వైరా, వెలుగు : స్టూడెంట్స్ సామర్థ్యాలను పరీక్షిస్తూ ఇంగ్లీషులో మాట్లాడుకునేలా టీచర్స్ ప్రోత్సహించాలని ఖమ్మం కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ సూచించారు. శుక్రవారం కొణిజర్ల మండల కేంద్రంలోని హైస్కూల్ ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ‘వి కెన్ లెర్న్ ఇంగ్లీష్ లాంగ్వేజ్’ అమలును పరిశీలించారు. విద్యార్థులకు అందుతున్న స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సు, ఆంగ్లం మాట్లాడటంలో విద్యార్థుల పురోగతి, పాఠశాల టైం టేబుల్, తదితర అంశాలపై అడిగి తెలుసుకున్నారు.
క్లాస్ రూమ్లో కూర్చొని పాఠాలు విన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని 34 ప్రభుత్వ పాఠశాలల్లో చదివే 6వ, 7వ తరగతి విద్యార్థుల కోసం అమలు చేస్తున్న స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సును స్టూడెంట్స్ పూర్తి స్థాయిలో ఉపయోగించుకునేలా చూడాలన్నారు. విద్యార్థులు తప్పులు మాట్లాడినా వెంటనే కరెక్ట్ చేయాల్సిన అవసరం లేదని, ముందు భయం, మొహమాటం లేకుండా వారిని మాట్లాడనివ్వాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో డీఈవో సోమశేఖర శర్మ, కొణిజర్ల తహసీల్దారు, అధికారులు పాల్గొన్నారు.