- ఖమ్మం కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్
ఖమ్మం టౌన్, వెలుగు : మండలంలోని సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఖమ్మం కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ తహసీల్దార్లను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ లో రెవెన్యూ శాఖ పనితీరుపై అడిషనల్ కలెక్టర్ పి. శ్రీనివాస్ రెడ్డి తో కలిసి ఆయన సమీక్షించారు. సంక్రాంతి లోపల ధరణిలో పెండింగ్ ఉన్న దరఖాస్తులను పరిష్కరించాలన్నారు. జిల్లాలో 4,400 ధరణి దరఖాస్తులు పెండింగ్ ఉంటే వీటిలో దాదాపు 2,400 దరఖాస్తులు ఫిజికల్ ఫైల్ అందని కారణంగా పెండింగ్ ఉన్నాయని, వీటిని పూర్తి చేసేందుకు సంబంధిత ఫైల్స్ వెంటనే రెవెన్యూ డివిజన్ అధికారి, అడిషనల్ కలెక్టర్, కలెక్టర్ కార్యాలయాలకు అందించాలని సూచించారు.
5 ఎకరాల కంటే తక్కువ ఉన్న ఆర్ఎస్ఆర్ దరఖాస్తులను డిసెంబర్ నెలలో, 10ఎకరాల వరకు ఉన్న ఆర్.ఎస్ఆర్ దరఖాస్తులు సంక్రాంతి వరకు, 10 ఎకరాల కంటే ఎక్కువ ఉన్న దరఖాస్తులను సంక్రాంతి తర్వాత ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి పరిష్కరిద్దామని తెలిపారు. జిల్లాకు రాకుండా మండలంలో ప్రజావాణిలోనే ఎక్కువ సమస్యలు పరిష్కరించాలని సూచించారు. రెసిడెన్షియల్ పాఠశాలలు, సంక్షేమ హాస్టల్స్, కేజీబీవీలను రెగ్యులర్గా తనిఖీ చేస్తూ, ఏ సమస్య రాకుండా చూడాలన్నారు. అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ఖమ్మం, కల్లూరు రెవెన్యూ డివిజన్ పరిధిలో ఆక్రమణకు గురైన ప్రైమ్ ల్యాండ్స్ ను వెంటనే ప్రభుత్వం స్వాధీనంలోకి తీసుకోవాలన్నారు.
మండలాల వారీగా ఉన్న ప్రభుత్వ భూముల వివరాలు, ఎంత భూమి ఆక్రమణకు గురైంది, ఎవరు ఆక్రమించారు, ప్రస్తుత స్థితిగతులు తదితర అంశాలపై నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి రాజేశ్వరి, ఖమ్మం, కల్లూరు రెవెన్యూ డివిజన్ అధికారులు నర్సింహారావు, రాజేందర్, తహసీల్దార్లు, కలెక్టరేట్ సూపరింటెండెంట్లు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
డీపీఆర్ తయారు చేయాలి
ఖమ్మం నగరంలో సాంస్కృతిక ప్రదర్శనలకు వేదికగా ఉన్న భక్త రామదాసు కళా క్షేత్రాన్ని ఆధునీకరణ చేసేందుకు డీపీఆర్ తయారు చేయాలని కలెక్టర్ అన్నారు. కళా క్షేత్రంలో చేపట్టిన ప్రూఫ్ లీకేజీ, ఎంట్రీ కలర్ వాష్, ఇతర రిపేర్లను ఆయన పరిశీలించారు. కళలకు, కళాకారులకు పుట్టినిల్లు అయిన ఖమ్మం జిల్లాలో ఉన్న శ్రీ భక్త రామదాసు కళా క్షేత్రాన్ని ఆధునీకరించి ప్రైవేట్ ఫంక్షన్ హాల్ కు ధీటుగా తయారు చేయాలని సూచించారు.
అడవుల పెంపకంపై దృష్టి సారించాలి
కలెక్టరేట్ లో అటవీ, రెవెన్యూ అధికారులతో పరిహార అటవీ పెంపకం, అడవుల సంరక్షణపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. అటవీయేతర అవసరాల కోసం మళ్లించిన అటవీ భూమికి పరిహారంగా అడవులను పెంచాలన్నారు. జిల్లాలో సుమారు 1500 హెక్టార్ల అటవీ భూమి డైవర్షన్ కు గురయ్యిందని తెలిపారు.
అటవీ భూమిని అసైన్డ్ పట్టాల పంపిణీ చేసిన వివరాలు అటవీ, రెవెన్యూ శాఖల అధికారులు సరిచూసుకోవాలన్నారు. రెవెన్యూ అధికారులు అటవీ భూములు పోనూ, గుట్టలుగా అందుబాటులో ఉన్న భూమిని గుర్తించాలని ఆదేశించారు.