ఖమ్మం, వెలుగు : ఈనెల 9న నిర్వహించే గ్రూప్- 1 ప్రిలిమినరీ పరీక్షకు అన్ని ఏర్పాట్లు చేసి పకడ్బందీగా నిర్వహించాలని ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో గ్రూప్-1 పరీక్షల చీఫ్ సూపరింటెండెంట్లు, పరిశీలకులకు ఏర్పాటు చేసిన శిక్షణా కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ బి. సత్యప్రసాద్ తో కలిసి ఆయన మాట్లాడారు. ఉదయం 10-.30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు గ్రూప్ -1 ప్రిలిమినరీ పరీక్ష జరుగుతుందని తెలిపారు.
పరీక్ష నిర్వహణలో అలర్ట్గా ఉండాలని సూచించారు. 18 వేల 403 మంది అభ్యర్థుల కోసం 52 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పరీక్షా కేంద్రం ప్రాంగణంలోకి ఎవరూ సెల్ ఫోన్లు తీసుకొచ్చేందుకు అనుమతి లేదన్నారు. బయోమెట్రిక్ అటెండెన్స్ తీసుకునేందుకు వీలుగా అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. పరీక్షా కేంద్రాన్ని చీఫ్ సూపరింటెండెంట్, అధికారులు పూర్తి స్థాయిలో తనిఖీ చేయాలని చెప్పారు. 13 ఫ్లయింగ్ స్క్వాడ్, 52 మంది శాఖాధికారులు, 184 మంది గుర్తింపు అధికారులు నియమించినట్లు తెలిపారు.
పరీక్షా కేంద్రం ప్రవేశం, చీఫ్ సూపరింటెండెంట్ రూమ్, హాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో రీజనల్ కోఆర్డినేటర్లు, విజయ ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జాన్ బాబు, ఎస్బీఐటీ ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్జి. రాజ్ కుమార్, కలెక్టరేట్ ఏవో అరుణ, అధికారులు పాల్గొన్నారు.
వీఎంలను భద్రపర్చాలి
ఈవీఎంల భద్రతా ఏర్పాట్లు పక్కాగా ఉండాలని ఎన్నికల అధికారి, కలెక్టర్ వీపీ గౌతమ్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ ఆవరణలోని ఈవీఎం, వీవీ ప్యాట్ గోడౌన్ లో లోకసభ సాధారణ ఎన్నికల ఈవీఎంలను, రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో భద్రపరిచి గదులకు సీల్ వేశారు. ఖమ్మం లోకసభ ఎన్నికల్లో వినియోగించిన కంట్రోల్ యూనిట్లు, బ్యాలెట్ యూనిట్లు అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా ఆయా గదుల్లో భద్రపరిచారు. రిటర్నింగ్ అధికారి, సహాయ రిటర్నింగ్ అధికారులు, సెగ్మెంట్ తహసీల్దార్లు ఈవీఎం యంత్రాలను లెక్కపెట్టి సరిచూసుకున్నారు.
అనంతరం జిల్లా కోశాగార స్ట్రాంగ్ రూంలో భద్రపరచిన స్టాట్యూటరీ కవర్లు, వీవీ ప్యాట్ స్లిప్పులు, ఈవీఎం పేపర్లు, 17-సీ, పీవో డైరీ తదితర పత్రాల భద్రతను పరిశీలించారు. కార్యక్రమంలో ఖమ్మం నగరపాలక సంస్థ కమిషనర్ ఆదర్శ్ సురభి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి. సత్యప్రసాద్, ఎస్డీసీ ఎం. రాజేశ్వరి, తహసీల్దార్లు వెంకటేశ్వర్లు, శ్రీనివాసరావు, సీహెచ్. స్వామి, రాంప్రసాద్, కలెక్టరేట్ సూపరింటెండెంట్లు మదన్ గోపాల్, రాంబాబు, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి తుళ్ళూరి బ్రహ్మయ్య, బీజేపీ ప్రతినిధి వి. రాజేశ్, బీఆర్ఎస్ ప్రతినిధి జి. నాగరాజు, టీడీపీ ప్రతినిధి పాలడుగు కృష్ణప్రసాద్, ఆమ్ ఆద్మీ పార్టీ ప్రతినిధి స్వర్ణ సుబ్బారావు, స్వతంత్ర్య అభ్యర్థులు టి. సోగ్రామ్ నాయక్, బి. సునీల్ నాయక్, అధికారులు ఉన్నారు.