మార్చి 31లోపు ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు పరిష్కరించాలి  : కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్

మార్చి 31లోపు ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు పరిష్కరించాలి  : కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్

ఖమ్మం టౌన్, వెలుగు :  మార్చి 31 లోపు ఎల్ఆర్ఎస్ దరఖాస్తులన్నీ పరిష్కరించాలని ఖమ్మం కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కేఎంసీ కార్యాలయంలో ఎల్ఆర్ఎస్ పై కమిషనర్ అభిషేక్ అగస్త్యతో కలిసి సంబంధిత అధికారులతో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్​ మాట్లాడుతూ టౌన్ ప్లానింగ్, సుడా, కార్పొరేషన్ అధికారులు సమన్వయంతో ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను ప్రాసెస్ చేసి పరిష్కరించాలన్నారు.

రెవెన్యూ, నీటిపారుదల శాఖ అధికారుల వద్ద అధికంగా ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు పెండింగ్ ఉన్నాయని తెలిపారు. దరఖాస్తులను 3 దశలలో స్క్రూటినీ చేయాల్సి ఉంటుందని చెప్పారు. ప్రభుత్వ భూములు, కోర్టు కేసులు, నీటి వనరుల బఫర్ జోన్, ఎఫ్ టీఎల్ పరిధిలో  లేకుండా క్లియర్ గా ఉన్న భూముల దరఖాస్తులను వెంటనే ఆమోదించాలన్నారు.

టౌన్ ప్లానింగ్, రెవెన్యూ, నీటిపారుదల శాఖ అధికారులతో 14 బృందాలు ఏర్పాటు చేసి లక్ష్యాలు నిర్దేశించుకుని పని చేయాలని సూచించారు.  సిబ్బంది డిప్యూటేషన్ కోసం ప్రతిపాదనలు పంపాలన్నారు. అభిషేక్ అగస్త్య మాట్లాడుతూ ఎల్ఆర్ఎస్ ప్రక్రియను ప్రభుత్వం సులభతరం చేసిందని చెప్పారు. టౌన్ ప్లానింగ్, ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు సమన్వయంతో దరఖాస్తులను ఫాస్ట్ ట్రాక్ చేయాలన్నారు. 

రంజాన్ నిర్వహణకు ఏర్పాట్లు

ప్రశాంత వాతావరణంలో రంజాన్ నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఏర్పాట్లపై పోలీస్ కమిషనర్ సునీల్ దత్, కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్య, అడిషనల్​ కలెక్టర్ పి. శ్రీనివాస్ రెడ్డి తో కలిసి ముస్లిం మత పెద్దలు, అధికారులతో సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. ఏదైనా మసీదు దగ్గర తాగునీటి, విద్యుత్ సరఫరాకు సమస్య ఉంటే చెప్పాలని కోరారు. సీపీ మాట్లాడుతూ పటిష్ట బందోబస్తు చేస్తున్నట్లు తెలిపారు.