లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు : కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్

  • ఖమ్మం కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్

ఖమ్మం టౌన్, వెలుగు :  జిల్లాలో గర్భస్థ లింగ నిర్ధారణ వ్యతిరేక చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని ఖమ్మం కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ అధికారులను ఆదేశించారు.  ఈ చట్టం అమలుపై గురువారం కలెక్టరేట్ లో సీపీ సునీల్ దత్ తో కలిసి జిల్లా మల్టీ మెంబర్ అప్రోప్రియేట్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అబార్షన్లు ఎక్కడైనా జరుగుతున్నట్లు ఫిర్యాదులు అందింతే వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు.

సేవ్ ది గర్ల్ చైల్డ్ పై అవగాహన కల్పించాలని సూచించారు. సీపీ మాట్లాడుతూ చట్టాన్ని అతిక్రమించి లింగ నిర్ధారణ పరీక్షలు జరిపినా, అబార్షన్ చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సీనియర్ సివిల్ జడ్జి, సెక్రటరీ లీగల్ సెల్ కేవీ చంద్రశేఖర్ రావు మాట్లాడుతూ లీగల్ సర్వీస్ సెల్ ద్వారా గ్రామ స్థాయిలో అవగాహన కల్పించేందుకు కృషి చేయనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో డీఎంహెచ్​వో కళావతి బాయి, డీసీహెచ్ఎస్ డాక్టర్ రాజశేఖర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. 

హాస్టల్​ ఆకస్మిక తనిఖీ 

నయా బజార్ లోని వెనుకబడిన తరగతుల బాలుర వసతి గృహాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. వసతి గృహానికి ఉన్న అత్యవసర అంశాలపై నివేదిక అందించాలని వార్డెన్ సైదులు కు సూచించారు. 10 రోజుల్లో పూర్తి చేసే  రిపేర్లు, దోమల తెర, పెయింటింగ్ మొదలగు  ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. స్టూడెంట్స్​కు అందించే ఆహారంలో నాణ్యత లోపాలు ఎవైనా ఉంటే సహించబోమన్నారు. వసతి గృహంలోని విద్యార్థులకు బంకర్ బెడ్స్ అందించేందుకు టెండర్లు పిలవాలని ఆదేశించారు. అనంతరం జిల్లా రవాణా శాఖ అధికారి కార్యాలయం ఆవరణలో ఆటో డ్రైవర్లకు జరుగుతున్న ప్రత్యేక హెల్త్ శిబిరాన్ని పరిశీలించి పలు సూచనలు చేశారు. 

ఆదర్శవంతంగా నమునా ఇండ్లు నిర్మించాలి

కూసుమంచి : -ఆదర్శవంతంగా ఇందిరమ్మ నమూనా ఇండ్లు నిర్మించాలని కలెక్టర్ సూచించారు. కూసుమంచి మండలం తహసీల్దార్ ఆఫీస్​లో ఉన్న ఖాళీ స్థలంలో నమూనా ఇల్లు నిర్మించేందుకు స్థలాన్ని పరిశీలించారు. మేస్త్రీలకు అవసరమైన శిక్షణ కూడా ఇదే ప్రాంతంలో అందించేలా చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులకు సూచించారు. అనంతరం స్థానిక ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేశారు. తేమ శాతం రాగానే ధాన్యాన్ని కొనుగోలు చేసి మద్దతు ధర చెల్లించాలని నిర్వాహకులకు సూచించారు.  రైతులు ఆయిల్ పామ్ పంట సంగుపై దృష్టి సారించాలన్నారు.