చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందిస్తాం : ముజామ్మిల్ ఖాన్

చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందిస్తాం :  ముజామ్మిల్ ఖాన్
  • పాలేరు ఎడమ కాల్వ కట్టను నిరంతరం పర్యవేక్షిస్తున్నాం
  • ఖమ్మం కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్

కూసుమంచి, వెలుగు : పాలేరు ఎడమ కాల్వ చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందిస్తామని, రైతులు ఆందోళన చెందవద్దని ఖమ్మం కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ అన్నారు. గురువారం కూసుమంచి మండలం హట్యాతండాలోని పాలేరు ఎడమ కాల్వ నీటి విడుదల ప్రక్రియను ఆయన పరిశీలించారు. పాలేరు ఎడమ కాల్వ కట్ట వైపు ఊట నీటిని 100 హెచ్ పీ సామర్థ్యం గల 11 మోటార్ల ద్వారా సుమారు 200 క్యూసెక్కుల నీటిని కాల్వలోకి ఎత్తిపోసే ప్రక్రియను, అసిస్టెంట్ ఇంజినీరింగ్ విద్యుత్ ఆపరేషన్ విభాగాన్ని కలెక్టర్ పర్యవేక్షించారు.

పాలేరు నుంచి జుజ్జల్​రావుపేట వైపు కట్ట చివరి వరకు నడిచి కట్ట పటిష్టతను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పాలేరు ఎడమ కాల్వ ద్వారా 2,500 నుంచి 3,000 క్యూసెక్కుల సాగునీటి విడుదల చేస్తున్నామని తెలిపారు. క్రమంగా నీటి ప్రవాహం పెంచుతూ ఆయకట్టుకు నీరు విడుదల చేస్తున్నామని చెప్పారు. కలెక్టర్​వెంట ఇరిగేషన్ ఈఈ అనన్య, తహసీల్దార్ సురేశ్, అధికారులు పాల్గొన్నారు.