ఖమ్మం టౌన్, వెలుగు : ప్రణాళికాబద్ధంగా జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల బడ్జెట్ రూపకల్పన చేయాలని ఖ మ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ తెలిపారు. ఈ విషయమై శుక్రవారం మున్సిపల్ కమిషనర్లతో కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వేతనాలు, కరెంట్ చార్జీలు, సీసీ చార్జీలు, రుణాల చెల్లింపులకు ప్రాధాన్యం కల్పించాలన్నారు. మున్సిపాలిటీల్లో విలీన గ్రామాల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని చెప్పారు. మున్సిపాలిటీల్లో డంపింగ్ యార్డు నిర్మాణం చేయాలన్నారు.
ప్రాపర్టీ టాక్స్ వంద శాతం వసూలుకు కృషి చేయాలని సూచించారు. వేసవిలో తాగునీటి సమస్యలు లేకుండా చూడాలన్నారు. ఎల్ఆర్ఎస్ మీద దృష్టి పెట్టాలన్నారు. సమావేశంలో స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ బి.సత్యప్రసాద్, సత్తుపల్లి, మధిర, వైరా మున్సిపల్ కమిషనర్లు సుజాత, రమాదేవి, కరుణాకర్ రెడ్డి, ఖమ్మం మున్పిపల్ కార్పొరేషన్ ఈఈ కృష్ణలాల్, జెఏవో లు శివలింగం, ప్రసాద్, అధికారులు పాల్గొన్నారు.
కూలిన ఓల్డ్ లైబ్రరీ పరిశీలన
ఖమ్మంలో కూలిన లైబ్రరీ ఓల్డ్ బిల్డింగ్ శిథిలాలను కలెక్టర్ గౌతమ్, సీపీ సునీల్ దత్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రంథాలయ భవనంలోని ఒక బ్లాక్ కూలిన సంఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదన్నారు. ఎంతమేర నష్టం జరిగిందని ఇంజినీర్లతో అంచనా వేయిస్తామని చెప్పారు. వారం రోజుల పాటు పాఠకులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు. కూలిపోయిన బ్లాక్, దానికి ప్రక్కనే ఉన్న పాత భవనం అంతా కూల్చివేసి కొత్త నిర్మాణం చేపడతామన్నారు.