ఖమ్మం టౌన్, వెలుగు : రైతులు కొనుగోలు సీడ్స్, ఎరువులు కొనుగోలు చేసినప్పుడు ఫెర్టిలైజర్ షాపుల విక్రయదారులు తప్పనిసరిగా బిల్లులు ఇవ్వాలని ఖమ్మం కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ ఆదేశించారు. శుక్రవారం శుక్రవారం ఖమ్మంలోని బర్మాషెల్ రోడ్, గాంధీ చౌక్ లో విత్తన, ఎరువుల షాపులను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టాక్ రిజిస్టర్, బిల్ బుక్ లు, విత్తన బస్తాలపై లాట్ నంబర్, మార్కెట్ రేటు, కాల పరిమితి లాంటి వివరాలను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇతర షాపులకు అమ్మిన, రైతులకు నేరుగా అమ్మిన రిజిస్టర్లను విడివిడిగా నిర్వహించాలన్నారు. సాగులో సక్సెస్ అయిన రైతు అనుభవాలను, ఇతర రైతులకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. సాగులో ట్రాన్స్ ప్లాంట్, బ్రాడ్ కాస్ట్, డ్రమ్ సీడ్ పద్ధతుల్లో ఏ పద్ధతికి ఎంత పెట్టుబడి, దిగుబడి వివరాలను ఇవ్వాలన్నారు. వ్యవసాయ అధికారుల తనిఖీల షెడ్యూల్ ప్రకారం, షాపుల తనిఖీలు పకడ్బందీగా చేయాలని ఆదేశించారు. జిల్లాలో విత్తనాలు ఎలాంటి కొరత లేదన్నారు. రైతులు ప్యాక్ చేసిన విత్తనాలు మాత్రమే కొనాలని సూచించారు. కలెక్టర్ వెంట జిల్లా వ్యవసాయ అధికారిణి విజయనిర్మల, సహాయ సంచాలకులు ఏ. శ్రీనివాసరావు, ఖమ్మం అర్బన్ మండల వ్యవసాయ అధికారి కిషోర్ బాబు ఉన్నారు.
పథకాలు అర్హులందరికీ అందాలి
పథకాలు అర్హులందరికీ అందేలా చూడాలని అధికారులకు కలెక్టర్ సూచించారు. శుక్రవారం కలెక్టరేట్ లోని మీటింగ్ హాల్ లో ఆయా శాఖల జిల్లా అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. అధికారులు బాధ్యతాయుతంగా పని చేయాలన్నారు. జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగులకు పర్సనల్ ఫైనాన్స్, ఇన్వెస్ట్ మెంట్ పై అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. ఉద్యోగులకు హెల్త్ క్యాంపు నిర్వహించి, అందరి హెల్త్ ప్రొఫైల్ సేకరించనున్నట్లు చెప్పారు. ప్లాస్టిక్ రహితంగా కార్యాలయాల నిర్వహణ చేపట్టాలన్నారు. అధికారులు, సిబ్బంది కలిసి కలెక్టర్ కు అభినందనలు తెలిపారు.
ఎగ్జామ్స్ నిర్వహణ పటిష్టంగా ఉండాలి
హాస్టల్ సంక్షేమ అధికారి, డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ పరీక్షల నిర్వహణకు అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఖాళీగా ఉన్న హాస్టల్ సంక్షేమ అధికారులు, డివిజనల్ అకౌంట్స్ అధికారి పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసి, దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు సీబీఆర్టీ విధానం ద్వారా జూన్ 24 నుంచి 29 వరకు హాస్టల్ సంక్షేమ అధికారులు, జూన్ 30 నుంచి జూలై 4 వరకు డివిజనల్ అకౌంట్స్ అధికారి పరీక్షలను నిర్వహించనున్నట్లు వివరించారు. జిల్లాలో 8 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
యోగా అందరికీ అవసరం...
యోగా కొందరిది కాదని, అందరిదరికీ అవసరమని కలెక్టర్ తెలిపారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా శుక్రవారం స్థానిక సర్దార్ పటేల్ స్టేడియంలో జిల్లా ఆయూష్, యువజన క్రీడల శాఖలు సంయుక్త ఏర్పాటుచేసిన కార్యక్రమాన్ని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. రాజగోపాల్ తో కలిసి కలెక్టర్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. యోగాసనాలు వేశారు.