మా పాపే మా ఇంటి మణిదీపం .. వెలుగు తో ఖమ్మం కలెక్టర్​ముజామ్మిల్ ఖాన్

మా పాపే మా ఇంటి మణిదీపం .. వెలుగు తో ఖమ్మం కలెక్టర్​ముజామ్మిల్ ఖాన్
  • ఆలోచనల్లో మార్పు వస్తేనే ఆడపిల్లలకు సమానత్వం 
  • అన్ని రంగాల్లో ఖమ్మం జిల్లాను ముందుంచడమే లక్ష్యం 
  • మహిళా మార్ట్ ఏర్పాటుతో మహిళా సంఘాలకు ప్రోత్సాహం 

ఖమ్మం, వెలుగు: తల్లిదండ్రుల ఆలోచనల్లో మార్పు వస్తేనే అమ్మాయిలను అబ్బాయిలతో సమానంగా చూస్తారని ఖమ్మం కలెక్టర్​ ముజామ్మిల్ ఖాన్​ అన్నారు. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను అమలు చేస్తూంటే, మరోవైపు వినూత్న కార్యక్రమాలను జిల్లాలో కలెక్టర్​ ప్రారంభించారు. క్షేత్ర స్థాయిలో పర్యటిస్తున్న సమయంలో రైతులు, విద్యార్థులు, వ్యవసాయ కూలీలతో మమేకమవుతూ, వారి సమస్యలను తెలుసుకుంటున్నారు. ప్రతీ బుధవారం ప్రభుత్వ పాఠశాలల్లో జిల్లా స్థాయి అధికారులు పర్యటించి, స్టూడెంట్స్ తో కలిసి మధ్యాహ్న భోజనం చేస్తున్నారు.

 కలెక్టరేట్ లో వివిధ పనుల కోసం వచ్చే దివ్యాంగులకు ఉచిత మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తున్నారు. ఆటో డ్రైవర్లకు ఉచిత వైద్య పరీక్షలు, కలెక్టరేట్ లో ఆస్పత్రి ఏర్పాటు, ఉద్యోగులకు హెల్త్ చెకప్​, అంగన్​ వాడీ బడులను ఆకర్షణీయంగా తీర్చిదిద్దడం.. ఆడబిడ్డను కన్న దంపతులను ‘మా పాప.. మా ఇంటి మణిదీపం’లో భాగంగా సన్మానించడం..  ఇలా చాలా వినూత్నమైన కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఖమ్మం కలెక్టర్​ ముజామ్మిల్ ఖాన్​ ‘వెలుగు’తో మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. 

గతేడాది పెద్దపల్లిలో వచ్చిన ఆలోచనతోనే..! 

మన దేశంలో గతంలో వెయ్యి మంది మగవారికి, 1020 మంది ఆడవాళ్లు ఉండేవారు. ఈ నిష్పత్తి క్రమంగా మారుతూ అమ్మాయిల సంఖ్య తగ్గుతోంది. ఇన్నేళ్ల నుంచి ఎన్​ ఫోర్స్ మెంట్ పైన దృష్టిపెట్టాం. స్కానింగ్ లో జెండర్​ రివీల్ చేయకుండా చూడడం, ఎవరైనా బయటకు చెబితే స్కానింగ్ సెంటర్లపై చర్యలు తీసుకోవడం లాంటివి చేస్తున్నాం. అయినా సామాజికంగా తల్లిదండ్రుల ఆలోచనల్లో అమ్మాయిల పట్ల మార్పు అంత వేగంగా రావడం లేదు. గతేడాది పెద్దపల్లిలో కలెక్టర్​ గా ఉన్నప్పుడు ఆస్పత్రిని సందర్శించిన సమయంలో జరిగిన ఒక ఘటనతోనే ఒక ఆలోచన వచ్చింది. కూతురు పుట్టిన తల్లిదండ్రుల ఇండ్లకు వెళ్లి, వారిని సత్కరించాలని, సన్మానించాలని నిర్ణయించాం.

అందులో భంగాంగా ‘మా పాప.. మా ఇంటి మణిదీపం’ కార్యక్రమం ఏర్పాటు చేసి  పండ్లు, స్వీట్ బాక్స్​ తీసుకెళ్లి ఇవ్వడం, మీ ఇంట్లోకి మహాలక్ష్మి వచ్చిందంటూ ప్రశంసాపత్రం లాంటి దాంతో సందేశాన్ని ఇస్తున్నాం. ముందుగానే హైరిస్క్​ ఉన్న తల్లిదండ్రులను గుర్తించి వారి ఇళ్లకు వెళ్తున్నాం. మొదటి కాన్పులో పాప పుట్టిన వారు, రెండు కాన్పుల్లోనూ పాప పుట్టిన వారు, కొడుకుపై అబ్బాయి కోసం ఒత్తిడి తెస్తున్న తల్లి..  ఇలా అంగన్​ వాడీలు, ఆశాల ద్వారా ఫీడ్ బ్యాక్ తెలుసుకుంటున్నాం. 

