ఖమ్మం జిల్లాలో ధాన్యం కొనుగోళ్లకు ఏర్పాట్లు చేయాలి : కలెక్టర్​ ముజామ్మిల్​ఖాన్​

 ఖమ్మం జిల్లాలో ధాన్యం కొనుగోళ్లకు ఏర్పాట్లు చేయాలి :  కలెక్టర్​ ముజామ్మిల్​ఖాన్​
  • ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష

 ఖమ్మం, వెలుగు: యాసంగి ధాన్యం కొనుగోళ్ల కోసం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని ఖమ్మం కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ లో అడిషనల్​ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డితో కలిసి సంబంధిత అధికారులతో ఆయన సమీక్షించారు. రబీ సీజన్ కు సంబంధించి లక్షా 85 వేల మెట్రిక్ టన్నుల సన్న రకం ధాన్యం, 73 వేల మెట్రిక్ టన్నుల దొడ్డు రకం ధాన్యం, మొత్తం 2.58 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయబోతున్నామని తెలిపారు. గత సీజన్ లో ధాన్యం రవాణా అంశంలో ఎక్కడైనా ఇబ్బందులు వస్తే, వాటిని పునరావృతం కాకుండా చూడాలన్నారు. మొత్తం 344 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని చెప్పారు.

 ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే ట్యాబ్ ఎంట్రీ చేసేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. జిల్లా సరిహద్దుల్లో చెక్ పోస్టులను ఏర్పాటు చేసి ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడకు సన్న రకం వడ్లు రాకుండా చూడాలన్నారు. కొనుగోలు కేంద్రాల్లో అన్ని వసతులు ఉండేలా చూడాలని, ప్యాడీ క్లీనర్, వేయింగ్ యంత్రాలు, తేమ యంత్రాలు, అవసరమైన గన్ని సంచులు, టార్ఫాలిన్​ కవర్లు  అందుబాటులో పెట్టుకోవాలని సూచించారు. సమావేశంలో డీఆర్డీఓ సన్యాసయ్య, జిల్లా పౌరసరఫరాల అధికారి చందన్ కుమార్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి పుల్లయ్య, పౌర సరఫరాల జిల్లా మేనేజర్ జి. శ్రీలత, జిల్లా మార్కెటింగ్ అధికారి ఎం.ఏ. అలీం, జిల్లా సహకార అధికారి గంగాధర్ ఉన్నారు. 

ఐకేపీ వీవోఏ, సీసీలతో సమావేశం..

పెనుబల్లి : మండల కేంద్రంలోని ఐకేపీ కార్యాలయంలో నిర్వహించిన పెనుబల్లి , వేంసూరు మండలాల ఐకేపీ వీవోఏ, సీసీల సమావేశంలో కలెక్టర్​ ముజామ్మిల్​ ఖాన్​ మాట్లాడారు. స్వయం సహాయక గ్రూపులకు లోన్లు అందించే ప్రాసెస్ లో వారు ఎంచుకున్న బిజినెస్ లాభదాయకమో..  కాదో గుర్తించాలన్నారు.  డ్వాక్రా మహిళల రికార్డులను పూర్తి స్థాయిలో మెయింటెన్ చేయాలని సూచించారు. బ్యాంకులకు 90శాతం పైగా రుణాలను డ్వాక్రా మహిళలు చెల్లిస్తున్నారని, అందుకే వారి అభివృద్ది కోసం బిజినెస్ లోన్లు అందించి ఆర్థికంగా బలపడేలా ప్రభుత్వం సహాయం చేస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీడీ నజీరుద్దీన్ , ఏపీఎం జ్యోతిప్రసన్న, తహసీల్దార్ గంటా ప్రతాప్ , ఎంపీడీవో అన్నపూర్ణ తదితరులు పాల్గొన్నారు.

‘వాల్ ఆఫ్​ కైండ్ నెస్'  గోడ ప్రారంభం 

ఖమ్మం జిల్లా ప్రధాన ఆస్పత్రి ఎదురుగా ‘వాల్ ఆఫ్​ కైండ్ నెస్’​ ను అడిషనల్​ కలెక్టర్ శ్రీజ, ట్రైనీ కలెక్టర్ మృణాల్ శ్రేష్ట, డీఎఫ్ఓ సిద్దార్థ్ విక్రమ్ సింగ్ తో కలిసి కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ ప్రారంభించారు. ఈ గోడ దగ్గర ప్రజలు తమ ఇంట్లో అవసరం లేని వస్తువులు, పాత సామన్లు, బట్టలు వదిలితే అవి అవసరం ఉన్నవారు తీసుకొని వెళ్తారని ఆయన తెలిపారు. వాల్ ఆఫ్ కైండ్ నెస్ గోడ వద్ద ఎట్టి పరిస్థితుల్లో ఆహార పదార్థాలు వదిలివేయొద్దని సూచించారు. ‘దయచేసి మీకు అవసరమైనది తీసుకోండి.. అవసరం లేనిది వదిలేయండి’ అనే నినాదంతో వాల్ ఆఫ్ కైండ్ నెస్ పని చేస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈఓ దీక్షా రైనా, జిల్లా ప్రధాన ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్​ కిరణ్ కుమార్ ఉన్నారు.