‘సీతారామ’కు పెండింగ్​.. భూ సేకరణ పూర్తి చేయాలి : కలెక్టర్​ ముజామ్మిల్ ఖాన్

‘సీతారామ’కు పెండింగ్​.. భూ సేకరణ పూర్తి చేయాలి : కలెక్టర్​ ముజామ్మిల్ ఖాన్
  • ఖమ్మం కలెక్టర్​ ముజామ్మిల్ ఖాన్

ఖమ్మం టౌన్, వెలుగు : సీతారామ ప్రాజెక్టుకు మిగతా భూ సేకరణ ప్రక్రియ వెంటనే పూర్తి చేయాలని ఖమ్మం కలెక్టర్​ ముజామ్మిల్​ ఖాన్​ అధికారులను ఆదేశించారు.  ప్రాజెక్టు స్టేజ్ 2 పనుల పురోగతిపై మంగళవారం ఆయన అధికారులతో సమీక్షించారు. సీతారామ ప్రాజెక్టు కోసం ఇంకా  భూసేకరణ చేయాల్సిన రైతులతో సంప్రదింపులు జరపాలన్నారు. కాల్వ ఏర్పాటుతో రైతుల భూముల విలువ పెరుగుతుందని వారికి అవగాహన కల్పించాలని చెప్పారు. 75 శాతం కంటే ఎక్కువ భూమిని కోల్పోతున్న రైతులు, సాగుకు మిగులు భూమి అక్కరకు రాకపోతే, ఆ భూమిని కూడా సేకరించాలని సూచించారు.

భూసేకరణలో భూములతో పాటు, నిర్మాణాలు, పైప్ లైన్లు, షెడ్లు, చెట్లు తదితర అన్నిటి విలువ చూపాలని చెప్పారు. భూములు ఇచ్చిన రైతులకు గిరి వికాసం, తదితర ప్రభుత్వ పథకాల్లో ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలిపారు. కాల్వ నిర్మాణంలో వున్న గ్యాస్ పైప్ లైన్ దగ్గర సంబంధిత గ్యాస్ కంపెనీ ఇంజినీర్ల సహకారంతో బాక్స్ టన్నెల్ నిర్మాణం చేయాలన్నారు. సమీక్షలో ఎస్డీసీ ఎం.రాజేశ్వరి, ఇరిగేషన్ ఈఈ అర్జున్, జిల్లా ఉద్యానవన అధికారి వెంకట రమణ, కలెక్టరేట్ భూసేకరణ సూపరింటెండెంట్ మీనన్, ఏన్కూరు తహసీల్దార్ శేషగిరిరావు, ఉద్యానవన అధికారి వేణు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.