- ఖమ్మం కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్
ఖమ్మం టౌన్, వెలుగు : ఖరీఫ్ సీజన్ లో జిల్లాలో సన్న రకం ధాన్యం కొనుగోలుకు ప్రత్యేకంగా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని ఖమ్మం కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ తెలిపారు. సోమవారం భక్త రామదాసు కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు సన్నాహక సమావేశంలో స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ డాక్టర్ శ్రీజ, ట్రైనీ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ తో కలిసి ఆయన మాట్లాడారు. ధాన్యం కొనుగోళ్లలో ఎలాంటి ఇబ్బందుల్లేకుండా చూడాలన్నారు. నాణ్యమైన వడ్లను మద్దతు ధరపై కొనుగోలు చేసి 48 గంటల్లో చెల్లింపులు చేయాలని ఆదేశించారు. జిల్లాలో 3 లక్షల మెట్రిక్ టన్నుల సన్న రకం ధాన్యం, లక్ష మెట్రిక్ టన్నుల దొడ్డు రకం ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉంటుందని అంచనా వేసినట్లు తెలిపారు.
వ్యవసాయ శాఖ విస్తరణ అధికారులు గ్రామాల వారీగా సన్న రకం ధాన్యం ద్రువీకరణ చేసి కొనుగోలు కేంద్రాల మ్యాపింగ్ చేయాలని సూచించారు. ప్రతి మూడు, నాలుగు ధాన్యం కొనుగోలు కేంద్రాలకు ఒక మండల స్థాయి అధికారిని పర్యవేక్షణ అధికారిగా నియమించామన్నారు. ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత గన్ని సంచులకు ట్యాగ్ ఏర్పాటు చేసి, దానిపై సెంటర్ నంబర్ వేయాలని సూచించారు. కొనుగోలు చేసిన ధాన్యం బస్తాలు 24 గంటల్లో కేంద్రాల నుంచి తరలించకపోతే రవాణా కాంట్రాక్టర్లకు కోత విధించనున్నట్లు చెప్పారు.
హమాలీల కొరత రాకుండా చూడాలన్నారు. సరిహద్దుల నుంచి జిల్లాకు ఎట్టి పరిస్థితుల్లో ధాన్యం రానివొద్దని సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు కల్పించాలన్నారు. అడిషనల్ కలెక్టర్ శ్రీజ మాట్లాడుతూ ఐకేపీ కేంద్రాలు తేమ యంత్రాల పనితీరు పరిశీలించి అవసరమైతే నూతన యంత్రాల కోసం డీఆర్డీవోకు ప్రతిపాదనలు పంపాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీవో సన్యాసయ్య, అడిషనల్ డీసీపీ ప్రసాద రావు, జిల్లా సహకార అధికారి గంగాధర్, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి చందన్ కుమార్, జిల్లా మార్కెటింగ్ అధికారి అలీమ్, పౌరసరఫరాల జిల్లా మేనేజర్ శ్రీలత, మండల అధికారులు పాల్గొన్నారు.
శంకుస్థాపన ఏర్పాట్లు పక్కాగా ఉండాలి
డిప్యూటీ సీఎం మంగళవారం నిర్వహించే సమీక్షకు, ఈనెల 11న సమీకృత రెసిడెన్షియల్ పాఠశాలల సముదాయాల శంకుస్థాపన కార్యక్రమాలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్లో అడిషనల్ కలెక్టర్ శ్రీజ, ఎస్సి, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ అధికారులతో కలిసి ఆయన సమావేశం నిర్వహించారు. సంక్షేమ వసతి గృహాల నిర్వహణపై డిప్యూటీ సీఎం సమీక్ష నిర్వహించనున్నారని, నివేదికలు సిద్ధంచేసి సమర్పించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
జిల్లాలో ఎన్ని వసతి గృహాలు ఉన్నాయి, ఏ ఏ ప్రదేశాల్లో ఉన్నాయి, సొంత భవనమా, అద్దె భవనామా, ఇంకా సమస్యలున్నాయా అన్న వివరాలతో నివేదికలు సిద్ధం చేయాలన్నారు. ఈ నెల 9న హైదరాబాద్లో టీచర్ల నియామక ఉత్తర్వులు తీసుకునేందుకు వెళ్లే అభ్యర్థులకు బస్సులు ఏర్పాటు చేయాలన్నారు. 11న జిల్లాలో సమీకృత రెసిడెన్షియల్ పాఠశాలల సముదాయ శంకుస్థాపనకు ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలన్నారు. దళితబంధు కింద దారిమళ్లిన యూనిట్ల విషయమై తీసుకున్న చర్యలపై నివేదిక సమర్పించాలని చెప్పారు.
దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి
ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ప్రజావాణి సందర్భంగా కలెక్టరేట్ లోని మీటింగ్ హాల్ లో ఆయన దరఖాస్తులను స్వీకరించారు. వివిధ సమస్యలపై 40 సాధారణ పెన్షన్, నిరుద్యోగం, లోన్, భూ సమస్యలు రాగా మరో 15 ధరణికి సంబంధించిన వినతులు వచ్చాయి. అనంతరం జిల్లా కోశాధికారిగా జిల్లాలో సేవలు అందించిన వి. సత్యనారాయణ మహబూబాబాద్ జిల్లాకు బదిలీ అయిన సందర్భంగా కలెక్టర్ ఘనంగా
సన్మానించారు.