మిర్చి కొనుగోళ్లలో ఇబ్బందులు ఉండొద్దు : కలెక్టర్​ వీపీ గౌతమ్​

ఖమ్మం టౌన్, వెలుగు : మిర్చి కొనుగోళ్లలో రైతులకు ఇబ్బందులు కలుగకుండా చూడాలని ఖమ్మం కలెక్టర్‌‌‌‌ వీపీ గౌతమ్‌‌‌‌ అధికారులకు సూచించారు. మంగళవారం ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌‌‌‌ను ఆయన సందర్శించారు. మిర్చి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నాణ్యమైన మిర్చికి ధర తగ్గిస్తే చర్యలు ఉంటాయని అధికారులను కలెక్టర్​ హెచ్చరించారు. జెండా పాట రూ. 21,400 వేలు ఉందన్నారు. ఆయన వెంట జిల్లా వ్యవసాయ అధికారి విజయనిర్మల, జిల్లా మార్కెటింగ్‌‌‌‌ అధికారి ఎంఏ అలీం, పీడీ ఎంఐపీ రమణ, ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌‌‌‌ కార్యదర్శి ప్రవీణ్‌‌‌‌, ఏఈఓ షిరణ్మయి ఉన్నారు.

అదనపు ఈవీఎంల ఫస్ట్ లెవల్ తనిఖీ పూర్తి

పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు జిల్లాకు కేటాయించిన అదనపు ఈవీఎంల ఫస్ట్ లెవల్ తనిఖీ పూర్తి చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వీపీ గౌతమ్ తెలిపారు. మంగళవారం న్యూ కలెక్టరేట్ ఆవరణలోని ఈవీఎం, వీవీ ప్యాట్ల గోడౌన్ లో చేపట్టిన ఈవీఎంల ఫస్ట్ లెవల్ తనిఖీని కలెక్టర్ పరిశీలించారు. ఈనెల 5 నుంచి14వ తేదీ వరకు 1920 కంట్రోల్ యూనిట్లు, 3994 బ్యాలెట్ యూనిట్లు, 2263 వీవీ ప్యాట్లను, ఈ నెల 26, 27 తేదీల్లో అదనంగా కేటాయించిన 60 కంట్రోల్ యూనిట్ల ఫస్ట్ లెవల్ తనిఖీలు రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో పూర్తిచేసినట్లు ఆయన తెలిపారు.

కార్యక్రమంలో అడిషనల్​ కలెక్టర్ డి. మధుసూదన్ నాయక్, కలెక్టరేట్ ఎన్నికల సూపరింటెండెంట్ రాంబాబు, సిబ్బంది హుస్సేన్, టీడీపీ ప్రతినిధి పాలడుగు టీఆర్కే కృష్ణ ప్రసాద్, సీపీఎం ప్రతినిధి జి. పున్నయ్య, బీఆర్ఎస్ ప్రతినిధి చీకటి రాంబాబు, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి ఏ. గోపాల్ రావు, బీజేపీ ప్రతినిధి జీఎస్ఆర్ఏ విద్యాసాగర్, బీఎస్పీ ప్రతినిధి బి. బాలరాజు, ఆమ్ ఆద్మీ పార్టీ ప్రతినిధి స్వర్ణ సుబ్బారావుపాల్గొన్నారు. 

టెన్త్​ ఎగ్జామ్స్​ పకడ్బందీగా నిర్వహించాలి

ఖమ్మం జిల్లాలో టెన్త్​ ఎగ్జామ్స్​ పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్​ వీపీ గౌతమ్​ సూచించారు. జిల్లా వ్యాప్తంగా 16,577 మంది పరీక్షలు రాయనున్నట్లు తెలిపారు. 97 పరీక్షా కేంద్రాలు ఏర్పాటుచేశామని చెప్పారు. 97 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 98 మంది శాఖా అధికారులు, 1,983 మంది ఇన్విజిలేటర్లను నియమించామన్నారు. 53 జోన్లుగా,6 రూట్లుగా విభజించి,5 ఫ్లయింగ్ స్క్వాడ్, 97 సిట్టింగ్ స్క్వాడ్స్ ఏర్పాటుచేసినట్లు వివరించారు. ప్రతి కేంద్రం వద్ద జిల్లా విద్యాధికారి, మండల విద్యాధికారుల ఫోన్ నంబర్లు ప్రదర్శించాలని అధికారులకు సూచించారు. సెంటర్లలో అన్ని సౌకర్యాలు కల్పించాలన్నారు.