- లాభదాయక సాగు దిశగా పని చేయాలి
- ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు ఇవ్వాలి
- ఖమ్మం కలెక్టర్ముజామ్మిల్ఖాన్
- పంట పొలాల్లో రైతులతో కూర్చొని పలు అంశాలపై చర్చ
ఖమ్మం టౌన్/తల్లాడ, వెలుగు : నారు మడి నుంచి పంట అమ్మకం వరకు ప్రతి దశలో రైతులకు ఆఫీసర్లు అండగా ఉండాలని ఖమ్మం కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్సూచించారు. పంటకు అవసరమైన సలహాలు, సూచనలు ఎప్పటికప్పుడు రైతులకు ఇస్తూ లాభదాయక సాగుకు కృషి చేయాలన్నారు. శుక్రవారం ఆయన తల్లాడ మండలం మిట్టపల్లి గ్రామంలో వరి నాట్లను పరిశీలించారు. రైతులతో పాటు పొలంలో కూర్చొని సాగు పద్ధతులు, ఎదురవుతున్న ఇబ్బందులు, పంటలో వచ్చే లాభం, తదితర అంశాలను చర్చించారు.
వెదజల్లే పద్ధతిలో వరి నాటును కలెక్టర్ గమనించారు. పొలంలో స్వయంగా ఆయన దిగి పని చేశారు. ధరణి దరఖాస్తులపై సమస్యలు అడిగి తెలుసుకుని, వారికి సమాధానాలు ఇచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వరి నాట్లు వేయడానికి ఎంత పెట్టుబడి అవుతుంది, పంట తెగుళ్లకు వాడే పురుగు మందులు, ఎరువుల లభ్యత, పంట దిగుబడి, కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, ధాన్యం మిల్లులకు తరలింపు, రైతులకు జరిగే చెల్లింపు, తదితర దశల్లో రైతులకు ఆఫీసర్లు అండగా ఉండాలని చెప్పారు. కొత్త సాగు పద్ధతులను రైతులకు వివరించాలని సూచించారు. కలెక్టర్ వెంట జిల్లా వ్యవసాయ శాఖ అధికారి విజయనిర్మల, వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు నర్సింహారావు, మండల వ్యవసాయ శాఖ అధికారులు, రైతులు తదితరులు ఉన్నారు.
బేస్ లైన్ ఎగ్జామ్ నిర్వహించాలి
ప్రభుత్వం నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం పాఠశాలల్లోని విద్యార్థులకు బేస్ లైన్ పరీక్ష నిర్వహించి, వెనుకబడినవారిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని కలెక్టర్ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్ లో ఎంఈవీలు, హెడ్మాస్టర్లతో విద్యార్థుల విద్యా ప్రమాణాల పెంపు చర్యలపై సమావేశం నిర్వహించారు. స్కూళ్లలో స్టూడెంట్ల హాజరుపై దృష్టి పెట్టాలన్నారు. ప్రతీ సబ్జెక్ట్ పై, అంశంపై బెస్ట్ టీఎల్ఎంలను రూపొందించాలని చెప్పారు. ఇంటి వద్ద తల్లిదండ్రులు తమ పిల్లల చదువుపై దృష్టి పెట్టేలా అవగాహన కల్పించాలన్నారు. తరగతులు, పాఠశాల వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేయాలని సూచించారు. సమావేశంలో డీఈవో సోమశేఖరశర్మ, జెండర్ ఈక్విటీ కోఆర్డినేటర్ కె. భూలక్ష్మి, డీసీఈబీ కార్యదర్శి జి. నారాయణ, ఏఎంవో రవికుమార్, ప్లానింగ్ కోఆర్డినేటర్ సీహెచ్. రామకృష్ణ, మండల విద్యాశాఖ అధికారులు, హెడ్మాస్టర్లు పాల్గొన్నారు.
దివ్యాంగులకు చేయూత
దివ్యాంగులకు ప్రభుత్వం నుంచి చేయూతను అందిస్తామని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్ లో దివ్యాంగులు కలెక్టర్ ను కలిసి ఉపాధికి అవకాశాలు కల్పించాలని కోరారు. వివిధ శాఖలలో అవకాశాలను బట్టి దివ్యాంగులకు ఉపాధి కల్పించనున్నట్లు కలెక్టర్ తెలిపారు.
ఓటమి విజయానికి నాంది కావాలి
ఓటమి విజయానికి నాంది కావాలని, ఓటమికి నిరుత్సాహ పడొద్దని కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్ర గ్రంథాలయాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న యువతీ, యువకులతో మాట్లాడి సమస్యలు, సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. పరీక్షలకు సన్నద్ధం కావాల్సిన విధానంపై అవగాహన కల్పించారు. చదువుతో పాటు అరగంట ఆటలు, వ్యాయామానికి కేటాయించాలని సూచించారు. గ్రంథాలయంలో టాయిలెట్లు, తాగునీటి సమస్య ఉన్నట్లు పాఠకులు తెలుపగా, వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టనున్నట్లు కలెక్టర్ హామీ ఇచ్చారు.