వారంలో మండలానికి ఒక గ్రామంలో అలాంటి హైరిస్క్​ ఉన్న ఫ్యామిలీ ఇంటికి మహిళా జిల్లా ఆఫీసర్ వెళ్లి, ఒక పండుగలా సంబురాలు చేయడం వల్ల, ఆ మహిళా ఆఫీసర్ల సక్సెస్​ స్టోరీనే తల్లిదండ్రులకు స్ఫూర్తినిచ్చేలా చూస్తున్నాం. దీని వల్ల అమ్మాయిలను చిన్నచూపు చూడడం ఆపేస్తారని భావిస్తున్నాం. దీని ద్వారా మేం మొదటి అడుగు వేస్తున్నాం. ఆ తర్వాత వారానికోసారి మండల ఆఫీసర్లు ఫాలో అప్​ చేస్తారు. 

‘మేడ్​ ఇన్​ ఖమ్మం’ బ్రాండ్​ ను నిర్మిస్తాం..!

జిల్లాలో మహిళా సంఘాలు చేస్తున్న ఉత్పత్తులను అమ్మేందుకు మహిళా మార్ట్ ను ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పటి వరకు సేల్స్ ఎక్కువగా ఉన్న ప్రొడక్టులను గుర్తించాం. వాటిని ఈ మార్ట్ ద్వారా విక్రయించేందుకు 20 రకాల ఉత్పత్తులను ఫైనల్ చేశాం. సర్ఫ్, జూట్ బ్యాగ్స్, ఆర్గానిక్ ప్రోడక్ట్స్, రకరకాల స్నాక్స్, మిల్లెట్ స్నాక్స్.. ఇలా మహిళల స్కిల్ కు తగిన ప్రతిఫలం దక్కేందుకు ఈ మార్ట్ ను ఏర్పాటు చేస్తున్నాం. డీ మార్ట్, ఇతర ప్రైవేట్ సూపర్​ మార్కెట్ల తరహాలోనే ఇది ఉంటుంది. మేడ్ ఇన్​ ఖమ్మం బ్రాండ్ పేరుతోనే అమ్ముతాం. ఆయా ఉత్పత్తుల పక్కనే మహిళా సంఘం వివరాలుంటాయి. ఐటీడీఏ పీవోతో మాట్లాడి మహిళా మార్ట్​ లో తేనే, ఇతర గిరిజన ఉత్పత్తుల కౌంటర్​ ను ఏర్పాటు చేస్తున్నాం. 

వైరా రోడ్​ లో ఏర్పాటు చేసే ఈ మార్ట్ కు బయట కేఫే కూడా ఉంటుంది. క్వాలిటీ బాగుంటుంది.. రేటు తక్కువగా ఉంటుంది. మార్కెటింగ్, బ్రాండింగ్, ప్యాకేజింగ్​ కోసం ఒక ఏజెన్సీతో మాట్లాడుతున్నాం. లోగో కూడా ఫైనల్ చేస్తాం. ఏప్రిల్​ మూడో వారంలో మహిళా మార్ట్ ను ప్రారంభిస్తాం. ఖమ్మంలో మొదట సక్సెస్​ అయిన తర్వాత జిల్లాలోని ఇతర మున్సిపాలిటీలకు జులై నెలాఖరు వరకు విస్తరిస్తాం. ఆ తర్వాత కస్టమర్ల ఫీడ్ బ్యాక్​ తీసుకొని, అమెజాన్​, ఫ్లిప్​ కార్ట్ లాంటి ఆన్​ లైన్​ లో కూడా ఈ ఉత్పత్తులు అమ్మేలా ప్లాన్​ చేస్తున్నాం. 

మళ్లీ వరద నగరంలోకి రాకుండా చర్యలు..

ఖమ్మంలో గతేడాది వరదల వల్ల వచ్చిన ఇబ్బందులు పునరావృతం కాకుండా చూస్తున్నాం. వరదల సమయంలో త్వరగా ఖాళీ చేయించేందుకు ఆపద మిత్రలను ట్రైనింగ్ ఇచ్చి తయారు చేసుకున్నాం. అందరినీ అలర్ట్ చేసేందుకు డివిజన్ల వారీగా కార్పొరేటర్లు, అధికారులు, స్థానికులతో వాట్సప్​ గ్రూపులను ఏర్పాటు చేశాం. వరద నగరంలోకి రాకుండా మున్నేరు రిటైనింగ్ వాల్ పనులు స్పీడ్ గా జరుగుతున్నాయి. అండర్​ గ్రౌండ్​ డ్రైనేజీ, వరద నీటి తరలింపు పనులు కూడా జరుగుతున్నాయి. 

మే నెలాఖరు వరకు నాలాలు, వరద పోయే మార్గాలన్నీ క్లియర్​ చేస్తాం. వీటితో పాటు కీలకమైన 8, 10 ప్రాంతాల్లో వరద ప్రవాహానికి అడ్డుగా, నాలాలను ఆక్రమించి కట్టిన నిర్మాణాలను గుర్తించి నోటీసులు ఇచ్చాం. లీగల్ గా చేయాల్సిన ప్రాసెస్​ అంతా చేసి, వారికి కూడా సొంతంగా సరిదిద్దుకునేందుకు తగిన సమయం, అవకాశం ఇచ్చాం. ఎవరికి వారు తొలగించుకోకుంటే, తప్పకుండా మేం ఎన్​ ఫోర్స్ మెంట్ చర్యలు తీసుకుంటాం. శిఖం పరిధిలో నిర్మాణాలు ఉంటే వర్షాకాలం ప్రారంభం అయ్యేలోపు తొలగిస్తాం