మా లక్ష్యం.. నంబర్ వన్ ప్లేస్ : కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్

మా లక్ష్యం.. నంబర్ వన్ ప్లేస్ : కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్
  • విద్య, వైద్యం, వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత
  • ధరణి దరఖాస్తుల కోసంహెల్ప్​ డెస్క్​లు
  • ప్రభుత్వ భూముల చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు
  • ప్రాజెక్టులకు భూసేకరణ పూర్తి చేసేందుకు ఆన్​ట్రాక్ ఉన్నాం

ఖమ్మం, వెలుగు: ఖమ్మం జిల్లాను అన్ని రంగాల్లో ఫస్ట్ ప్లేస్​లో ఉంచడమే తమ లక్ష్యమని కొత్త కలెక్టర్​ముజామ్మిల్ ఖాన్ వెల్లడించారు. జిల్లాలోని ముగ్గురు మంత్రుల సహకారంతో ముందుకెళ్తానని చెప్పారు. ఖమ్మం జిల్లా కలెక్టర్​గా బాధ్యతలు తీసుకున్న సందర్భంగా వివిధ అంశాలపై ‘వెలుగు’తో ఆయన ముచ్చటించారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే.. 

విద్య, వైద్యం, వ్యవసాయానికి ఫస్ట్ ప్రయారిటీ

గవర్నమెంట్ స్కూళ్లలో వసతుల కల్పనకు ప్రభుత్వం కృషి చేస్తోంది. స్టూడెంట్స్​కు మెరుగైన విద్య అందించడంతోపాటు ఉద్యోగాలు తెచ్చుకునేలా వారిని సిద్ధం చేస్తాం. స్పోకెన్​ ఇంగ్లిష్ నేర్పించాలని ప్లాన్​ చేస్తున్నాం. టీచర్లకూ తగిన ట్రైనింగ్ పై దృష్టి పెడతాం. అక్కడక్కడ చిన్న ఇబ్బందులు తప్పితే వైద్యానికి సంబంధించి జిల్లాలో మంచి సౌకర్యాలు ఉన్నాయి. వాటిని పరిష్కరించి ఇంకా మెరుగ్గా చేస్తాం.

 ఇక్కడి రైతులు చాలా ప్రోగ్రెసివ్​గా ఉన్నారు. రైతులకు మరింత లాభం కలిగించేలా చర్యలు తీసుకుంటాం. కూరగాయల సాగు విస్తీర్ణం పెంచడం, పట్టు పురుగుల పెంపకంతోపాటు కొత్త ఆలోచనల ద్వారా 2 నుంచి 3 వేల ఎకరాల్లో రైతులకు ముందుగా ఎక్కువ ఆదాయం తెప్పించి చూపిస్తాం. దాని కోసం ఒక ప్రక్రియను ప్లాన్​ చేస్తున్నాం. 

రెండు వారాల్లో ధరణి హెల్ప్​ డెస్క్​లు

ధరణి సమస్యల పరిష్కారం కోసం హెల్ప్​ డెస్కులను ఏర్పాటు చేయబోతున్నాం. పెద్దపల్లి జిల్లాలో సక్సెస్​ ఫుల్​గా అమలు చేశాం. దరఖాస్తుల సమయంలో తెలియక చేసిన చిన్న తప్పుల వల్ల మళ్లీ తిరగాల్సిన పరిస్థితి రాకుండా, అప్లికేషన్ల సమయంలోనే వారికి అవగాహన కల్పిస్తాం. ఏ మాడ్యూల్​లో, ఏయే కాగితాలతో అప్లయ్​ చేయాలో హెల్ప్ డెస్క్​ల ద్వారా గైడెన్స్​ఇస్తాం. 

ఒకవేళ అప్లికేషన్ రిజక్ట్ అయితే తగిన కారణాలను వివరిస్తాం. ఆ తప్పులను సవరించుకొని మళ్లీ అప్లయ్​ చేసుకుంటే, రిజక్ట్ కాకుండా ఉండడానికి 90 శాతం అవకాశం ఉంటుంది. తీవ్రమైన అవసరముంటేనే తప్ప రైతులు అధికారి దగ్గరకు వెళ్లాల్సిన అవసరం లేకుండా, ఇంటి దగ్గరకే పాస్​ బుక్​ వచ్చేలా మా కార్యాచరణ ఉంటుంది. రెండు వారాల్లోగా కలెక్టరేట్​లో హెల్ప్​ డెస్క్​ ఏర్పాటు చేస్తాం. తర్వాత వారంలో ఆర్డీవో ఆఫీసుల్లో, తహసీల్దార్ కార్యాలయాల్లో దశలవారీగా ఏర్పాటు చేస్తాం.

