాల్గొని జిల్లాలో ఎన్నికల ఏర్పాట్లను వివరించారు. పోలింగ్ కు 24 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేశామని చెప్పారు. సిబ్బందికి శిక్షణతోపాటు మిగతా అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. సమావేశంలో డీఆర్వో ఏ. పద్మశ్రీ, ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు స్వామి, కలెక్టరేట్ ఎన్నికల డీటీ అన్సారీ పాల్గొన్నారు.