ప్రభుత్వ స్కూళ్లలోనే పిల్లలను చేర్పించాలి : వీపీ గౌతమ్

ప్రభుత్వ స్కూళ్లలోనే పిల్లలను చేర్పించాలి : వీపీ గౌతమ్

ఖమ్మం, వెలుగు : --ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను పెద్ద సంఖ్యలో చేర్పించాలని, బడిబాట కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని ఖమ్మం కలెక్టర్ వీపీ  గౌతమ్ అధికారులకు సూచించారు. మంగళవారం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్​లో బడిబాట, అమ్మ ఆదర్శ పాఠశాలల పనుల పూర్తిపై విద్యాశాఖ, ఇంజినీరింగ్, మండల సమాఖ్యలతో జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. 

బడిబాట కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికీ వెళ్లి, బడిఈడు పిల్లలను గుర్తించి వారి వివరాలు సేకరించి వారందరినీ ప్రభుత్వ స్కూళ్లలో చేర్పించేలా చూడాలన్నారు. పాఠశాలల్లో సదుపాయాల కల్పన, ఇంగ్లిష్ మీడియం బోధనపై అవగాహన కల్పించాలని చెప్పారు. అంగన్​వాడీ కేంద్రాల్లో చదువుకొని అప్ గ్రేడ్ అవుతున్న ఐదు నుంచి ఆరు సంవత్సరాల వయసున్న చిన్నారులందరూ ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేలా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల ప్రతిభ, విద్యా బోధన పై విద్యాశాఖ అధికారులు స్పెషల్​ఫోకస్​ పెట్టాలని చెప్పారు. 

ప్రభుత్వ పాఠశాలల్లో కిచెన్ షెడ్డు, టాయిలెట్స్ మిగిలిన నిర్మాణ పనులు వేగవంతం చేసి వారంలోపు పూర్తి చేయాలని ఆదేశించారు. నిధుల మంజూరులో ఎలాంటి జాప్యం జరగకూడదని  సూచించారు. స్కూళ్ల రీ ఓపెన్​రోజే పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్స్ అందించాలన్నారు. అన్ని స్కూళ్లలో శానిటేషన్ పనులు చేపట్టాలని చెప్పారు. 12న స్కూళ్లను ముస్తాబు చేయాలని సూచించారు. 

అనంతరం రమణగుట్ట రజక వీధి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను ఆయన సందర్శించారు. అద్దె ఇంట్లో వసతుల లేమితో నిర్వహిస్తున్న పాఠశాలకు వెంటనే స్థల గుర్తింపు చేసి, భవన నిర్మాణానికి చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. అక్కడే ఉన్న ప్రభుత్వ స్థలాన్ని కలెక్టర్ పరిశీలించారు. రెవెన్యూ అధికారులతో సర్వే చేపట్టి తదుపరి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆయన వెంట జిల్లా విద్యాధికారి సోమశేఖరశర్మ, ఖమ్మం అర్బన్ మండల విద్యాధికారి శ్రీనివాసరావు, టీచర్లు ఉన్నారు.