ఖమ్మం టౌన్, వెలుగు : జిల్లాలోని పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోవాలని ఖమ్మం కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్లో జిల్లాలోని పర్యాటక ప్రదేశాల అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలపై స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ, కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్య, సంబంధిత అధికారులతో కలిసి సమీక్షించారు.
నేలకొండపల్లి బౌద్ధ స్థూపం, పాలేరు లేక్, ఖమ్మం ఖిల్లా, పులిగుండాల ప్రాజెక్ట్, వెలుగుమట్ల అర్బన్ పార్క్ లాంటి పలు పర్యాటక ప్రాంతాల వద్ద చేయనున్న అభివృద్ధి పనులు, ప్రస్తుత స్థితిగతులను వివరిస్తూ జిల్లా అటవీ అధికారి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ వెలుగుమట్ల అర్బన్ పార్క్ వద్ద 40 ఫీట్ల రోడ్డు అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని చెప్పారు. జమలాపురం వేంకటేశ్వర స్వామి దేవాలయం వద్ద అటవీ పార్క్, కాటేజీ అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు.
పాలేరు లేక్ వద్ద పిక్నిక్ స్పాట్ అభివృద్ధి చేయాలని, ఇక్కడ ప్రజలు అధికంగా వచ్చేలా జాతీయ రహదారి దగ్గర ప్రచార హోర్డింగులు ఏర్పాటు చేయాలని చెప్పారు. ఖమ్మం ఖిల్లా వద్ద రోప్ వే నిర్మాణ పనులకు ప్రజలతో చర్చించి చర్యలు చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా అటవీ అధికారి సిద్ధార్థ్ విక్రమ్ సింగ్, డీఆర్డీవో సన్యాసయ్య, ఖమ్మం ఆర్డీవో నరసింహారావు, టూరిజం జిల్లా అధికారి సుమన్ చక్రవర్తి, ఇరిగేషన్, దేవాదాయ, అటవీ, రెవెన్యూ శాఖ అధికారులు పాల్గొన్నారు.
నీటి వనరుల ఆక్రమణలు గుర్తించాలి
ఫిబ్రవరి 12 లోపు నీటి వనరుల ఆక్రమణలు గుర్తించి నివేదిక అందించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ విషయమై అడిషనల్ కలెక్టర్ శ్రీజ, కేఎంసీ కమిషనర్ అభిషేక్ తో కలిసి ఆయన సమీక్షించారు. ఈ మున్నేరు నది రిటైనింగ్ వాల్ నిర్మాణానికి మొత్తం 17 కిలో మీటర్ల స్ట్రెచ్ లో 345 పైగా బే యూనిట్ లు నిర్మించాల్సి ఉంటుందన్నారు. వీటిలో 8.5 కిలో మీటర్ వరకు ప్రభుత్వ భూమి అందుబాటులో ఉందని, మిగతా పట్టా భూమి సేకరణ స్పీడప్ చేయాలని చెప్పారు. ఈ సమావేశంలో ఇరిగేషన్ ఎస్ఈ వెంకటేశ్వర్లు, ఖమ్మం ఆర్డీవో నరసింహా రావు, ఏడీ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ శ్రీనివాసులు, ఇరిగేషన్, రెవెన్యూ శాఖ అధికారులు పాల్గొన్నారు.
సీఆర్ పీఎఫ్ క్యాంపునకు భూమి కేటాయింపు
ఖమ్మం నియోజకవర్గం రఘునాథ పాలెంలో సీఆర్ పీఎఫ్ క్యాంపు కోసం 1.5 ఎకరాల భూమిని కేటాయిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల కాపీని తన చాంబర్ లో 141 వ బెటాలియన్ సీఆర్పీఎఫ్ కమాండెంట్ సతీశ్ ఠాకూర్ కు కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ అందజేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ శ్రీజ, కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్య, జిల్లా అటవీశాఖ అధికారి సిద్ధార్ద్ విక్రమ్ సింగ్ ఉన్నారు.