
ఖమ్మం కార్పొరేషన్, వెలుగు : ‘రాజీవ్ యువ వికాసం’ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సూచించారు. కలెక్టరేట్ లో అడిషనల్ కలెక్టర్లు డాక్టర్ పి. శ్రీజ, పి. శ్రీనివాస్ రెడ్డి తో కలిసి రాజీవ్ యువ వికాసం, సన్న బియ్యం సరఫరాపై బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఏప్రిల్ 14 వరకు రాజీవ్ యువ వికాసం పథకం కోసం ఆన్ లైన్ లో, ఎంపీడీవో , మున్సిపల్ కార్యాలయాల్లోనూ దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. 50 వేల నుంచి రూ.4 లక్షల వరకు సబ్సిడీ యూనిట్లు మంజూరు చేస్తామనితెలిపారు. వ్యవసాయేతర యూనిట్లకు 21 నుంచి 55 ఏండ్ల వయస్సు ఉన్న అభ్యర్థులు, వ్యవసాయ యూనిట్లకు 60 సంవత్సరాల వరకు ఉండొచ్చని తెలిపారు.
ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాలతో దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. అభ్యర్థులకు అవసరమైన సర్టిఫికెట్లు మూడు రోజుల్లోనే జారీ చేసేలా చూడాలని తహసీల్దార్లకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. మండల, గ్రామాల జనాభా ప్రకారం యూనిట్లను మంజూరు చేయడమే కాకుండా సెక్టార్ వారీగా అభ్యర్థులకు శిక్షణ కూడా అందించనున్నామన్నారు. ప్రతి రేషన్ షాపులో తెల్లరేషన్ కార్డు లబ్ధిదారులకు ఉచితంగా సన్న రకం బియ్యం సరఫరా చేయడానికి చర్యలు చేపట్టామన్నారు. రేషన్ డీలర్ల ఓనర్ షిప్ రీ-వెరిఫికేషన్ చేస్తామని, సరిగ్గా పని చేయని రేషన్ డీలర్లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఆఫీస్‌ల్లో ప్లాస్టిక్ వాడొద్దు..
ఈనెలాఖరు నాటికి మండల కార్యాలయాలను ప్లాస్టిక్ రహితం చేయాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అధికారులకు సూచించారు. ప్లాస్టిక్ నియంత్రణపై కలెక్టరేట్ అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. మండలాల్లో తహసీల్దార్, ఎంపీడీఓ కార్యాలయాలు ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దేందుకు కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. ఏప్రిల్ తర్వాత మండల స్థాయి కార్యాలయాల్లో ఎక్కడా ప్లాస్టిక్ వాడవద్దన్నారు. మండలంలో కార్యాలయాల వద్ద ఏర్పాటు చేసిన చలి వేంద్రాల నిర్వహణను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.
గ్రామాలలో, మున్సిపాలిటీలలో బస్ స్టాప్, ఆటో స్టాండ్ ల వద్ద తప్పనిసరిగా చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీవో సన్యాసయ్య, ఎస్సీ కార్పొరేషన్ ఇన్చార్జి ఈడీ నవీన్ బాబు, జిల్లా బీసీ సంక్షేమ అధికారి జి. జ్యోతి, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి ఎన్ విజయలక్ష్మి, జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి డాక్టర్ బి. పురంధర్, పౌర సరఫరాల జిల్లా మేనేజర్ జి. శ్రీలత, కలెక్టరెట్ పరిపాలన అధికారి ఎన్. అరుణ, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, ఎల్డీఎం శ్రీనివాసరెడ్డి, బ్యాంక్ అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, గౌడ సంఘం నాయకులు మిత్రు గౌడ్, అంజయ్య తదితరులు పాల్గొన్నారు.
పాపన్న గౌడ్ కు ఘన నివాళి
సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ కు కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ఘన నివాళి అర్పించారు. బుధవారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో అధికారికంగా నిర్వహించిన పాపన్న గౌడ్ వర్ధంతి కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలన్నారు. కాగా, ఈనెల 5న డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్, 14న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి వేడుకల్లో ప్రజలు అందరూ పాల్గొనాలని కలెక్టర్ ఒక ప్రటకనలో పిలుపునిచ్చారు.