రైతులతో సమన్వయం చేసుకొని భూసేకరణ

హైవేలు, రైల్వే ట్రాక్​లు, పరిశ్రమలు, ప్రాజెక్టులు, ఇతర అభివృద్ధి పనుల కోసం భూసేకరణ తప్పనిసరి. రైతులతో సరైన సమన్వయం లేకపోతే కోర్టు కేసులు, ఇతర సమస్యలు వస్తాయి. చట్టంలో ఉన్న ఫ్లెక్సిబిలిటి, కలెక్టర్​కు ఉన్న అధికారాలను ఉపయోగించుకొని రైతులకు పరిహారం పెంచే ప్రయత్నం చేస్తాం. హైవేలు రావడం ద్వారా మిగిలిన భూమికి ఎన్నో రెట్లు ధర పెరుగుతుందన్న అంశాన్ని కూడా వారికి వివరిస్తాం. ఇద్దరికీ నచ్చే విధంగా పరిష్కారం చేస్తాం. పెండింగ్​లో ఉన్న భూసేకరణను త్వరగా పూర్తి చేసేందుకు ఆన్​ట్రాక్​ ఉన్నాం. 

నకిలీ విత్తనాలు అమ్మితే క్రిమినల్ ​కేసులు 

జిల్లాలో నకిలీ విత్తనాల సమస్య లేకుండా గత కలెక్టర్ వీపీ గౌతమ్​ పకడ్బందీగా తనిఖీలు చేశారు. ఇకపై దానిని  అలాగేకంటిన్యూ చేస్తాం. సీడ్​ డీలర్లు వారి షాపుల్లో అప్రూవల్ ఉన్న స్టాక్​నే అమ్మాలి. రైతులు లైసెన్స్ ​ఉన్న డీలర్​దగ్గరే విత్తనాలు కొనుగోలు చేయాలి. తప్పనిసరిగా బిల్లుతో పాటు కొన్న బస్తాను దగ్గర పెట్టుకోండి. తక్కువ ధరకు వస్తాయని ఊర్లోకి వచ్చి అమ్మేవారి దగ్గర కొనుగోలు చేయొద్దని రైతులకు అవగాహన కల్పిస్తాం. ఎవరైనా సీడ్​ డీలర్లు తప్పు చేయడం వల్ల రైతు నష్టపోతే, రెవెన్యూ రికవరీ యాక్ట్​ కింద డీలర్లపై క్రిమినల్ చర్యలు తీసుకుంటాం. రైతుల దగ్గర ఆధారాలుంటే వారు నష్టపోకుండా చూసే బాధ్యత మాది.

ప్రభుత్వ భూముల చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు

జిల్లాలో ప్రభుత్వ భూములను కాపాడడానికి చర్యలు తీసుకుంటాం. ముందుగా వక్ఫ్, ఎండోమెంట్, ఇతర ప్రభుత్వ భూములపై సర్వే నిర్వహిస్తాం. పాత రికార్డులు చెక్​ చేసిన తర్వాత జరిగిన మార్పులు చేర్పులను పరిశీలిస్తాం. రికార్డు పరంగా ఏం ఉండాలి, ప్రస్తుతం ఏముంది అనేది చూసిన తర్వాత ఆక్రమణలపై  చర్యలు తీసుకుంటాం. జిల్లాలో ఉన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇద్దరు మంత్రులతో మాట్లాడి ఫండ్​ క్రియేట్ చేసుకొని, ప్రభుత్వ భూముల చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తాం. ఏదైనా వసతులు కావాలంటే ముందుగా భూమి ఉండాలి. అందుకే ప్రభుత్వ భూములను కాపాడుకోవడం మాకు కీలకం. ప్రాధాన్యతనిచ్చి ఒక నెలలోనే ప్రత్యేకమైన డ్రైవ్​ లాగా దీన్ని నిర్వహిస్తాం. 

ప్రజావాణిలోనే కాదు.. రోజూ కలవొచ్చు

ప్రతి సోమవారం ప్రజావాణి నిర్వహిస్తాం. దానితో పాటు ఇతర వర్కింగ్ డేస్​ లో కూడా ఉదయం పదిన్నర నుంచి మధ్యాహ్నం 12.30 వరకు కలెక్టరేట్ లో నేను అందుబాటులో ఉంటా. ఆ తర్వాతనే మిగిలిన ఫైల్స్​, ఫీల్డ్ విజిట్, ఇతర రివ్యూల కార్యక్రమం ఉంటుంది. 12.30లోపు ఎవరైనా నన్ను కలవొచ్చు.