రోడ్డు ప్రమాదాల నియంత్రణకు పక్కాగా ప్లాన్ చేయాలి : కలెక్టర్​ ముజామ్మిల్ ఖాన్​

రోడ్డు ప్రమాదాల నియంత్రణకు పక్కాగా ప్లాన్ చేయాలి : కలెక్టర్​ ముజామ్మిల్ ఖాన్​
  • ఖమ్మం​ కలెక్టర్​ ముజామ్మిల్ ఖాన్​

ఖమ్మం టౌన్, వెలుగు :  రోడ్డు ప్రమాదాల నియంత్రణకు పక్కా ప్రణాళికతో పని చేయాలని ఖమ్మం కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ అధికారులకు సూచించారు. శుక్రవారం కలెక్టరేట్ లో రోడ్డు సేఫ్టీ కోసం తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత అధికారులతో సీపీ సునీల్ దత్, అడిషనల్​ కలెక్టర్ శ్రీజతో కలిసి ఆయన సమీక్షించారు. జిల్లా వ్యాప్తంగా బ్లాక్ స్పాట్స్ గుర్తించాలన్నారు. స్పీడ్ లిమిట్ బోర్డుల ఏర్పాటు చేయాలని చెప్పారు. రోడ్డు సేఫ్టీపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.

రాబోయే సమావేశానికి డీఈవోను కూడా ఆహ్వానించాలని, జిల్లాలో ఉన్న స్కూల్ జోన్ ఏరియా లను ట్రాక్ చేసి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఫుట్ పాత్ ఆక్రమణలను వెంటనే తొలగించాలని ఆదేశించారు.  సీపీ మాట్లాడుతూ వైరా బ్రిడ్జి దగ్గర రెగ్యులర్ గా సమస్యలు వస్తున్నాయని , జాతీయ రహదారుల అధికారులతో సమన్వయం చేసుకుంటూ తక్కువ ఖర్చుతో తక్కువ సమయంలో నూతన బ్రిడ్జి ఏర్పాటుకు అవకాశాలు పరిశీలించాలన్నారు. జిల్లా రెవెన్యూ అధికారి ఎం. రాజేశ్వరి, ఆర్ అండ్ బీ ఎస్ఈ హేమలత, జిల్లా రవాణా అధికారి వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. 

ఈవీఎం గోడౌన్ ను తనిఖీ 

త్రైమాసిక తనిఖీల్లో భాగంగా కలెక్టరేట్ ఆవరణలో గల ఈవీఎం గోడౌన్ ను అడిషనల్​ కలెక్టర్ పి. శ్రీనివాస్ రెడ్డి, రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి కలెక్టర్ తనిఖీ చేశారు. ఈవీఎం గదుల్లో ఎక్సాస్ట్ ఫ్యాన్ ఉన్న ప్రదేశంలో బయటి వైపు మెస్ జాలి ఏర్పాటు చేయాలని సూచించారు. పరిసరాల్లో చెత్త చేరకుండా జాగ్రత్తలు పాటించాలన్నారు

పిల్లల భవిష్యత్​కు కృషి చేయాలి

నేలకొండపల్లి : పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు అందరూ కృషి చేయాలని కలెక్టర్ కోరారు. నేలకొండపల్లి మండల కేంద్రం సింగిరెడ్డిపాలెం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో నిర్వహించిన వార్షికోత్సవ వేడుకలో ఆయన మాట్లాడారు. పిల్లలు పాఠశాలకు రెగ్యులర్ గా హాజరయ్యేలా చూడాలన్నారు. ప్రైవేట్ స్కూళ్లలోని స్టూడెంట్స్​కు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లోని పిల్లలు చదివేలా చర్యలు తీసుకుంటామన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. 

పల్లీలు అమ్ముకునే దివ్యాంగురాలికి రూ.లక్ష రుణం

ఖమ్మం, వెలుగు: ఖమ్మం త్రీ టౌన్ జహీర్ పుర చౌరస్తాలో దివ్యాంగురాలు డుంగ్రోత్ కమల నాలుగు చక్రాల బండిపై పల్లీలు అమ్ముకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటోంది. ఇటీవల ఖమ్మం నగరంలో కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ ఆమె బండి వద్దకు వెళ్లి ప్రత్యేకంగా మాట్లాడారు. ఆమె కుటుంబ పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. తాను, అమ్మ కలిసి ఉంటామని, దుర్భర జీవితాన్ని గడుపుతున్నామని కమల కలెక్టర్​కు వివరించింది.

ఈ క్రమంలో కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్యకు కలెక్టర్​ ఫోన్ చేసి కమలకు రుణం అందించే ఏర్పాట్లు చేయాలని సూచించారు. దీంతో మెప్మా డీఎంసీ సుజాత, టీఎంసీ సుజాత, సీవో రోజా ఆధ్వర్యంలో స్థానికంగా ఉన్న బ్యాంక్ తో మాట్లాడి కేవలం ఐదురోజుల్లోనే రూ.లక్ష రుణం చెక్కును అందించారు. త్వరలో కమలతో కూరగాయాల వ్యాపారం పెట్టించనున్నారు.