
ఖమ్మం కార్పొరేషన్, వెలుగు : మండలాల్లోని పైలట్ గ్రామాల్లో మంజూరు చేసిన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల గ్రౌండింగ్ కు ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోవాలని ఖమ్మం కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ అన్నారు. బుధవారం కలెక్టరేట్ లోని తన ఛాంబర్ లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంపై స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ పి. శ్రీజతో కలిసి సంబంధిత అధికారులతో ఆయన సమీక్షించారు. ఇందిరమ్మ మోడల్ హౌస్ నిర్మాణ పురోగతి, పైలెట్ గ్రామాల్లో గ్రౌండ్ చేసిన ఇండ్ల స్థితిగతుల వివరాలపై ఆరా తీశారు.
పైలెట్ గ్రామాల్లో ఎంపిక చేసిన 850 లబ్ధిదారుల్లో ఇంటి నిర్మాణానికి ముందు డబ్బులు పెట్టుకోలేని 369 మందికి మహిళా సంఘాల ద్వారా వారంలోపు రూ.లక్ష రుణాలు అందించేలా జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారితో సమన్వయం చేసుకోవాలన్నారు. మండల కేంద్రాల్లో పనులు పురోగతి నెమ్మదిగా ఉందని, సంబంధిత కాంట్రాక్టర్ తో అధికారులు మాట్లాడి వచ్చే బుధవారం నాటికి పనులలో వేగం పెంచాలని సూచించారు.
రెండు వారాలలో పనులు పూర్తి చేయలేని పక్షంలో సంబంధిత కాంట్రాక్ట్ రద్దు చేసి ఇతరులకు కేటాయించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి ఏ. పద్మశ్రీ, జడ్పీ సీఈవో దీక్ష రైనా, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి సన్యాసయ్య, ఈఈ హౌసింగ్ భూక్యా శ్రీనివాస్, ఈఈ పంచాయతీ రాజ్ వెంకటరెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి ఆశాలత తదితరులు పాల్గొన్నారు.
మహిళా మార్ట్ ను ఏర్పాటు చేయాలి
మహిళా మార్ట్ ను ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని కలెక్టర్ అన్నారు. సీక్వెల్ రోడ్డులోని మహిళా మార్ట్ ఏర్పాటు చేసే భవనం పనులను అడిషనల్ కలెక్టర్ శ్రీజతో కలిసి ఆయన పరిశీలించారు. మహిళా మార్ట్ ముందు భాగంలో ఉన్న ఓపెన్ స్పేస్ లో పార్కింగ్ సౌకర్యం కల్పించాలని సూచించారు.
మహిళా మార్ట్ లో స్వశక్తి మహిళా సంఘాలచే తయారుచేసిన పదార్థాలు విక్రయించనున్నట్లు తెలిపారు. ఉత్పత్తుల వివరాలు, తయారీ విధానం, అమ్మే మహిళ గ్రూప్ స్టోరీ నీ డాక్యుమెంట్ చేస్తూ ప్రదర్శించాలని చెప్పారు. మార్ట్ లో బిల్లింగ్ విధానం, స్టాకింగ్ తదితర అంశాలపై మహిళలకు శిక్షణ ఇవ్వాలని సూచించారు. ఖమ్మం జిల్లా బ్రాండింగ్ వచ్చేలా లోగో, స్టిక్కరింగ్ డిజైన్ తయారు చేయాలని చెప్పారు.
జాబ్ మేళా కార్యక్రమంలో..
వైరా : గత తరాల మహిళలకు చదువుకునేందుకు అవకాశాలు లభించలేదని, తన అమ్మమ్మ పెళ్లి తర్వాత చదువుకున్నారని, ప్రస్తుతం తమ కుటుంబం అంతా చదువుకుని మంచి స్థానంలో ఉండేందుకు అమ్మమ్మ కారణమని, తన భార్య కూడా యూపీఎస్సీ రాసి ఢిల్లీలో ఉన్నత బాధ్యతలో ఉన్నారని ఖమ్మం కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ తెలిపారు.
తన చిన్నతనంలో 7వ తరగతి చదివే సమయంలో విజయలక్ష్మి అనే టీచర్ తనపై తీసుకున్న శ్రద్ధ కారణంగానే తాను కలెక్టర్ స్థాయికి చేరుకున్నానని గుర్తు చేశారు. కొణిజర్ల మండలం తనికెళ్లలోని తెలంగాణ గిరిజన సంక్షేమ బాలికల గురుకుల డిగ్రీ కళాశాలలో జిల్లా ఉపాధి అధికారి కార్యాలయ ఆధ్వర్యంలో నిర్వహించిన జాబ్ మేళా కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడారు.
ఆర్థికంగా బలోపేతం కాక పోవడమే మహిళల పట్ల ఉన్న వివక్షకు కారణమని గమనించిన ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం అమలు ప్రారంభించిందన్నారు. చదువులో బాలుర కంటే అధికంగా బాలికలు రాణిస్తున్నారని తెలిపారు.